
హైదరాబాద్: రాజకీయ ప్రయాణం మొదట ఖమ్మం జిల్లాలో మొదలు పెట్టానని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేవరకు మీరందరూ తనకు అండగా నిలబడ్డారని అన్నారు. ఖమ్మం జిల్లాలో సిఎం పర్యటించారు. రూ. 362 కోట్ల విలువైన పనులకు సిఎం శ్రీకారం చుట్టారు. ఏదులాపూర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్, నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన ప్రసంగించారు. సభకు వచ్చిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలకు ధన్యవాదాలు తెలియజేశారు. 2007-08 ఖమ్మం జిల్లాకు వచ్చానని, మధిరలోని కొన్ని గ్రామాల్లో టిడిపి కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఉచితంగా సన్నబియ్యం పథకం మొదలు పెట్టామని, గత ప్రభుత్వం రేషన్ కార్డు రావాలంటే ఉన్న వాళ్లలో ఎవరో చనిపోవాలనే పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మన ప్రజాపాలనలో లక్షలాది రేషన్ కార్డులను పేదలకు అందించామని, రేషన్ కార్డులు లేనివారికి రేషన్ కార్డులు ఇవ్వండని.. అధికారులకు సూచించారు. సన్న బియ్యం ఇచ్చిపేదవాడి ఆకలి తీర్చాలనేది కాంగ్రెస్ లక్ష్యం అని.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ ఆశయాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని.. సిఎం పేర్కొన్నారు. తెలంగాణ టిడిపి ఉండకూడదని కక్ష కట్టిన బిఆర్ఎస్ ను బొంద పెట్టాలని విమర్శించారు. రైతులకు 9 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని కొనియాడారు. ఇప్పుడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, బిఆర్ఎస్ ఎవరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చిందా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు.
బిఆర్ఎస్ పేదవాడిపై కుట్ర చేసి.. ఇళ్లు ఇవ్వకుండా చేసిందని, బిఆర్ఎస్ మోచేతి నీళ్లు తాగాలని అన్నట్లుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై టెండర్ల గురించి కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రత్యక్షంగా, పరోక్షంగా కుంభకోణం జరిగిందని కొన్ని పత్రికలు రాస్తున్నాయని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయని, సింగరేణిలో బొగ్గు స్కామ్ అని వార్తలు రాస్తున్నారని సింగరేణి టెండర్ ను అనుభవం ఉన్నవారికే ఇస్తామని అన్నారు. సింగరేణి టెండర్ విషయంలో అణాపైసా కూడా అవినీతికి ఆస్కారం లేదని తన మంత్రులపై వార్తలు రాసే ముందు తన వివరణ తీసుకోండని.. మీడియాకు వివరణ ఇచ్చేందుకు తాను ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానని అన్నారు. రెండేళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వలేదని, అనవసర ప్రచారం చేస్తూ.. మారీచుడు, శుక్రాచార్యుడు బలపడడానికి అవకాశం కల్పిస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.