Reading Time: < 1 minute

లక్నో: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్‌డోగరా బయలేర్దిన్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా దాన్ని లక్నోలో ల్యాండింగ్ చేశారు. ఆదివారం 238 ప్రయాణికులతో ఈ విమానం బయలుదేరింది. విమానం గాల్లో ఉన్న సమయంలో టాయిలెట్‌లోని ఓ టిష్యూపై విమానంలో బాంబు ఉన్నట్లు రాసి ఉన్న బెదిరింపు నోట్‌ను సిబ్బంది గుర్తించారు.

వెంటనే అప్రమత్తమైన పైలెట్లు లక్నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థించారు. దీంతో లక్నో విమానాశ్రయ అధికారులు ఫైర్ టెండర్లు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికలను సురక్షితంగా కిందకు దించేశారు. అనంతరం విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. విమానాన్ని టెర్మినల్ ప్రాంతంలో ఉంచినట్లుగా అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.