Reading Time: < 1 minute

అమరావతి: దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ రాకముందు చదువులేని వ్యక్తులే ఎక్కువగా రాజకీయాల్లో ఉండేవారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మదరాసి అని అవహేళన చేస్తే.. తెలుగుజాతి ఒకటి ఉందని ఎన్టిఆర్ గుర్తు చేశారని అన్నారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో ఎన్టిఆర్ వర్దంతి కార్యక్రమం జరిగింది. ఎన్టిఆర్ విగ్రహానికి సిఎం పార్టీ నేతలతో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మంగళగిరిలో ప్రసంగించారు. బిసిలకు స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు ఎన్టిఆర్ కల్పించారని, మహిళలకు ఆస్తిలో సగం వాటా కల్పించింది ఎన్టిఆర్ అని.. టిటిడిలో అన్నదానం కార్యక్రమం మొదలు పెట్టింది ఎన్టిఆర్ అని కొనియాడారు.

చదువుకున్న వారికే ఎన్టిఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఎన్టిఆర్ పార్టీ పెట్టారని తెలియజేశారు. త్వరలో మరో 700 అన్న క్యాంటీన్లు ఏర్పాట్లు చేస్తున్నామని, ఉగాది రోజున మరో 5 లక్షల గృహప్రవేశాలు ఉంటాయని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు సమర్థవంతంగా అమలు చేశామని, ఆర్థిక ఇబ్బందులున్నాఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పూర్వీకులు ఇచ్చిన భూమికి.. గత పాలకుల ఫోటోలు పెట్టుకున్నారని, ఎక్కడికి పోయినా 80 శాతం ఫిర్యాదులు భూముల పైనే వస్తున్నాయని అన్నారు. గ్రామాధికారులను రద్దు చేసిన నాయకుడు ఎన్టిఆర్ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.