Reading Time: 4 minutes

నారాయణగూడ చౌరస్తాకు కూతవేటు దూరంలో కాలువ పక్కన సాహితీ ప్రింటర్స్. సాయంత్రం అయిందంటే ఓ పదిమంది మేధావులు చేరి వాడివేడి చర్చలు. అందులో ఒకాయన ఉన్నట్టుండి పాట ఎత్తుకుంటాడు. అంతే.. మిగతా అందరి మాటలు ఆగిపోతాయి ఆయన పాటలు పాడుతున్నంత సేపు. ఓ గంట పాటు కనీసం ఆయన స్వరమే వినిపిస్తుంది. తాను సొంతంగా రాసిన పాటలు పాడుతుంటాడా గాయకుడు. ఆ పాటలు అందరికీ నచ్చడానికి కారణం వాటిల్లో ఉన్న విషయం మాత్రమే కాదు, ఆయన స్వరం. అది స్వరం కాదు భాస్వరం. ప్రపంచాన్ని తగలబెట్టగలిగినంత శక్తి ఉంటుంది ఆ స్వరంలో. ఇక విషయం గురించి చెప్పుకుంటే ప్రాంతీయ అస్తిత్వ తపన, దోపిడీని ఎదుర్కోలేకపోతున్న ప్రజలను నిస్సహాయ స్థితి నుంచి బయటపడేయడానికి ఉద్యుక్తులను చేయడానికి ఉద్రేకాన్ని పెంచే ఆలోచన. ఆ పాటలను రాసి పాడుతున్నాయన పేరు ముచ్చర్ల సత్యనారాయణ. కొంతమందికి వారి వృత్తి, ప్రవృత్తి ఇంటి పేర్లుగా స్థిరపడిపోతాయి. ఆయన ఇంటిపేరు నిజానికి సంగంరెడ్డి అయినా ముచ్చర్ల సత్యనారాయణ అంటేనే అందరూ గుర్తుపడతారు. వరంగల్ పట్టణం దగ్గరలో ఉన్న ముచ్చర్ల గ్రామానికి సర్పంచ్‌గా సేవలందించిన ఆయన పేరు ముచ్చర్ల సత్యనారాయణగా స్థిరపడిపోయిందంటే ఆ గ్రామ సర్పంచ్‌గా ఆయన ఎంత పని చేసి ఉంటారు ఊరి మంచి కోసం.

సర్పంచ్ స్థాయి నుంచి కేబినెట్ మంత్రిస్థాయి వరకు ఎదిగిన సత్యనారాయణ ఊరులో సర్పంచ్‌గా ఉన్నప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యేవారు. తర్వాత సమితి అధ్యక్షుడైతే బడిలో తోటి విద్యార్థులతో కలిసి ఉన్నట్టు అనిపించేది. మంత్రిగా ఉంటే మాత్రం జైల్లో ఉన్నట్టు ఉక్కిరిబిక్కిరయ్యేవాడు. ఇది ఆయన వ్యక్తిత్వం. ఈ మాటలు ఆయన స్వయంగా చెప్పినవే. పదవులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరాడకుండా చూస్తే, పోరాటం ఆయనకు ఉత్తేజాన్ని ఇచ్చేది. తెలంగాణ కోసం ప్రజల తరఫున ఆయన పోరాటం 1952 లోనే మొదలైంది.

మళ్లీ సాహితీ ప్రింటర్స్‌లో ఆ సాయంకాలం విషయానికొస్తే, అక్కడ చేరిన వారిలో ఆ భాస్వరం వంటి స్వరం ముచ్చర్ల సత్యనారాయణదే. ఆయనతోపాటు అక్కడ చర్చల్లో మునిగి తేలిన వాళ్లలో మేధావి, రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకర్ రావు, తెలంగాణ ఎన్‌జిఒల నాయకుడు నెల్లుట్ల జగన్మోహన్రావు, ప్రెస్ యజమాని ఎస్. ప్రభాకర్ రెడ్డి ఇంకా అనేకులు విద్రోహకాలంలో తెలంగాణ కోసం కలలు కంటూ, నమ్ముకున్న తెలంగాణ ప్రజల్ని చెన్నారెడ్డి కాంగ్రెస్‌లో ముంచిన కాలం అది. ముచ్చర్ల ప్రత్యేక రాష్ట్రం కోసం, ప్రజాహృదయాల్లో వెలుగుతున్న ఆకాంక్షను ఆరిపోకుండా అడ్డుకునేందుకు ప్రారంభించిన ‘జై తెలంగాణ’ పత్రిక ప్రచురణ జరుగుతున్న ప్రింటింగ్ ప్రెస్ అది. ముచ్చర్ల ఆ పత్రిక ప్రచురణ కోసం ఆర్థిక వనరులు సమకూర్చడానికి ఎన్ని తంటాలు పడేవారో, దానికి అవసరమైన వార్తలు, వ్యాసాలు సేకరించడానికి, రాయడానికి ప్రభాకర్ రావు, జగన్మోహన్రావు వంటి వారు ఎన్ని అవస్థలు పడేవారో రాస్తే ఒక పుస్తకం అవుతుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్థిగా రోజూ సాహితీ ప్రింటర్స్‌లో ఇదంతా చూసిన ప్రత్యక్ష సాక్షిని నేను.

