
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్ , ఫ్రాన్స్, బ్రిటన్ వంటి పలు దేశాలపై తాజాగా పది శాతం గ్రీన్‌లాండ్ టారీఫ్ విధించారు. ఈ సుంకాల అమలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించారు. గ్రీన్‌లాండ్ అమెరికాకే చెందుతుందనే తమ వాదనకు ఇప్పటివరకూ ఈ మిత్రదేశాల నుంచి మద్దతు రానందున , దీనిని ధిక్కారంగా భావించి ఈ సుంకానికి దిగారు. గ్రీన్‌లాండ్‌పై ఎటువంటి తుది నిర్ణయం వెలువడకపోతే, అమెరికాకు గ్రీన్‌లాండ్ చెందకపోతే జూన్ 1 నుంచి ఈ టారీఫ్‌ను 25 శాతానికి పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికాకు గ్రీన్‌లాండ్ కావల్సిందే.
లేకపోతే టారీఫ్‌లు తప్పవని బెదిరించిన గంటల వ్యవధిలోనే ట్రంప్ ఈ దిశలో నిర్ణయం కూడా ప్రకటించారు. పది శాతం సుంకాల విధింపు జాబితాలో డెన్మార్క్, నార్వే, స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్, యుకె, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ వంటి మిత్రదేశాలు ఉన్నాయి. గ్రీన్‌లాండ్‌పై తన వాదన విషయంలో రాజీ ఉండదు. మిత్రదేశాలైనా కూడా తమ భారం పడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా నుంచి పలు యూరప్ దేశాలకు తరాలుగా సబ్సిడీలు అందుతున్నాయి. ఇది చారిత్రక సత్యం. ప్రపంచ శాంతి పరిరక్షణకు డెన్మార్క్ ఇప్పుడు గ్రీన్‌లాండ్‌పై తన హక్కును అమెరికాకు ధారాదత్తం చేసుకుని తీరాల్సిందే అని ట్రంప్ స్పష్టం చేశారు.