
మన తెలంగాణ/ నాంపల్లి: హైదరాబాద్ లోని నాంపల్లి స్టేషన్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం బచాస్ ఫర్నిచర్ క్యాజిల్ దుకాణం, గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్టు గుర్తించారు. రెండు మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. ఫర్నీచర్ షాపులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. తొలుత సెల్లార్‌లో ఒక్కసారిగా నల్లటి పొగలు, అగ్నికీలలు వ్యాపించి క్రమంగా పైన నాలుగు అంతస్తుల వరకూ ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఫర్నిచర్, వస్తువులు, ఇతర సామగ్రి అగ్నికీలల్లో బుగ్గిగా మారాయి. వారిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు ఫైరింజిన్, పోలీసులు, హైడ్రా ఇతర సిబ్బంది శతవిధాలా యత్నిస్తున్నారు.
పై అంతస్తుల్లో ఉన్న సంతోష్ అనే యువకుడు మెట్ల ద్వారా కిందికి సురక్షితంగా వచ్చేశారు. మరికొందరు టెండర్ పేరుతో పిలిచే కుక్కను కూడా కిందికి తీసుకొచ్చారు. మంటలు, పొగలు ఆలుముకోవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఫర్నీచర్ దుకాణంలో పలువురు మహిళలు బయటికి వచ్చేశారు. ఈ ప్రమాదంలో సుమారు ఐదు కోట్ల వరకు ఫర్నీచర్లు, వస్తువులు, ఇతర పరికరాలు మంటల దాటికి కాలిపోయాయి.