
సింగారవేలు చెట్టియార్ ఎవరు?
షాపూర్జీ సక్లత్‌వాలా పేరు విన్నారా?
సోహన్‌సింగ్ బక్నా ఏం చేశారు!
ఆచార్య నరేంద్రదేవ్ సాహసం ఏమిటి?
జతిన్‌దాస్, సూర్యసేన్, గణేష్ ఘోష్‌లను ఎందుకు తలచుకోవాలి?
ఫిలిప్ స్ప్రాట్, బెంజిమిన్ ఫ్రాన్సిస్ బ్రాడ్లేలు మనకేం అవుతారు? హేముకలానీ, కనకలతా బారువా పేర్లు తెలుసా? రాజమహేంద్ర ప్రతాప్ ఏవరు? ఎం.ఎన్.రాయ్ లెనిన్‌తో ఏమన్నాడు? జడ్.ఎ. అహ్మద్, సజ్జాద్ జహీర్, మక్దూం మొహియుద్దీన్‌ల పాత్ర ఏమిటి?
ఎస్వీఘాటే, గంగాధర అధికారి ఏం చేశారు?
లాలాలజపతిరాయ్‌ని చంపిందెవరు?
సర్వభట్ల రామనాధం, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్లు చేసిన త్యాగం ఎలాంటిది? ఎందరో వీరులు, మేధావులు, తిరుగుబాటుదారులు- ఉద్యమాల్లో నడిచిన వాళ్లు … దేశం కోసం ప్రాణాలు విడిచిన వాళ్లు… జనం కోసం త్యాగాల ఎర్రజెండాపై ఎగిరిన వాళ్లు … భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ అనే తొలి విత్తనాలు నాటి వంద సంవత్సరాలు అయింది. ఆ చారిత్రాత్మక సందర్భాన్నీ, ప్రజా పోరాటాలనీ తలుచుకుంటూ ప్రతిభావంతుడైన సీనియర్ జర్నలిస్టు, సంపాదకుడు ఆర్వీరామారావు ‘విశాలాంధ్ర’ దినపత్రికలో వరసగా వంద వ్యాసాలు రాశారు. వాటన్నిటితో ‘శత వసంతాల అరుణ పథం’ అని ఓ పుస్తకం వేశారు. నూరేళ్ల చరిత్రని కేవలం 260 పేజీల్లో చెప్పడానికి ఆయనొక పద్ధతిని ఎంచుకున్నారు. ఆ స్కీమ్ ప్రకారం క్లుప్తంగా, స్పష్టంగా, సమర్థంగా రాయగలిగారు. ఆర్వీరామారావు వంద వ్యాసాల కోసం కీలకమైన సంఘటనలు, త్యాగమూర్తులు, ప్రసిద్ధ నాయకులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మేధావులు, చరిత్ర సృష్టించిన ఉద్యమాలు, కార్మిక, విద్యార్థి, యువజన, ప్రజానాట్యమండలి, మహిళా సంఘాల పాత్రని ఒక క్రమంలో రాశారు.
భగత్ సింగ్, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు నుంచి పీసీజోషీ, కంభంపాటి సత్యనారాయణ, దర్శి చెంచయ్య దాకా వేగుచుక్కలై వెలిగిన వాళ్లందరినీ గుర్తు చేసుకున్నారు. రక్తమోడిన రాజీలేని పోరాటాన్నీ, ఉరికంబం ఎక్కినా చెక్కుచెదరని ధైర్యాన్నీ, జైలు గోడల చీకటి మధ్య కన్నీటి తడిలో కరిగిపోయిన జీవితాల దైన్యాన్ని… అంతే ఉద్వేగంతో రికార్డు చేశారు ఆర్వీ రామారావు. విశ్లేషణ చేసినా, దూకుడుగా రాసినా ఆ మంచి తెలుగు వాక్యం వేగంగా చదివిస్తుంది. ఆర్వీరామారావుగా అందరికీ తెలిసిన ఆయన పూర్తి పేరు రాయారావు వెంకట రామారావు. మునుపటి మెదక్ జిల్లా నర్సాపూర్ దగ్గరలోని నల్లవల్లి గ్రామంలో 1953లో పుట్టినా, మొదటి నుంచీ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ‘విశాలాంధ్ర’ కి గత అయిదేళ్లుగా ఎడిటర్. 1976 నుంచి ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి దినపత్రికల్లో పనిచేసి, 50 ఏళ్లు నిత్యం అక్షరాలతోనే కలిసి బతుకుతున్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం డజను పుస్తకాలు ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువదించారు. గెయిల్ ఆంవెట్ రాసిన అంబేద్కర్ జీవితచరిత్రని అనువదించారు. వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’ నవలని ఇంగ్లీషులోకి తర్జుమా చేశారు. వేలాది సంపాదకీయాలు రాశారు. ప్రస్తుతం తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం గౌరవాధ్యక్షులుగా ఉన్నారు.
