Reading Time: < 1 minute

అవని వొళ్ళు విరుచుకుంటుంది

మట్టి సుగంధ పరిమళమై గాలిలో తేలుతుంది

ఎండి పగుళ్ళు బారిన మట్టి దేహాలు ఒక్కటవుతాయి

పలపల రాలే చినుకులు

రైతుల గుండెల్లో ఆనంద తాండవమాడతాయి

పొలాల్లో నాగళ్ళు నాట్యం చేస్తాయి

పచ్చని పైరు తల్లులు హాయిగా తలలూపుతాయి

వానొస్తే మనిషి జీవితమే పులకరించి పోతుంది

మనుషుల్లో ఆత్మీయతానురాగాలు నింపుతుంది

వానొస్తే అడవి విరబూస్తుంది

చెట్టూ పుట్టా కనికరిస్తాయి

పువ్వూ పిట్టా పలకరిస్తాయి

నెమళ్లు ఆనందంతో నాట్యం చేస్తాయి

వానొస్తే వరదొస్తే ఆకాశం ఇంద్రధనుస్సయితే

భూమి అణువణువూ పరవశించి పరవళ్లు తొక్కుతుంది

వానొస్తే బాల్యం ఎగిరెగిరి దూకుతుంది

చినుకుల్లో పడుతూ లేస్తూ చిందులేస్తుంది

నీళ్లల్లో పడవ విహారాలు చేస్తుంది

వానొస్తే ముసలీ ముతకా చెట్టూ చేమా

బతికి బట్ట కడుతుంది

వానొస్తే వాతావరణమే కాదు

మనిషి జీవితమే చల్లబడిపోతుంది

వానొస్తే మనిషే మొలకెత్తి

మానవతై పచ్చగా చిగురిస్తాడు

– మంచికంటి