Reading Time: 2 minutes

మన తెలంగాణ / హైదరాబాద్ : సహజవనరులను వినియోగించడం ద్వారా వరద ప్రమాదాలను నివారించడంతో పాటు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సమృద్ధిగా సాగు నీరు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మున్నేరు- పాలేరు లింక్ పథకం నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం ప్రభుత్వం 162.57 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మున్నేరు-పాలేరు లింక్ కాలువ పొడుగు 9.6 కిలోమీటర్లు కాగా ఇది సెకనుకు 4,500 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేల రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, సూర్యాపేట,మహబూబాబాద్ జిల్లాలో 1.38 లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణతో పాటు పాలేరు రిజర్వాయర్ ఎగువ భాగంలోని 40 ఎకరాల ఎన్‌ఎస్‌పి ఆయకట్టుకు నీటి భద్రత లభిస్తుందని ఆయన వెల్లడించారు. మున్నేరు నది నుంచి ప్రతి సంవత్సరం వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు వృధాగా పోతున్న సుమారు 50 టి.యం.సి ల నీటితో ఈ ప్రాజెక్టు నిర్మణానికి రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చుట్టిందన్నారు.

ఇప్పటి వరకు ఈ నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని ఆ వృధాను అరికట్టడంతో పాటు ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. దానికి తోడు ఖమ్మం జిల్లాలో మున్నేరు నుండి వస్తున్న నీటితో సంభవిస్తున్న నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహద పడుతుందన్నారు. మున్నేరు నది వరద జలాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ గ్రామంలోని చెక్ డ్యామ్ ద్వారా నీరు మళ్లించి నిర్మించే మున్నేరు -పాలేరు లింక్ పధకంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్-2 ను బలోపేతం చేయడంతో పాటు పాలేరు రిజర్వాయర్ ద్వారా భక్త రామదాసు ఎత్తిపోతల పధకం కింద ఉన్న డిబియం 60 ద్వారా ఖరీఫ్ సాగుకు 70,308 ఎకరాల ఆయకట్టుకు అదనపు నీటి లభ్యత చేకూరుతుందని ఆయన తెలిపారు. అలాగే సూర్యాపేట జిల్లాలోని మోతే ఎత్తిపోతల పధకం ద్వారా డిబియం -71 కింద ఉన్న 46,712 ఎకరాల భూమికి నిరంతరం సాగునీటిని అందించవచ్చన్నారు. ఈ ప్రాజెక్టుతో కేవలం సాగునీరు మాత్రమే కాకుండా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో

తాగు నీటి అవసరాల కోసం మిషన్ భగీరథ పధకానికి 4.70 నీటిని కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. అన్నింటికీ మించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా సీతారామ ప్రాజెక్ట్‌కు వినియోగించేందుకు వినియోగిస్తున్న విద్యుత్ చార్జీలకై రాష్ట్ర ప్రభుత్వం సాలీనా చెల్లుస్తున్న విద్యుత్ చార్జీల భారం నుండి తప్పించుకోవడంతో పాటు అదనపు నీటితో పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న హైడల్ ప్లాంట్ లో 2 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా మున్నేరు ఉగ్రరూపం దాల్చిన ప్రతి సమయంలో అతలాకుతలమయ్యే ప్రాంతాల ప్రజలకు ఇకపై ఎటువంటి ఇబ్బంది కలగదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.