1917 రష్యా విప్లవ విజయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తిరుగుబాటు ఒక ఆదర్శంగా నిలిచి వెలిగింది. సోషలిస్టు భావాలు జనంలో ఉత్సాహం నింపాయి. ఇండియాపై పెత్తనం చేస్తున్న బ్రిటీష్ వాళ్లు 1912 లో పెషావర్ కుట్రకేసు, 1924 లో కాన్పూర్ బోల్షెవిక్ కుట్రకేసు, 1925 లో కకోరి కుట్రకేసులు పెట్టారు. వాటి విచారణ మార్క్సిస్టు భావాల వ్యాప్తికి ఉపయోగపడింది. తాష్కెంట్‌లో 1920 లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 1920 అక్టోబర్ 17న ఎం.ఎన్.రాయ్ ఆయన భార్య ఎలెన్‌రాయ్, అబని ముఖర్జీ ఆయన భార్య రోబో ఫిలింగోవ్, మహమ్మద్ అలీ, ప్రతివాద భయంకర తిరుమలాచార్య తాష్కెంట్‌లో సమావేశమయ్యారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటును ప్రకటించారు. ఎలెన్‌రాయ్ అమెరికా వనిత, రోబో ఫిలింగోవ్ సోవియట్ మహిళ. పైగా అది భారత గడ్డ మీద పుట్టిన పార్టీ కాదు. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ దాన్ని సీపీఐగా గుర్తించలేదు.
అప్పటికి బొంబాయిలో ఎస్.ఎ.డాంగే, కలకత్తాలో ముజఫర్ అహ్మద్, మద్రాసులో సింగారవేలు చెట్టియార్, లాహోర్‌లో గులాం హుస్సేన్ నాయకత్వంలో కమ్యూనిస్టు బృందాలు పని చేస్తున్నాయి. సత్యభక్త అనే కామ్రేడ్ చొరవతో 1925 డిసెంబర్ 25, 26 తేదీల్లో కాన్పూర్‌లో కీలకమైన సమావేశం జరిగింది. ఈ సభలోనే సింగారవేలు చెట్టియార్‌ని అధ్యక్షుడిగా, ఎస్.వి.ఘాటేని కార్యదర్శిగా ఎన్నుకున్నారు. బొంబాయి కార్యక్షేత్రంగా సీపీఐని ఏర్పాటు చేయాలనుకున్నారు. వ్యక్తులూ, కమ్యూనిస్టు బృందాల స్థాయి నుంచి కమ్యూనిస్టు పార్టీగా ఆవిర్భవించింది. వీళ్లందరికీ ఎం.ఎన్.రాజ్తో మంచి సంబంధాలు ఉన్నాయి. పది సంవత్సరాల తర్వాత, గాంధీజీ స్వాతంత్య్ర పోరాటం దేశాన్ని కుదిపివేస్తున్న కాలం, 1936 లో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం మొగ్గ తొడిగింది. సజ్జార్ జహీర్, ముల్క్‌రాజ్ ఆనంద్, కె.ఎ. అబ్బాస్, అలీ సర్దార్ జాఫ్రీ, కైఫీ అజ్మీ, రాజేందర్ సింగ్ బేడీ లాంటి పేరున్న రచయితలూ, కవులూ ముందడుగు వేశారు. ఆ రోజుల్లోనే బెంగళూరుకు చెందిన కుమారి అనిల్ డి సిల్వాకు ప్రజానాట్య మండలి ఏర్పాటు చేయాలన్న ఆలోచన తట్టింది. పాట, నాటకం, నృత్య రూపకం జనశ్రేణుల్ని కదిలించాయి.
