Reading Time: 3 minutes

నగరాలు, పట్టణాల్లోని తెలంగాణ ప్రజానీకం రాజకీయ పార్టీలపై ఏ అభిప్రాయంతో ఉంది? ఎన్నికల్లో ఓటరు నిర్ణయంగా ప్రజాభిప్రాయానికి అద్దం పట్టే పురపోరుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే క్రమంలో రాష్ట్రమంతటా ఓటరు తుది జాబితాలు విడుదలై శనివారంతో రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంతో కొంత మేర, దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఎన్నికలున్నట్టే! మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తీర్పు ఇచ్చే ఎన్నికలివి. ఫిబ్రవరిలో రంజాన్ మాసం, మార్చిలో పదోతరగతి పరీక్షలు.. శివరాత్రిలోపు ఎన్నికల ప్రక్రియ ముగించే తలంపుతో ప్రభుత్వముంది. గణతంత్ర దినోత్సవానికి అటు, ఇటుగా షెడ్యూల్ విడుదల కావచ్చంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే మున్సిపాలిటీల్లోనూ ప్రజాతీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఆయన విశ్వాసం ప్రకటించారు.

ముందు ఊహించినట్టుగానే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు కావడంతో వారు 80 శాతం వరకు ఫలితాలు సాధించామని చెబుతున్నప్పటికీ 60 శాతానికి తగ్గకుండా ఆ పార్టీ సర్పంచులు గెలిచారనేది నిర్వివాదాంశం. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ పురపోరుకు ఇంకా గోచీ సర్దుకున్నట్టు లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలంగా పాదం మోపే ఒక అవకాశం కోసం ఇంకా నిరీక్షిస్తోంది. అక్కడక్కడ ఎంఐఎం ముద్రలే తప్ప ఏ ఇతర పార్టీకీ ఈ ఎన్నికల్లో అంతగా అవకాశాల్లేవు. ఇక కమ్యూనిస్టులు ఆటలో అరటిపండే!

కాంగ్రెస్ వెలిగేది గెలిస్తేనే! స్థానిక ఎన్నికలేవైనా పాలకపక్షానికి కొంత అనుకూలమనేది రాజకీయాల్లో స్థిరపడ్డ అభిప్రాయం. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అందుకు భిన్నంగా ఏం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన ఆరుమాసాల్లోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాలు కైవసం చేసుకుంది. తర్వాతి రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లోనూ గెలుపొంది సదరు స్థానాలను ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నుంచి కైవసం చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వానికి ఎదురు లేదు. కుటుంబ సభ్యులు మినహాయిస్తే, కాంగ్రెస్‌లో ఇక ఉన్నదంతా 1+1 ఎమ్మెల్యేల బలం కూడా లేని నాయకులే కావడంతో రేవంత్ నాయకత్వాన్ని ధిక్కరించే సాహసం ఎవరూ చేయరు. కేంద్రంలో ప్రస్తుతం బలహీనంగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సుల్లోనూ ఆయనకు తిరుగులేదు. జూబ్లీహిల్స్ గెలుపు తర్వాత ఆ బంధం మరింత బలపడింది. ఈ ఎన్నికలు గెలిస్తే, అదిచ్చే కిక్కుతో ప్రస్తుతం వివాదాస్పదమౌతున్న ఖైరతాబాద్ (దానం నాగేందర్), స్టేషన్‌ఘన్‌పూర్ (కడియం శ్రీహరి) నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో తిరిగి గెలుద్దామనే సాహసానికీ తలపడవచ్చు.

వారిద్దరు కాకుండా, పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చి కూడా ‘తామింకా బిఆర్‌ఎస్‌లోనే ఉన్నాం’ అంటున్న వారికి దన్నుగా మరికొంత మందిని బిఆర్‌ఎస్ నుంచి లాగి, మూడింట రెండొంతుల మెజారిటీ (20/39) ఎమ్మెల్యేల బలంతో ‘విలీన’ (అనర్హత వర్తించని) ప్రక్రియకు కాంగ్రెస్ నాయకత్వం తలపడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ, పురపోరులో ఓడితే… కాంగ్రెస్‌కు, స్థానిక నాయకత్వానికి కష్టాలు తప్పవు. ఢిల్లీ అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వంపై చిన్నచూపే! నిన్న జూబ్లీహిల్స్‌లో బహిరంగ మద్దతు ప్రకటించిన ఎంఐఎం ఈ పురపోరులో కాంగ్రెస్‌తో కలిసివస్తుందా? అన్నది చిక్కుప్రశ్నే! అందుకే, ఎలా చూసినా ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం.

