
సింగర్ చిన్మయి (Chinmayi Sripaada) రూటే సెపరేటు. తెలుగు, తమిళ భాషల్లో తన గొంతుతో.. తన పాటలతో ప్రేక్షకులకు దగ్గరైన చిన్మయి, సమస్యలపై గళం ఎత్తుతూ నెటిజన్లకు మరింత దగ్గరైంది. ఈ క్రమంలోనే, ఆమె ఎలాంటి ట్వీట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది. ఎందుకంటే, మహిళలకు సంబంధించిన సమస్యలు, వేధింపులు లేదా అన్యాయ ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించే విధానం భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్‌తో మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన హిందీ వెబ్ సిరీస్ ‘చిరైయా’ (Chiraiya) సిరీస్ కథను సమర్థిస్తూ, పురుషుల తీరును ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది. ఈ మేరకు అత్యాచార అశ్లీల చిత్రాలను చూసిన పురుషులకు, ఇది వారి కల నిజమైనట్లే అని ఈ ఫోటో పంచుకుంది.
నిజానికి, వైవాహిక అత్యాచారం (Marital Rape) అనే సున్నితమైన అంశం చుట్టూనే ‘చిరైయా’ కథ సాగుతుంది. ఇంకా అర్ధమయ్యే రీతిలో చెప్పాలంటే.. పెళ్లి అయినప్పటికీ భార్య అంగీకారం లేకుండా భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొంటే, అది కూడా అత్యాచారంగా పరిగణించాలనే సందేశాన్ని ఈ సిరీస్ బలంగా చెబుతుంది. ఇపుడు ఈ సిరీస్ ప్రశ్నించిన అంశంతోనే చిన్మయి ట్వీట్ చేసింది.
ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా పోస్టులో, మహిళల హక్కులు, వైవాహిక సంబంధాల్లో సమ్మతి వంటి అంశాలపై చిన్మయి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అశ్లీల కంటెంట్ ప్రభావం వల్ల కొంతమంది పురుషుల్లో తప్పుదారి పట్టిన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. పెళ్లైన తర్వాత మహిళ ఎప్పుడూ శృంగారానికి సిద్ధంగా ఉండాలనే భావన సరైంది కాదని, వైవాహిక జీవితంలో కూడా పరస్పర సమ్మతి అత్యంత ముఖ్యమని తన ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.
ప్రత్యేకంగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం ఇవ్వకుండా నిర్దిష్ట సమయాల్లో శారీరక సంబంధం కోరడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, తన వ్యక్తిగత పరిమితులు, అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.
చిన్మయి ఫోటోని ఉద్దేశిస్తూ..‘‘అత్యాచార అశ్లీల చిత్రాలను చూసిన పురుషులకు, ఇది వారి కల నిజమైనట్లే. అందుకే వైవాహిక అత్యాచారం అనేది ఒక సమస్యే కాదు,పెళ్లైన స్త్రీ శృంగారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే, ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో, ఒక స్త్రీకి ఒకరినొకరు తెలుసుకోవడానికి గానీ, సన్నిహితంగా ఉండటానికి గానీ సమయం దొరకనప్పుడు – జ్యోతిష్యుడు నిర్ణయించిన ముహూర్తంలో సంభోగం జరపాలన్న డిమాండ్ పెద్ద చర్చకు దారితీస్తుంది.. కానీ వీటన్నిటికీ నేను సిద్ధంగా లేను’’ అని చిన్మయి ట్వీట్ చేసింది
For men who have consumed rape pornography – this is their dream come true.
Which is why marital rape is a non issue and a married woman must always be ready to have sex. If she says no, especially in an arranged marriage setting where a woman and a man barely have time to know… https://t.co/nvskMVpQLx
— Chinmayi Sripaada (@Chinmayi) March 31, 2026
‘చిరైయా’ సిరీస్ విషయానికి వస్తే:
‘చిరైయా’ సిరీస్ జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ తెలుగులో అందుబాటులో ఉంది. శశాంత్ షా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్లో దివ్య దత్తా, సంజయ్ మిశ్రా, ప్రసన్న బిష్ఠ్, సిద్ధార్థ్ షా,ఫైసల్ రషీద్ తదితరులు నటించారు. మొత్తం 6 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ బెంగాలీలో వచ్చిన ‘సంపూర్ణ’ వెబ్ సిరీస్కు రీమేక్గా తెరకెక్కింది.