ఇండియన్ పీపుల్స్ థియేటర్ అనే ప్రజానాట్య మండలి 1943 లో ఏర్పడింది. ఒకరా, ఇద్దరా… పృథ్వీరాజ్ కపూర్, కిషన్ చందర్, ఇస్మత్ చుగ్తాయ్, కర్తార్ సింగ్ దుగ్గల్, బలరాజ్ సహానీ, సలీల్ చౌదరి, ఎస్.డి.బర్మన్, పండిట్ రవిశంకర్… మరెందరో మహానుభావులతో ‘ఇప్టా’ సాంస్కృతిక ఉద్యమం నడిచింది. గొంతెత్తి పాటలు పాడి సోషలిస్టు సమాజం అనే కలని రారమ్మని పిలిచింది. ‘భూఖా హై బెంగాల్’ లాంటి పాటలు జనాన్ని ఆకర్షించాయి. ప్రజానాట్య మండలి చొరవతో తీసిన ‘ధర్తీకే లాల్’ సినిమా నాటి సమాజాన్ని వూగించింది. ఆ కాలంలోనే వేములపల్లి శ్రీకృష్ణ, కళాకారుడు నాజర్‌ని ప్రజానాట్య మండలిలో చేర్చారు. ఇక నాజర్ బుర్రకథ దళం విజృంభించింది. అనేక బుర్రకథ బృందాలు రంగంలోకి దిగాయి. దళిత డప్పుని ప్రజానాట్య మండలి అప్పుడే సొంతం చేసుకుంది. అమృతయ్య, ఏసుదాసులు ఉత్తమ డప్పు కళాకారులుగా పేరు పొందారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఒక వంద దళాలు ‘మా భూమి’ నాటకం ప్రదర్శించాయి. ఒగ్గు కథ, గొల్లసుద్దులు తెలంగాణని పులకింపజేశాయి. పేద కళాకారులకు పెద్ద అండగా నిలబడింది ప్రజానాట్య మండలి.
అదే అదే పతాక జైత్రయాత్ర సాగుతోందిరా పదేపదే రణానికై నగార మోగుతోందిరా… అని రాంభట్ల కృష్ణమూర్తి పాటరాసి 60 సంవత్సరాలు అవుతోంది.. రాయల్ నేవీ తిరుగుబాటు: అది 1946 ఫిబ్రవరి 19. మద్రాసులోని నౌక స్థావరంలో బ్రిటీషర్ల అధీనంలో ఉన్న 150 మంది భారత నౌకాదళ సిబ్బంది తిరుగుబాటు చేశారు. బ్రిటీష్ అధికారుల మీద దాడులు చేశారు. సైనికులు, పోలీసులు, పౌరులు కూడా వీళ్లతో కలిశారు. కరాచీ నుంచి కలకత్తా దాకా… కనీసం పదివేల మంది, 56 నౌకల మీద ఉన్నవారంతా తిరుగుబాటు చేశారు. దారుణమైన పరిస్థితులు, పాచిపోయిన ఆహారం వీళ్ల ప్రధాన సమస్య. అరెస్టులు జరిగాయి. 476 మందిని బర్తరఫ్ చేశారు. సైన్యం తిరుగుబాటు బ్రిటీష్ వాళ్లని గడగడలాడించింది.
1946 వ సంవత్సరం, జులై 4: తెలంగాణ రైతుల పోరాటం మొదలయ్యింది. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్ర ప్రసిద్ధి పొందింది. రాజు నిజాం అయినా పన్నులు వసూలు చేసి, వేధించి అసలు పెత్తనం చలాయించిన దేశ్‌పాండ్యా, దేశ్ ముఖ్, జాగిర్దార్, మక్తేదార్, పరగణాదార్లపై ఆగ్రహ ప్రదర్శనే తెలంగాణ రైతాంగ పోరాటం. ఆ కాలంలో స్త్రీలు, గ్రామీణ పేదలూ నరకయాతన అనుభవించారు. కమ్యూనిస్టులు తుపాకులు పట్టుకుని చెలరేగిపోయారు. దొరల అంతు చూశారు. గ్రామాలను విముక్తి చేశారు. ఈ సాయుధ ఘర్షణల్లో నాలుగు వేల మంది కామ్రేడ్స్ నేలకొరిగారని చరిత్ర చెబుతోంది.
అప్పుడే సునీల్ జానా అనే గొప్ప ఫోటోగ్రాఫర్ తెలంగాణ వచ్చారు. 1918 ఏప్రిల్ 17 న అస్సాంలోని దిబ్రూగఢ్ లో సునీల్ జానా జన్మించినా కలకత్తాలోనే పెరిగారు. కమ్యూనిస్టు నాయకుడు పి.సి. జోషి, సునీల్ ప్రతిభని గుర్తించారు. బెంగాల్ కరువుని రికార్డు చేయమని కోరారు. సునీల్ జానా తీసిన ఫోటోలతో, బెంగాల్ కరువుపై పి.సి.జోషి రాసిన వ్యాసాలు, కమ్యూనిస్టు పత్రిక పీపుల్స్ వార్‌లో పబ్లిష్ అయ్యేవి. ప్రజల మనిషి చిత్తప్రసాద్ బొమ్మలు కూడా ప్రచురించింది అప్పుడే. 1946, అక్టోబరు 24: కేరళలో దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న జాలర్లు, రైతులు, కొబ్బరిపీచు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు పోరాటం ప్రారంభించారు. పున్నప్ర అనే చోట మొదలైన తిరుగుబాటు వాయిలార్‌లో ముగియడంతో -ఇది పున్నప్ర వాయిలార్ మహోద్యమంగా చరిత్రకెక్కింది. ట్రావెన్‌కోర్ దివాన్ సి.పి. రామస్వామి అయ్యర్‌కి వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఇది. పోలీసులు పైశాచికంగా లారీఛార్జీ చేశారు. అనేక మంది ఘర్షణల్లో మరణించారు. ఉద్యమాన్ని కేరళ కమ్యూనిస్టు పార్టీ ముందుండి నడిపించింది.