తెలంగాణ ఉద్యమ పత్రికే అయినా జై తెలంగాణ వారపత్రిక చాలా ఆసక్తికరంగా, చదివించేదిగా ఉండేది. అయిదు వేల కాపీలతో ప్రారంభించి కొద్ది మాసాల్లోనే 25 వేల కాపీలకు సర్కులేషన్ పెరగడం అందుకు నిదర్శనం. ఆర్థిక ఇబ్బందులే కాకుండా పాలకుల కన్నెర్ర కారణంగా కూడా బోలెడు ఇబ్బందులు ఎదురయినా రెండేళ్ళపాటు నడిచిన జై తెలంగాణ పత్రిక ఇప్పటికీ ఆనాటి ఉద్యమకారులెవ్వరూ మరిచిపోలేని అనుభవం. పత్రిక పంపిణీకి మనుషులు దొరికేవాళ్ళు కాదు. తెలంగాణావాదులు అంటేనే సంఘ వ్యతిరేకులన్నట్టు చిత్రించే ప్రయత్నం జరుగుతున్న రోజులవి. ప్రచురణకర్త, సంపాదకుడూ అయిన ముచ్చర్ల సత్యనారాయణ నుండి పత్రిక ప్రూఫ్‌లు చూసే నావంటి విద్యార్థి దాకా అందరం ఎక్కడ సభలూ, సమావేశాలూ జరిగినా పత్రిక కాపీలు తీసుకుపోయి పంచేవాళ్ళం. ఒకసారి చెన్నారెడ్డి నిర్వహిస్తున్న ఒక సభలో సత్యనారాయణ స్వయంగా పత్రిక కాపీలను పంచారు. ‘ఏమిటిది?’ అని చెన్నారెడ్డి ప్రశ్నిస్తే జై తెలంగాణ పత్రిక కాపీలు పంచుతున్నానని ముచ్చర్ల జవాబు. ఇద్దరి మధ్య కొంచెంసేపు వాగ్వాదం జరిగినట్టు గుర్తు. ప్రధాన స్రవంతి పత్రికలని చెప్పుకునేవన్నీ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా విషం కక్కుతున్న రోజులు మరి అవి.

దేవులపల్లి ప్రభాకర్ రావు పని ప్రెస్‌లో కూర్చుని రాస్తూ పోవడమే. తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో జరిగే పరిణామాలు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి రాసేవారాయన. పత్రిక దాడి కాంగ్రెస్ మీద ఎక్కువ ఉండేది. ఆయన చాలా ఆసక్తికరమయిన శీర్షికలు పెట్టేవారు. ఇందిరాగాంధీ, నిజలింగప్ప అనే మరో కాంగ్రెస్ నాయకుడి మీద జై తెలంగాణలో వచ్చిన రెండు శీర్షికలు 55 ఏళ్ళు గడుస్తున్నా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ‘ఇందిరాగాంధీ తబాహీ కి ఆంధీ’ (ఇందిరాగాంధీ నాశనపు తుపాను), ‘గల్లీ గోడలు దూకే గప్పకు కూడా రాజకీయాలే’.. ఇలా ఆసక్తి కలిగించే శీర్షికలు అనేకం. తెలంగాణ ఎన్‌జిఒల నాయకుడు నెల్లుట్ల జగన్ మోహన్ రావు వరంగల్ నుండి ‘కాకతమ్మ కబుర్లు’ శీర్షికన వారం వారం సామాన్యులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద తెలంగాణ యాస లో రాసే కాలమ్ పెద్ద ఆకర్షణ.

అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్‌లో కలిపేసిన చెన్నారెడ్డి ఇద్దరికీ ఈ పత్రిక మీద కన్నెర్ర. ఓ రెండుసార్లు సాహితీ ప్రింటర్స్ మీద దాడి చేసి ప్రింట్ అయి పంపిణీకి సిద్ధంగా ఉన్న పత్రికలు ఎత్తుకుపోయారు. ఒకసారి పోలీసులే అధికారికంగా యునిఫారంలో వచ్చి దాడిచేస్తే, ఇంకోసారి మఫ్టీలో. మలివిడత తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ పత్రిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కెసిఆర్ అడిగితే కూడా ముచ్చర్ల ‘జై తెలంగాణ’ టైటిల్ ఇవ్వడానికి ఇష్టపడని కారణాలను ఆయన తన జీవితచరిత్రలో నిర్మొహమాటంగా చెప్పారు.

