
అమరావతి: కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి, ‘అన్న’ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఎన్టిఆర్ వర్ధంతి సందర్భంగా సిఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదత్తుడు అని మెచ్చుకున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడని ప్రశంసించారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శమని బాబు కొనియాడారు. ఆయన వేసిన బాట అనుసరణీయమని, మరొక్కమారు ఆయనకు స్మృత్యంజలి ఘటిస్తున్నానని బాబు తెలిపారు.