
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగానే విజయం సాధిస్తామని తమిళ నటుడు సూపర్‌స్టార్ విజయ్ తెలిపారు. ఎన్నికల్లో ఒంటరిగా గెలిచే సైన్యం టివికేకు ఉందని అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో టివికే విజయ్ బహిరంగసభ నిర్వహించారు. టివికే పార్టీకి ఇసి విజిల్ గుర్తు కేటాయించాక అధినేత తొలి సభలో విజిల్ గుర్తును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇది ఎన్నికల పోరు కాదు.. ప్రజాస్వామ్య పోరు అని.. అన్నాడిఎంకే ప్రత్యక్షంగా బిజెపికి సరైండరైందని తెలియజేశారు. టివికే పార్టీ మాత్రం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గదని, టివికే మీద ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులో అవినీతి అంతానికి సమయం ఆసన్నమైందని, డిఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందని విజయ్ సూచించారు. ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని.. దేనికీ రాజీపడే ప్రసక్తే లేదని, మనందరం కలిసికట్టుగా ఉంటే విజయం మనదేనని పేర్కొన్నారు. తాము తీసుకువచ్చే పాలసీల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని విజయ్ అన్నారు.