
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బిజెపి)కి కొత్త సారథి వచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు జెపి నడ్డా పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నిక జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు నితిన్ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు.
బిహార్‌కు చెందిన నితిన్ నబీన్(46)ను గతేడాది డిసెంబర్‌లో బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ.. పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు అప్పుడే వార్తలు వచ్చాయి. కాయస్థ సామాజికవర్గానికి చెందిన నబీన్ సిన్హాకు ఆరెస్సెస్ నేపథ్యం ఉంది. గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపుర్ నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా నితిన్ గెలిచారు. బిహార్ నుంచి పార్టీలో ఆ స్థాయికి చేరిన తొలి నేతగా ఆయన గుర్తింపు పొందారు.