
మన తెలంగాణ/హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఘాటు విమర్శలు చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలకు శతాబ్దా ల చరిత్ర ఉందని అన్నారు. ఈ రెండు న గరాలు రెండు కళ్లు వంటివని, అలాంటి ది వాటి ఐడెంటిటీని తొలగించాలని ము ఖ్యమంత్రి చూస్తున్నారని ఆరోపించారు. జంట నగరాల అస్థిత్వం దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కో సం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజి రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు తలపెట్టిన శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు భారీ శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ర్యాలీ కోసం తరలి వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి అనుమతి లేదని చెబుతూ, ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో శనివారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర బిఆర్‌ఎస్ నేతలతో కెటిఆర్ సమావేశమయ్యారు.
అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, శాంతి ర్యాలీ కోసం వెళ్తుంటే తమను పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నగర అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంటే ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతో బిఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్‌ను జిల్లాగా చేసే ఆలోచన చేస్తామని అన్నారు.తమ పార్టీ నేతలను అరెస్టులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడతామని అన్నారు. రిపబ్లిక్ డేకు పది రోజుల ముందు తెలంగాణలో హక్కుల ఖూనీ జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుండటం కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ బిడ్డలకు బిఆర్‌ఎస్ అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. తుగ్లక్ పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలు అటకెక్కించిందని అన్నారు. 420 హామీలు ఏమయ్యాయో తెలియదని వ్యాఖ్యానించారు.
కోర్టు అనుమతితో మళ్లీ ర్యాలీ నిర్వహిస్తాం
సికింద్రాబాద్ అస్తిత్తాన్ని తొలగించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని కెటిఆర్ మండిపడ్డారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై ర్యాలీకి సిద్ధమయ్యారని చెప్పారు. పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారని, శాంతి ర్యాలీకి బిఆర్‌ఎస్ పార్టీని కూడా ఆహ్వానించారని తెలిపారు. తమ ప్రజాప్రతినిధులమంతా సంఘీభావం తెలుపుదామని సిద్ధమయ్యామని పేర్కొన్నారు. కానీ, వేలాది మందిని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని, తమను కూడా తెలంగాణ భవన్‌లో నిర్బంధించారని చెప్పారు. అరెస్టులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతామని, కోర్టు అనుమతితో బ్రహ్మాండంగా మళ్లీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. సికింద్రాబాద్ బిడ్డల మనోభావాలను బిఆర్‌ఎస్ పార్టీ గౌరవిస్తుందని తెలిపారు. అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం కెసిఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని తెలిపారు. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు తీసుకొచ్చారని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని అన్నారు. హైదరాబాద్‌లో నాలుగు జోన్లు ఉంటే.. ఆరు జోన్లు చేసుకున్నామని అన్నారు. ఇన్ని చేసినా హైదరాబాద్ అస్తిత్వాన్ని బిఆర్‌ఎస్ ఏనాడూ టచ్ చేయలేదని స్పష్టం చేశారు. ఉన్న జిల్లాలను తీసేయడానికి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త కలెక్టరేట్లు అద్భుతం అని ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి అన్నారని గుర్తుచేశారు.
సికింద్రాబాద్ కోసం ర్యాలీ చేసే హక్కు లేదా?: తలసాని
సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి తమకు హక్కు లేదా..? అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ర్యాలీ చేస్తామని ఐదు రోజుల క్రితం తాము అనుమతి కోరామని, కానీ శుక్రవారం రాత్రి పదిన్నర గంటల తర్వాత పోలీసులు తిరస్కరించారని అన్నారు. అనుమతి లేదని తమకు ముందే చెప్పి ఉంటే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే వాళ్లమని చెప్పారు. తాము శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే కర్ఫ్యూ సమయంలో తరలించినట్లు తమ పార్టీ వారిని అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.