
మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: శుక్రచార్యుడు తన ఫాంహౌస్ నుంచి మారీచుడు, సుభాహుడు అనే బావ, బావ బా వమర్దులను అసెంబ్లీకి పంపుతున్నాడు. ప్రాజెక్టులను అడ్డుకోండ ని ఆదేశిస్తున్నాడు. ఎంతమంది మారీచులొచ్చినా వధించే శక్తి పాలమూరు బిడ్డకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించా రు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవిఎస్ కళాశాల మైదానంలో ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభ లో ముఖ్యమంత్రి మాట్లాడారు. పదేళ్ల బిఆర్‌ఎస్ సర్కార్ నిర్వా కం వల్ల రాష్ట్రంలో పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడానికి ప్రభు త్వం వద్ద భూమి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నిన్నగాక మొన్న ఆదిలాబాద్ జిల్లాలో చనాఖ కొరాట ప్రాజెక్టులను, సగర్మాట్ బ్యారేజీలను నేను ప్రారంభిస్తే.. మేము సిద్ధం చేసినం. రేవంత్ రెడ్డి వచ్చి ఫోటోలు దిగుతున్నాడని ఓ మారీచుడు మాట్లాడిండు. అందుకు నేను చెప్పిన పేరానాల్లో శుక్రచార్యుడు రాక్షసులకు గు రువు. ఆయన శిశ్యులు మారీచుడు. సుబాహులను.. ఎక్కడ దేవతలు యజ్ఞాలు, యాగాలు చేసినా.. ఎక్కడ లోక కళ్యాణం కార్యక్రమాలు జరిగినా వాటిని భగ్నం చేయడానికి పంపేవాడు. ఈరోజు ఆ శుక్రాచార్యుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. అ సెంబ్లీకి రమ్మంటే రాడు. ఫాంహౌస్‌లో ఉండి.. మారీచ సుభాహులను అసెంబ్లీకి పంపి ప్రా జెక్టులను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నాడు. మారీచుడు మాయలేడి వేషంలో వస్తే.. రా ముడు వేసిన బాణానికి ఏమైండో తెలుసుకదా?” అని ఎద్దేవా చేశారు. అలాంటి శుక్రచార్యుడు, మారచీ సుభాహులను వధించగల శక్తి పాలమూరు బిడ్డకు ఉందన్నారు.
మాకూ వ్యూహ, ఎత్తుగడలు తెలుసు. దెబ్బకు దెబ్బ తీయడం తెలుసని హెచ్చరించారు. పెద్దలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి ఉన్నప్పుడు చెల్లిందేమో కానీ, ఇప్పుడిక చెల్లదు. ఎవరు ఏ మారువేషంలో వచ్చినా.. మాయ లేడి రూపంలో వచ్చినా పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుపట్టి కర్రు కాల్చి వాతలు పెడతారని రేవంత్ తీవ్రస్వరంతో హెచ్చరించారు. అభివృద్ధి చేశామంటూ బీఆర్‌ఎస్ నేతలు పదేపదే చెప్పుకోవడాన్ని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. ‘పరిశ్రమలు,ప్రాజెక్టులు కట్టామని, ఉద్యోగాలు ఇచ్చామని, భూములకు నీళ్లిచ్చామని చెబుతున్నారు. పదేళ్లలో 20 లక్షల కోట్లు మీ చేతికి వచ్చాయి. వాటికి లెక్కలు చెప్పలేదు. లక్ష కోట్లతో కట్టిన కాలేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది. పాలమూరు, భీమా నెట్టెంపాడు, కోయిలసాగర్, ఎస్‌ఎల్‌బిసి, డిండి పూర్తి కాలేదు. ఇక మీరు కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. గురుకులాల విద్యార్థులకు గూడు లేదు. కనీసం స్నానానికి బాతురూంలు లేవు. మరి 20 లక్షల కోట్ల నిధుల్లో 20 వేల కోట్లు ఈ పాఠశాల మెరుగుకు ఖర్చుపెట్టి ఉండుంటే.. కార్పొరేట్ కళాశాల విద్యార్థులతో పోటి పడేవారని సిఎం అన్నారు.
