Reading Time: < 1 minute

మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి తాజా సంచలన విజయం ’అనగనగా ఒక రాజు’తో మరో స్థాయికి చేరుకున్నారు. ఈ చిత్రం నవీన్ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100.2 కోట్ల గ్రాస్‌ను సాధించి, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం, మొదటి షో నుంచే విశేష స్పందనను సొంతం చేసుకుంది. హౌస్‌ఫుల్ ప్రదర్శనలు, మళ్లీ మళ్లీ కుటుంబ ప్రేక్షకుల రాకతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఫలితంగా ఇది చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

సంక్రాంతికి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, కేవలం నాలుగు రోజుల్లోనే అన్ని ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అనేది అరుదైన ఘనతగా మారింది. అన్ని ప్రాంతాల్లోనూ సంచలన వసూళ్లతో భారీ విజయాన్ని సాధించింది. ఈ సంచలనాత్మక ప్రదర్శనతో, నవీన్ పొలిశెట్టి తన నాలుగో వరుస బ్లాక్‌బస్టర్‌ను సాధించి, తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విశ్వసనీయ తారలలో ఒకరిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మరో మైలురాయిని నమోదు చేసింది.

యూఎస్‌లో నవీన్ పొలిశెట్టి వరుసగా మూడు సినిమాలతో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించిన ఘనతను అందుకున్నారు. ఇది కొద్దిమందికే దక్కిన అరుదైన విజయంగా నిలిచింది. అంతేకాదు, రోజువారీ కలెక్షన్లు బలంగా కొనసాగుతుండటంతో ’అనగనగా ఒక రాజు’ ఇప్పుడు ప్రతిష్టాత్మక 2 మిలియన్ డాలర్ల మార్క్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. కడుపుబ్బా నవ్వించే హాస్యం, కంటతడి పెట్టించే భావోద్వేగాలతో రూపొందిన ’అనగనగా ఒక రాజు’ చిత్రం అన్ని వయసుల, అన్ని ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అసలు సిసలైన సంక్రాంతి ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.