
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సైనిక చర్యకు సిద్ధమయ్యారు. ఫైటర్ జెట్ విమానాలను,విమాన వాహక యుద్ధ నౌకలను మోహరించారు. ఏ క్షణమైనా విరుచుకు పడేందుకు కట్టుదిట్టమైన సిద్ధపడ్డారు. గురువారం దావోస్ వేదికగా ట్రంప్ తన బోర్డ్ ఆఫ్ పీస్ ను ప్రారంభిస్తూ, ఇది స్థిరత్వాన్ని సాధించేందుకు, ఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో శాశ్వత శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేసే అంతర్జాతీయ సంస్థ అని ప్రకటించిన 24 గంటలలోనే యుద్ధసన్నాహాలు మొదలయ్యాయి. మరో పక్క ఇజ్రాయెల్ పరిస్థితిని గమనిస్తూ ఉంది. ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ప్రదర్శనలు పెచ్చు పెరగడం, సైన్యం కాల్పులలో వేలాది మంది మరణించడం పై గతంలోనే ట్రంప్ ఇరాన్ కు బలమైన హెచ్చరిక చేశారు. నిరసన కారులపై హింసాత్మక అణచివేత నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకు అమెరికా అరేబియా సముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుఎస్‌ఎస్ అబ్రహం లింకన్, గైడెడ్ – క్షిపణి వ్యవస్థలతో కూడిన విమానవాహక నౌకలు ఉంటాయని అమెరికా అధికారులు తెలిపారు.
దాడికి సిద్ధంగా ఉన్న ఆయుధ శ్రేణి లో యుద్ధవిమానాలు, యుద్ధనౌకలతో పాటు జలాంతర్గాములు ఉన్నాయి. ప్రస్తుతానికి అవి హిందూ మహా సముద్రం, దక్షిణచైనా సముద్రంలో మోహరింపబడి ఉన్నాయి. ట్రంప్ ఊ అంటే, పశ్చిమాసియా ప్రాంతం వైపు దుసుకువెళ్లే పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్, క్షిపణిదాడులను ఎదుర్కొనేందుకు 2024 ఏప్రిల్ లో మోహరించిన అదే స్క్వాడ్రన్ కు చెందిన ఎఫ్- 15ఇ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ లు ఇప్పటికే పశ్చిమాసియాలో సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో పేరు ప్రకటించని స్థావరంలో విమానం ల్యాండింగ్ అవుతున్నట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. యుద్ధ సన్నాహాలు ఎంత విసృ్తతంగా ఉన్నాయంటే, యుద్ధవిమానాలకు ఆకాశంలోనే ఇంధనం అందించే కెసి – 135 వైమానిక రీ ఫ్యూయలర్లను సన్నద్ధం చేశారని అమెరికా మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్, ఖతార్ వంటి అమెరికా మిత్రదేశాల సాయంతో క్షిపణి నిరోధక వ్యవస్థలు తహాద్, పేట్రియాట్ లను పశ్చిమాసియా ఇంతటా మోహరించి ఉన్నట్లు అమెరికా పత్రికలు వార్తలు చెబుతున్నాయి.