
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ బోనిగర్లపాడులో ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. బోనిగర్లపాడు గ్రామంలో నివాసం ఉంటున్న మేకల గణేశ్ (18), తలపల రమేశ్ (18) అనే యువకులు ఓ పని నిమిత్తం స్వగ్రామం నుంచే వేరే ప్రాంతానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమం లో కంది పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ వీరికి తాకింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైక్ పూర్తిగా కాలిపోగా, యువకులిద్దరూ సజీవ దహనమయ్యారు. దీంతో బోనిగర్లపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. చేతికి అందివచ్చిన కుమారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.