
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్భవించి వందేళ్లు. ఈ సందర్బంగా ఏడాదిపాటు నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఆదివారం విప్లవోద్యమాల పురిటిగడ్డ ఖమ్మంలో జరగనుంది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సిపిఐ పార్టీ దేశ స్వాతంత్య్ర పోరాటంలో ‘నేను సైతం’ అం టూ నినదించింది. సంపూర్ణ స్వరాజ్యానికి నినదించిన మొదటి రాజకీయ పార్టీగా నిత్యం ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా 2024 డిసెంబర్ 26న ప్రారంభమైన శతాబ్ది ఉత్సహాలు ఏడాదిపాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వివిధ రూ పాల్లో జరుపుకొని.. ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభతో శతాబ్దిని సంపూర్ణం చేయబోతోంది. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టి మొగ్గలోనే మాయమైనప్పటికీ.. ఎన్నో త్యాగాలు, ఎంతోమం ది అమరవీరుల తరువాయి 9లో
(మొదటి పేజీ తరువాయి)
రక్తతర్పణంతో చారిత్రక ఘట్టాలకు నాంది పలికింది సిపిఐ. ఎన్నో సంస్కరణలకు కారణమై.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న వందేళ్ల పార్టీగా ఖమ్మం గడ్డపై శతాబ్ది ఉత్సవాల ముంగింపుతో చరిత్ర సృష్టించబోతోంది.
భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నిరంకుశ నిజాంను గద్దెదించే తెలంగాణ సాయుధ పోరాట మహత్తర ఘట్టంలో.. ఆనాడు కమ్యూనిస్టులే కీలకం. నాలుగున్నరవేల మంది ప్రాణత్యాగాలతో మూడువేల గ్రామాల విముక్తి.. పది లక్షల ఎరాల భూపంపిణీకి ఆనాడు కమ్యూనిస్టులే కీలకమయ్యారు. ఆనాటి సాయుధ పోరాటమే స్పూర్తిగా అనేక ఉద్యమాలకు నెలవై.. ఎంతోమంది వీరులకు జన్మనిచ్చింది. ఆ స్ఫూర్తితోనే నేటికీ తెలంగాణ అంటే పోరాటాల గడ్డగా భాసిల్లుతోంది. కేరళలో పున్నప్ర వాయలర్, బెంగాల్‌లో తెబాగ భూపోరాటం, తెలంగాణలో సాయుధ భూపోరాటం ఫలితంగానే దేశంలో భూసంస్కరణల చట్టం, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, గరిబీ హఠావోవంటి అనేక సంస్కరణలు వచ్చాయి. తెలంగాణ తలమానికమైన సింగరేణి సంస్ధ పరిరక్షణకు, కార్మికుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటాలు చేసింది. యూపీఏ ప్రభుత్వంలో సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, అటవి హక్కుల చట్టం, కార్మిక సంక్షేమ చట్టాలు, పనిగంటలు, కనీస వేతనాలు కల్పించడం వంటివి కమ్యూనిస్టుల పోరాటాల వలనే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సిపిఐ నిర్ణయం ఒక కొత్త ఊపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపిన తొలి జాతీయ పార్టీ సిపిఐనే. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, సీతారామా ప్రాజెక్టు, బయ్యారం ఉక్కు కోసం అలుపెరగని పోరాటాలు చేసింది సిపిఐ.
ముగింపు సభ ఖమ్మంలోనే ఎందుకు?
ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నిన్న మొన్నటి తెలంగాణ సాధనోద్యమం, ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగిన పోరాటాల వరకూ ఖమ్మం గుమ్మానికి ఒక ప్రత్యేక స్థానముంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి పల్లెకు, ప్రతి చెట్టుకు, పుట్టకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర కమ్యూనిస్టు పార్టీతో ముడిపడింది. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతల త్యాగాలు, పోరాటాలు, నిజాయితీ నిత్య స్మరణీయం. తొలిదశలో సిపిఐ తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొన్నా, తెలంగాణ సాయుధ పోరాటంతో గ్రామగ్రామాన ఎర్రజెండా రెపరెపలాడింది. ఎందరో యోధులు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. మంచి ఊపుమీదున్న కమ్యూనిస్టు పార్టీకి చీలిక తీరని శాపంగా మారింది. 1964లో వచ్చిన చీలిక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐని నామమాత్రం చేసింది. 1964లో చీలిక తర్వాత సిపిఐ నుండి సిపిఐ (ఎం)గా విడిపోయింది. తర్వాత సిపిఐ (ఎం) నుండి సిపిఐ (ఎంఎల్) ఏర్పాటు తదనంతర పరిణామాలు అందరికీ తెలిసిందే. 1964లో సిపిఐ నామమాత్రంగా మిగిలింది. 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కాంగ్రెస్‌వినా అన్ని పార్టీలూ దెబ్బతిన్నాయి. కానీ తెలంగాణలో సిపిఐ బలోపేతమైంది.