‘చిరైయా’ కథేంటంటే:
ఈ కథ ఒక సంప్రదాయ భారతీయ కుటుంబ నేపథ్యంలో సాగుతుంది. కమలేష్ (దివ్యదత్తా) వాళ్లింట్లో పెద్ద కోడలు. భార్యగా, కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ కుటుంబాన్ని నడుపుతుంది. తన మరిది అరుణ్ (సిద్ధార్థ్ షా)ను కన్న కొడుకులా చూసుకుంటుంది. అతను ఎప్పుడూ తప్పు చేయడని నమ్ముతుంది.
అరుణ్‌కు పూజా (ప్రసన్న బిష్త్)తో పెళ్లి జరుగుతుంది. వాళ్ల మొదటి రాత్రి అరుణ్ తనను లైంగికంగా వేధించాడని కమలేష్‌తో చెప్తుంది పూజ. అరుణ్ గురించి తప్పుగా చెప్పడంతో కమలేష్‌కు కోపం వచ్చి, పూజను చెంపపై కొడుతుంది. పూజకు ఇష్టం లేకపోయినా పదే పదే బలవంతంగా శృంగారం చేస్తాడు. ఇలా అరుణ్ లోని రాక్షసుడు బయటకు వచ్చిన నిజాన్ని చాలా ఆలస్యంగా పసిగడుతుంది కమలేష్.
ఇక ఫ్యామిలీ గౌరవం కాపాడాలా? లేక పూజకి న్యాయం చేయాలా? అనే తీవ్రమైన సంఘర్షణలో పడుతుంది. ఆ తర్వాత ఈ సమస్యకు కమలేష్ ఎలా పరిష్కారం కనుగొంటుంది? చివరకు పూజ ఈ హింస నుంచి బయటపడిందా? అన్నది తెలుసుకోవాలంటే ‘చిరైయా’ సిరీస్ చూడాల్సిందే!
ఎలా ఉందంటే:
‘చిరైయా’ సాధారణ ఫ్యామిలీ డ్రామా కాదు. వైవాహిక అత్యాచారం (Marital Rape) వంటి సున్నితమైన అంశాన్ని నేరుగా, ఎలాంటి కమర్షియల్ ముసుగులు లేకుండా చూపించడానికి ప్రయత్నించిన కంటెంట్ ఇది. ముఖ్యంగా భారతీయ కుటుంబ వ్యవస్థలో “భర్త హక్కు” అనే పేరుతో దాచిపెట్టబడే సమస్యను ప్రశ్నించడం ఈ సిరీస్ ప్రధాన బలం.
దర్శకుడు శశాంత్ షా కథను మెలోడ్రామాటిక్‌గా (భావోద్వేగాలను, నాటకీయతను) ఎక్కువ చూపించకుండా, రియలిస్టిక్ టోన్‌లో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినా, భావోద్వేగ తీవ్రతను నిలబెట్టే విధంగా కథనం కొనసాగుతుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, దివ్య దత్తా పాత్ర సిరీస్‌కు బ్యాక్‌బోన్‌లా నిలుస్తుంది. కుటుంబ గౌరవం, న్యాయం మధ్య ఇరుక్కుపోయిన మహిళగా ఆమె నటన ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే సంజయ్ మిశ్రా తన అనుభవంతో పాత్రకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా కథకు తగ్గట్టుగా సహజమైన నటనను కనబరిచారు. మొత్తంగా ‘చిరైయా’ ఒక బోల్డ్, ఆలోచింపజేసే వెబ్ సిరీస్. కమర్షియల్ ఎంటర్టైన్‌మెంట్ కంటే కంటెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చే ప్రేక్షకులకు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.