Reading Time: < 1 minute

గువాహటి: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టి-20ల సిరీస్‌ని ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడో టి-20లో 154 పరుగుల విజయ లక్ష్యాన్ని సూర్యకుమార్ సేన కేవలం పది ఓవర్లలోనే చేధించింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ఇలా అన్ని విభాగాల్లో రాణించి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీం ఇండియాని కొనియాడారు. త్వరలో టి-20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

అయితే ఈ మెగా టోర్నీ బరిలో రెండు భారత జట్లు దిగితే.. ఆ రెండు ఫైనల్స్‌కి చేరుకుంటాయని గవాస్కర్ పేర్కొన్నారు. మూడో టి-20లో సైమన్ డౌల్‌తో కలిసి కామెంటేటర్‌గా గవాస్కర్ వ్యవహరించారు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (68 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (57 నాటౌట్) ఆడిన తీరు.. 10 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించిన విధానం చూసి డౌల్ షాక్ అయ్యారు. టీం ఇండియా బ్యాటింగ్ డెప్త్ అమోఘమని కొనియాడారు. రానున్న టి-20 ప్రపంచకప్‌లో భారత్ కోరుకుంటే రెండు జట్లను బరిలోకి దించితే.. ఆ రెండు సెమీ ఫైనల్‌కి చేరుతాయని డౌల్ అన్నారు.

అయితే డౌల్ మాటలతో ఏకీభవించిన గవాస్కర్.. భారత ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి జట్లు ట్రోఫీ పోరులో ఉంటే.. సెమీ ఫైనల్స్‌కే కాదు.. ఏకంగా ఫైనల్స్‌కి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ జట్లు రెండు తలపడితే.. అది ప్రపంచకప్ ఫైనల్ లానే ఉంటుందని తెలిపారు. భారత్ కేవలం బ్యాటింగ్‌లో మాత్రమే కాదని.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా అదరగొడుతుందని.. జట్టు ఆటతీరు అమోఘమని అన్నారు. ఇక నిన్నటి మ్యాచ్‌లో 14 బంతుల్లోనే అర్థ శతకం సాధించిన అభిషేక్‌ని ప్రత్యేకంగా ప్రశంసించారు. అతడు ఇలాగే ఆటను కొనసాగిస్తే.. త్వరలోనే యువరాజ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉందని గవాస్కర్ అన్నారు.