ఐదులక్షల మందితో భారీ బహిరంగ సభ
భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఖమ్మంలోని ఎస్‌ఆర్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఐదు లక్షలమందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభను కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలోనే మైలురాయిగా నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహాసభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సహార్ధ సందేశం ఇవ్వనున్నారు. ఈ సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజాతోపాటు జాతీయ కార్యదర్శులు అమర్ జిత్ కౌర్ , బి కె కాంగో, రామక్రష్ణ పాండ, అనీరాజా, గిరిశ్ శర్మ, కె ప్రకాశ్‌బాబు, సంతోష్‌కుమార్, ఎంపి సంజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, కె రామకృష్ణ, పల్లబ్ సేన్‌గుప్తా, కె నారాయణలతోపాటు, భారతదేశం నలుమూలల నుంచీ ప్రతినిధులు, సుమారు 40 దేశాలనుంచి అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు.
సభకు ముందు భారీ ప్రజా ప్రదర్శన
బహిరంగ సభకు ముందు ఖమ్మం నగరంలో మూడు వైపులనుంచీ మూడు ప్రదర్శనలు బయలుదేరి ఇల్లెందు క్రాస్ రోడ్డులో కలిసి సభాస్ధలికి చేరుకుంటాయి. పెవిలియన్ మైదానంనుంచి కమ్యూనిస్టు ఉద్యమ శక్తిని చాటేలా పదివేల మంది జన సేవాదళ్ కార్యకర్తలతో భారీ కవాతు నిర్వహించనున్నారు. కవాతు ఖమ్మం నగరంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఎర్రజెండాలు, విప్లవ నినాదాలతో సాగే కవాతు సభకు ముందు వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చనుంది. రెండో ప్రదర్శన శ్రీశ్రీ విగ్రహంనుంచి, మూడో ప్రదర్శన నయాబజార్ కళాశాల కాల్వ ఒడ్డునుంచి ప్రారంభమవుతుంది. ఈ మూడు ప్రదర్శనలకు ఇల్లందు క్రాస్‌రోడ్డువద్ద జాతీయ నాయకులు స్వాగతం పలుకుతారు. సభకు అంతర్జాతీయస్థాయిలో ప్రాధాన్యం దక్కనుంది. భారతదేశంతోపాటు ఆసియా, యూరోప్, ఆఫ్రికా తదితర ఖండాలనుంచి సుమారు 40 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఖమ్మంలో జాతీయస్థాయి మేధో చర్చలు
ఈనెల 19నుంచి 21వరకు “వర్త మాన భారతదేశం.. వామపక్షాల ముందున్న సవాళ్లు” అనే అంశంపై జాతీయస్థాయి సెమినార్, సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం, కౌన్సిల్ సమావేశాలు ఈ సందర్బంగా ఖమ్మం నగరంలో నిర్వహించనున్నారు. ఈనెల20న ఎస్‌ఆర్ గార్డెన్‌లో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో వామపక్షాల పాత్రపై సమావేశాల్లో విసృ్తతంగా చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన వామపక్ష పార్టీ నేతలు, మేధావులు సెమినార్‌లలో పాల్గొననున్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజాతోపాటు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బాబే, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దిప్పాకర్ భట్టాచార్య, ఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఏఐ ఎఫ్‌బి ప్రధాన కార్యదర్శి జి దేవరాజన్ తదితరులు సెమినార్ లో పాల్గొంటారు. శతాబ్ది ఉత్సవాల సన్నాహకంగా ఇప్పటికే ఖమ్మంలో కవి సమ్మేళనం నిర్వహించారు. విప్లవ సాహిత్యం, కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రతిబింబించే కవితలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఇలాంటి సాంసృ్కతిక కార్యక్రమాల ద్వారా ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో పార్టీ ముందుకెళ్తోంది.
చరిత్రలో నిలిచే ఉత్సవాలు
కమ్యూనిస్టు ఉద్యమం వందేళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ నిర్వహిస్తోన్న ఈ శతాబ్ది ఉత్సవాలు పార్టీ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయ చరిత్రలోనూ ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తాయని సీపీఐ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.