ముచ్చర్ల, దేవులపల్లి, నెల్లుట్ల ముగ్గురూ వరంగల్ వాస్తవ్యులే. వరంగల్ అంటేనే ధిక్కారం. కాకతీయ సామ్రాజ్యపు చివరి రాజు ప్రతాపరుద్రుడు, సమ్మక్క సారలమ్మ, బమ్మెర పోతననుండి కాళోజీ దాకా, విప్లవ రచయిత పెండ్యాల వరవరరావు నుండి కఠోర తెలంగాణవాది, ఉద్యోగుల ఉద్యమ నాయకుడు నెల్లుట్ల జగన్మోహన్ రావు దాక వరంగల్ అంటేనే ధిక్కారం. అదే ధిక్కారం ముచ్చర్ల నరనరానా. ఇడ్లీ సాంబార్ ఉద్యమకాలం నుండీ ఆ తర్వాత నాన్ ముల్కి గో బ్యాక్ ఉద్యమం నుండీ చివరిదాకా తెలంగాణనే శ్వాసించినవాడు ముచ్చర్ల సత్యనారాయణ.

1969 ఉద్యమాన్ని అంచుల దాకా తీసుకుపోయి అఘాతంలోకి విసిరేసిన చెన్నారెడ్డి నుండి 2001 ఉద్యమానికి నాయకత్వం వహించి, అంతిమంగా ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇస్తే మొత్తం తానే అని చెప్పుకునే చంద్రశేఖరరావు దాకా అందరినీ ఆయన నిక్కచ్చిగా బేరీజు వేశాడు. దేన్ని మనసులో దాచుకోలేదు. ఇవాళ మనం తెలంగాణ జాతిపితగా చెప్పుకుంటున్న జయశంకర్ గురించైనా, తనను పిలిచి పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చిన ఎన్‌టిరామారావును గురించైనా, చెన్నారెడ్డి, చంద్రశేఖరరావుల గురించైనా తన మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పినవాడు సత్యనారాయణ. ఆయన జీవిత చరిత్ర ‘ధిక్కార కెరటం’ చదివితే అర్థం అవుతుంది.. ఆయన జీవితం మొత్తం గర్వంగా తల ఎగరేసి తిరగగలిగిన ధిక్కారం నిండినదే అని.

బిసిలకు రాజకీయాధికారం గురించి ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ మాట్లాడుతున్నాయి. నిజానికి వాటి ఎజెండాలో ఇప్పుడదో ముఖ్యాంశం. ముచ్చర్ల 1984 లోనే, ఎన్‌టి రామారావు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలోనే తిరుపతిలో జరిగిన బిసి మహాసభలో కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌతు లచ్చన్న వంటి హేమాహేమీల సమక్షంలో చెప్పిన మాటలు ‘దేశ జనాభాలో సగానికి పైబడి బ్యాక్ వర్డ్ క్లాస్ అనబడే ఉత్పత్తి కులాలు ఉన్నాయి. కానీ రాజకీయ అధికారంలో మన వాటా ఎంత? సమస్త సంపదను సృష్టించేది మనమే కానీ పెత్తనం చేసే కాడ మాత్రం అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతుంది. రాజ్యాధికారంలో మనకు న్యాయమైన ప్రాతినిధ్యం లేకుండా బిసి కులాలకు న్యాయం జరగదు.’ ఇంత స్పష్టత ఆయనకు ఆనాడే ఉంది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్‌టి రామారావు కన్నెర్రకు గురయి కూడా లెక్క చెయ్యకుండా బడుగుల రాజ్యాధికార అవసరాన్ని గురించి ఎలుగెత్తి చాటినవాడు.

ఎన్‌టి రామారావు అహంకారాన్ని, కెసిఆర్ అహంభావాన్ని, చంద్రబాబు నాయుడు కపటత్వాన్ని దగ్గరగా చూసి, వాళ్ల మధ్యన ఉండలేక తన వ్యక్తిత్వాన్ని నిలుపుకునే క్రమంలో రావలసినంత గుర్తింపు లేకుండా పోయిన నికార్సయిన తెలంగాణవాది ముచ్చర్ల. మనలో చాలామందిమి ఇవాళ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు గడిచినా అసంతృప్తితో, నిరాశలో ఉండడానికి కారణం ప్రజలు కోరుకున్న రీతిలో రాష్ట్రం లేదని, సరైన పాలకులు లేరని. ముచ్చర్ల కూడా తన చివరిశ్వాస దాకా ఇదే ఆవేదనతో బతికారు. భౌగోళిక తెలంగాణ ఒక్కటే సరిపోదని, అది మాత్రమే సాధించుకుంటే రాష్ట్రం దొరల పాలవుతుందని ముందే ఊహించి చెప్పిన దార్శనికుడు ముచ్చర్ల. ఆయన కోరుకున్నది నియంతృత్వానికి తావులేని, దోపిడీ, పీడనలకు చోటులేని ప్రజాస్వామిక తెలంగాణ. ఆయన కల నెరవేరడానికి ఇంకో తెలంగాణ ఉద్యమం తప్పదేమో. అటువంటి ఉద్యమానికి ఆయన స్ఫూర్తి వెన్నుదన్నుగా నిలుస్తుంది. తెలంగాణ ఎప్పుడెప్పుడు ద్రోహానికి గురైనా అప్పుడు ముచ్చర్ల తన జీవితాంతం గొంతు విప్పారు. ప్రతి ఉద్యమంలో ఉన్నట్టే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎందరో అన్సంగ్ హీరోలు. అటువంటి అన్సంగ్ హీరోల మొదటి వరసలో నిలిచే వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ.