
ప్రస్తుతం జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ తర్వాత భారత మహిళ జట్టు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్.. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టి-20లు, ఒక టెస్ట్ మ్యాచ్‌లో తలపడుతుంది. ఈ పర్యటనకు వెళ్లే వన్డే, టి-20 జట్లను ప్రకటించింది. గాయాల నుంచి కోలుకొని ప్రస్తుతం డబ్ల్యూపిఎల్‌లో అదరగొడుతున్న శ్రేయాంక పాటిల్‌కి టి-20 జట్టులో చోటు దొరికింది. ఇక ఆరు సంవత్సరాల తర్వాత భారతి పుల్మాలి టి-20 జట్టుకు ఎంపికైంది. ఆమె చివరిసారిగా 2019లో టీం ఇండియా తరఫున ఆడింది. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టుకు దూరమైంది.
భారతి గతేడాది, ఈ ఏడాది డబ్ల్యూపిఎల్‌లో ఓ మోస్తరు ప్రదర్శనలతో ఆకట్టుకుంది. దీంతో ఆరేళ్ల తర్వాత ఆమెకు జట్టులో చోటు దొరికింది. అయితే అనూహ్యంగా డబ్ల్యూపిఎల్‌లో రాణిస్తున్న హర్లీన్ డియోల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఆమెకు వన్డే జట్టులో చోటు దక్కింది. ఇక వన్డే జట్టులో పలు ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. ఓపెనర్ ప్రతికా రావల్ గాయపడటంతో ఆమె స్థానంలోకి షెఫాలీ వర్మ ఓపెనర్‌గా వచ్చింది. ఇక వికెట్ కీపర్ యస్తికా భాటియా కూడా శస్త్ర చికిత్స తర్వాత రీహాజ్‌లో ఉండటంతో ఈ సిరీస్‌కి దూరమైంది. జి కమలినికి వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించారు. ఈ జట్టులో రాధా యాదవ్, అరుంధతి రెడ్డిలకు చోటు దక్కలేదు. కశ్వీ గౌతమ్ కొత్తగా జట్టులోకి వచ్చింది.
ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధన (వైస్ కెప్టెన్), షెఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), జి కమలిని (కీపర్), అరుంధతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, శ్రేయంక పటిల్.
ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధన (వైస్ కెప్టెన్), షెఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), జి కమలిని (కీపర్), కశ్వీ గౌతమ్, అమన్‌జోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్.