ఇలా సాటి మనుషుల్ని హీనులుగా, బానిసలుగా చూడడం మానకపోతే సామాన్య జనం వూరుకోరనీ, తిరగబడతారనీ కమ్యూనిస్టు చేసిన ఈ హెచ్చరికలు, కార్యాచరణ, సాయుధ పోరాటం నాటి భారతీయ సమాజాన్ని ప్రభావితం చేశాయి. కార్మికులు, రైతులు చేసిన త్యాగాలు వృథా కాలేదు. ఈ మహత్తర పోరాటాల్నీ, ప్రాణాన్ని బలి ఇచ్చిన సామాన్యుడి సాహసాన్నీ, కన్నీళ్లూ నెత్తుటితో తడిచిన చరిత్రనీ ఆర్వీరామారావు, అతిశయోక్తులు లేకుండా, ఉపన్యాసాలు దంచకుండా, సిన్సియర్‌గా రికార్డు చేశారు. వందేళ్ల ఉద్యమాన్ని వంద డాక్యుమెంటరీ చిత్రాలుగా మన కళ్లముందు పరిచారు. ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ నుంచి ఇంద్రజిత్ గుప్తా దాకా, హిరేన్ ముఖర్జీ నుంచి భూపేష్‌గుప్తా దాకా, సుందరయ్య రాజేశ్వరరావుల నుంచి రావి నారాయణరెడ్డి దాకా కమ్యూనిస్టు ఉద్యమం ఎర్రమందారాలై వికసించడానికి కృషి చేసిన, సుఖమయమైన జీవితాన్ని పార్టీ కోసం త్యాగం చేసిన ధన్యజీవులందర్నీ రామారావు ఎంతో ప్రేమతో కృతజ్ఞతతో తలుచుకున్నారు.
వామపక్షాల అనైక్యత, కమ్యూనిస్టు ఉద్యమం చీలిక, పాలకులకు దగ్గరై పేదలకు దూరమైన కమ్యూనిస్టుల దయనీయ స్థితి గురించి కూడా రామారావు, ఆవేదనతోనే అయినా స్పష్టంగా రాశారు. సంవత్సరాలు, తారీకులు, రుజువులతో ఉద్యమ సమాచారాన్ని నిజాయితీగా రాశారు. కమ్యూనిస్టు కార్యకర్తలతో, సానుభూతిపరులతో కాకుండా, గత నూరేళ్ల చరిత్ర తెలుసుకోదగిన వాళ్లకి అందరికీ ఇది ఉపయోగపడే పుస్తకం. ఈజీగా ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా సూటిగా, సరళంగా రాయడానికి ఆర్వీరామారావు తీసుకున్న శ్రద్ధ్ద మెచ్చుకోదగ్గది. ఈ రకంగా ఆయన ఒక పెద్ద బాధ్యతని నెరవేర్చారు. పార్టీతో, అభ్యుదయ రచయిత సంఘంతో ఉన్న యాభైఏళ్ల ఆత్మీయ అనుబంధానికి ఆర్వీయార్ రుణం తీర్చుకున్నారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన ఈ అరుణపథానికి, జర్నలిస్టు, రచయితా మందలపర్తి కిషోర్ ముందు మాట రాస్తూ, ‘ఇక్కడ ఎవరికీ ఏదీ సొంతం కాదు- కానీ ప్రతి ఒక్కరూ ధనవంతులే. అవును, ఆనందం కన్నా, చిత్తశాంతి కన్నా మానసిక ఆందోళనల నుంచి విముక్తి పొందడం కన్నా మహనీయమైన సంపద లేముంటాయి మరి?’ అని అన్న ‘ఉటోపియా’ స్వాప్నికుడు థామస్ మోర్ మాటల్ని గుర్తు చేశారు.
ఒక సుదూరపు మహా స్వప్నం- సోషలిజం.
ఒక బహుదూరపు బాటసారి- విప్లవోద్యమం.
– తాడి ప్రకాష్
97045 41559