మేలుకుంటేనే మేలు! 2023 అసెంబ్లీ ఎన్నికలు బిఆర్‌ఎస్‌కు ఘోర పరాజయమేమీ కాదు. పదేళ్ల పాలన తర్వాత స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో ఎదురైన ఓటమి అది. తర్వాతి పరిస్థితే దయనీయంగా మారుతూ వస్తోంది. అప్పుడు బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల వ్యత్యాసం 2 శాతమే! ఆరుమాసాల్లోపు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు. తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్ని అధికార కాంగ్రెస్‌కు కోల్పోయింది. ఎన్నికైన 39 మందిలో పదిమంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి గోడ దూకి, అనర్హతను తప్పించుకోవడానికి ‘మేం ఇంకా బిఆర్‌ఎస్‌లోనే ఉన్నాం’ అంటున్నా సాంకేతికంగా ఏమీ చేయలేని అశక్తత! అయినా పార్టీ గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. ఇంకా అదే ఫామ్‌హౌజ్ నేతృత్వం, విల్లాలు, సోషల్ మీడియాల్లో మనుగడ. రాష్ట్రవ్యాప్తంగా జనాల్ని కదిలించిన ఒక్క జనాందోళన లేదు, ప్రజా ఉద్యమం కానరాదు. ‘నదీజలాల వివాదం- ఎపితో పంచాయతీ’ ద్వారా ‘తెలంగాణ’ సెంటిమెంట్ లేవనెత్తాలని చూసినా… జనంలో నాయకత్వంపై నమ్మకం సడలుతోంది. నాయకత్వం ఒకరకంగా కాడి వదిలేసిందనేది విమర్శ. పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న 39 నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ ఎన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలుస్తుంది? అన్నదొక పెద్ద ప్రశ్న.

బంతి బలంగా పైకి లేవాలె! రాబోయే పురపోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామని బిజెపి తెలంగాణ నాయకత్వం చెబుతోంది. ఇలా ప్రతిసారీ చెబుతున్నారు తప్ప ఫలితాల్లో అది అంతగా ప్రతిబింబించడం లేదు. పార్టీ అధినాయకుడైన దేశ ప్రధాని ‘మోడీ’ పేరిట లోక్‌సభ ఎన్నికల్లో లభిస్తున్న అనూహ్య- అసాధారణ (8/17) ఫలితాలే తప్ప మిగతా ఎన్నికలన్నీ తెలంగాణలో బిజెపికి చతికిలబాటే! గెలిచి అధికారంలోకి వస్తామన్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలే దక్కాయి. ఇప్పుడు 8 మున్సిపాలిటీల్లో గెలిచినా జెండా ఎగిరినట్టేనని పార్టీలోనే ఒకవర్గం (నిర్)ఆశావహంగా మాట్లాడుతోంది. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ పరిధిలో ఒక కార్పొరేషన్‌తోపాటు పలు మున్సిపాలిటీలున్నాయి. అలాగే పలువురు బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపైనైనా ప్రత్యేకంగా శ్రద్ధపెట్టి పోరాడితే సత్ఫలితాలకు ఆస్కారం ఉంటుంది. ‘పట్టణ పార్టీ’ అని ఒకప్పుడు బిజెపికి పేరు! ఎక్కడిక్కడ కొత్తగా బలం పెంచుకోవడం సంగతలా ఉంచి, ఉన్నది నిలుపుకోలేని పరిస్థితి. అందుకే, ప్రస్తుత ‘పుర’పోరు వారికి ఒక పెద్ద సవాల్!

కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి … ఈ ముగ్గురికీ తెలంగాణ నగర-పురపోరు సవాల్ లాంటిదే!

– దిలీప్ రెడ్డి ( సమకాలీనం)