ఈ నిధులన్నీ ఎక్కడకిపోయాయని రేవంత్ నిలదీశారు. ‘పేదలకు డబుల్ బెడ్ రూంలు ఇస్తామని, దళితుడిని సిఎంను చేస్తానన్నాడు. ఏడాదికి రెండు లక్షల ఇళ్లుకట్టినా కూడా పదేళ్లలో 20 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తికావాలి కదా? ఎక్కడున్నాయని నిలదీశారు. తమ ప్రభుత్వంలో మొదటి ఏడాదే ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం పేదల ఇళ్లు నిర్మాణం జరుగుతోందన్నారు. గతంలో బిఆర్‌ఎస్ ఇచ్చిన రేషన్ బియ్యం పశువులకు దాణ పెట్టేవారు. ఈనాడు విద్యార్థులకూ సన్నబియ్యం ఇస్తున్నామని సిఎం గుర్తు చేశారు. తాను సిఎం అయిన తర్వాత 3.6 లక్షలమందికి ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సూరత్ నుంచి నాణ్యత లేని చీరలు తెచ్చి పేద మహిళలకు బతుకమ్మ చీరలంటూ భారీగా కమీషన్లు దిగమింగారని సీఎం ఎద్దేవా చేశారు. కోటిమంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరులిచ్చాము. కమీషన్లకు కక్కుర్తిపడిన బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 50 లక్షల మంది పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, స్వయం సహాయ సంఘాలకు వడ్డిలేని రుణాలు ఇస్తున్నాము. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. వెయ్యి బస్సులు కొనిచ్చి వారినే ఓనర్లను చేశాం. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులను ఇచ్చిన విషయం బీఆర్‌ఎస్ తెలుసకోవాలని సిఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
దిగిపో అంటున్నారు.. మీ అయ్య జాగీరా?
అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాలేదు. శుక్రచార్యుడు, మారీచుడు, సుభాహుడు నన్ను దిగిపొమ్మంటున్నారు. ఇదేమైనా మీ అయ్య జాగీరా? లేక మీ తాతలు ఇచ్చినా ఆస్తా? నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు నమ్మకంతో, ప్రేమతో ఆశీర్వాదంతో ఇక్కడ కూర్చోబెట్టారు తప్ప.. మీతాతలిచ్చిన ఆస్తి కాదు, మీరు అడిగితే దిగిపోవడానికి’ అని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు ఎలా పాలించాలో, ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలలో తమకు తెలుసన్నారు. ‘వలసవచ్చిన నిన్ను భుజానమోసి, వాళ్లకు ఏమీ చేయకున్నా పల్లెత్తుమాట అనని పాలమూరు అంటే నీకు చిన్న చూపు కావొచ్చు. అంతమాత్రాన పాలమూరోళ్లం చేతగానివాళ్లం కాదు. ఎక్కడ కర్రు కాల్చి వాత బెట్టాల్లో మాకు తెలుసు’ అని సిఎం హెచ్చరించారు. పడావుపడ్డ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, నచ్చితే వచ్చి ఆశీర్వదించు , లేకుంటే ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకోవాలని సీఎం సూచించారు.
బిఆర్‌ఎస్.. ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసిందా?
ఈ వేదిక నుంచి అడుగుతున్నా? ప్రశ్నిస్తున్నా. పదేళ్లు పాలించిన ఆనాటి సిఎం జిల్లాకు ఒక్క కొత్త ప్రాజెక్టైనా మంజూరు చేశారా?’ అని రేవంత్ నిలదీశారు. భీమా, నెట్టెంపాడు, జూరాల, పాలమూరురంగారెడ్డి, కల్వకుర్తి, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను కేసీఆర్ పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. రూ.25వేల కోట్లు కాంట్రాక్టులకు ఇచ్చారు కదా, ఉదంపూర్ రైతులకు ఎందుకు భూపరిహారం ఇవ్వలేదేని నిలదీశారు. సంగం బండలో బండ తొలగిస్తే వేల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. బండ తొలగింపుకు నిధులు ఇవ్వలేదు. నేను వచ్చిన తర్వాత పగులగొట్టి సాగు నీటిని అందుబాటులోకి తెచ్చాను. భూసేకరణ విషయంలో కల్వకుర్తి ప్రాజెక్టుపై అప్పటి ఆ పార్టీ ఎంఎల్‌సి నిధులు అడిగితే ఇవ్వలేదని గుర్తు చేశారు. మఖ్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఊరికే రాలేదని, మక్తల్ మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి ఎప్పటి నుంచో అడిగేవారు. వారు మరణించడంతో ఆగిపోయింది. నేను సిఎం అయిన తర్వాత పదేపదే అడిగి సర్వే చేయించాను. 7 టిఎంసి సామర్థంతో ప్రాజెక్టుకు కోట్ల నిధులు మంజూరు చేయించామన్నారు.
మహబూబ్‌గర్ పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ఎంపి, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎందుకు పాలమూరును అభివృద్ధి చేయలేదని నిలదీశారు. రైతులను ఒప్పించి నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టు విషయమంలో ప్రజల ఆమోదం పొందామన్నారు. ఈ జిల్లావాడిని కాబట్టి రైతుల కష్టాలను తెలుసుకున్న వ్యక్తిగా జూరాల విషయంలో కొత్త బ్రిడ్జికి రూ.123 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. ‘తొలి సిఎం బూర్గుల రామకృష్ణ తర్వాత 75 ఏళ్లకు పాలమూరు బిడ్డగా నాకు అవకాశం వచ్చింది. వాళ్ల కడుపు మంట అదే. మా మోచేతి నీళ్లు తాగే వారు సిఎం అవుతారా? అంటూ కుట్రలు చేస్తున్నారన్నారు. నిజంగానే నీళ్లు, నిధులు ఇచ్చివుంటే.. ఇప్పుడు అసెంబ్లీనుంచి పారిపోయే పరిస్థితి బీఆర్‌ఎస్‌కు ఎందుకని ప్రశ్నించారు. ఎంపీ డికె అరుణ మద్దతుతో త్వరలోనే ఐఐఎంను మహబూబ్‌నగర్‌కు తీసుకొచ్చేందుకు ప్రధానిని కలిసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తెలంగాణకు ఐఐఎంను ఇవ్వమని అడిగి పాలమూరులోనే ప్రారంభిస్తామని చెప్పారు.
ఉచితంగా ఏవి ఇచ్చినా శాశ్వతం కాదని, విద్య ఒక్కటే శాశ్వతమని సిఎం అన్నారు. పండిట్ నెహ్రూ ఇచ్చిన స్పూర్తితో విద్య, ఇరిగేషన్‌కే మొదటి ప్రాధాన్యత అన్నారు. విదేశీ పర్యాటకులు ఎవరు తెలంగాణకు వచ్చినా అభివృద్దిపరంగా పాలమూరును చూపించాలన్నదే తన కలగా రేవంత్ ప్రకటించారు. చిన్నచూపునకు గురైన పాలమూరును అభివృద్ధి చేసి చూపించాల్సిన అవసరం మన ముందు ఉందన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోండి. నిధులిచ్చే బాధ్యత నాది. పసిడి పంటలు పండాలన్నా, పేదరికం పోవాలన్నా ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని సిఎం హామీ ఇచ్చారు. ఇంకా ఎక్కడైనా భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పెంగింగ్‌లో ఉంటే, ఎమ్మెల్యేలు తెలసుకొని రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
రాష్ట్రాభివృద్ధికి ఎన్నిసార్లయినా ప్రధానిని కలుస్తా
రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నిసార్లయినా ప్రధానిని కలుస్తాను. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. ఎన్నికల తర్వాత కుట్రలు, కుతంత్రాలు చేయను. రాష్టానికి రావాల్సిన అభివృద్ది నిధుల కోసం ప్రధానిని కలుస్తాను. ఇందులో తప్పులేదు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తప్ప.. మిగతా రోజుల్లో అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ప్రధాన శత్రువు పేదరికం, పేదలకు నష్టం చేసే వారేనని సిఎం స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిఎం కప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సభలో ఇన్‌ఛార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌రెడ్డి, జిఎంఆర్, అనురుధ్ రెడ్డి, ఎంపి డికె అరుణ, నాగర్ కర్నూల్ ఎంపి మల్లురవి, ప్రభుత్వ పత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, ఈర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాంమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.