Reading Time: < 1 minute

ఉచిత బస్సు సౌకర్యం ఆడవాళ్లకే పరిమితం చేయడం ఎందుకు? మగవారికి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల్సి ఉంటుంది. అన్నాడిఎంకె తమిళనాడులో మగవారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి శనివారం తెలిపారు. అన్నాడిఎంకె ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోను ముందుగా ప్రజలతో బహిరంగంగా చర్చిస్తామని పార్టీ ముందుగా ప్రకటించింది. అయితే దీనికి ముందే పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి తమళులకు పార్టీ తరఫున ఐదు ఎన్నికల వాగ్దానాలను వెలువరించారు. పార్టీ వ్యవస్థాపక నేత ఎంజిఆర్ 109వ జయంతి సందర్భంగా ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో ముందుగా ఎంజిఆర్ విగ్రహానికి పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. తరువాత రాష్ట్రంలో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సిద్ధం అవుతున్నదని తెలిపారు. ఇప్పుడు ఐదు హామీలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.

కుటుంబ బాధ్యత చూసుకునే గృహిణుల బ్యాంకు ఖాతాలకు నెలకు రూ 2000 అందిస్తారు. వినూత్న రీతిలో మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. అందరికి అమ్మ గృహ వసతి పథకం వర్తింపు, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని వారిని గుర్తించి ప్రభుత్వం వారికి ఇళ్లు కట్టిస్తుంది. ఇక పట్టణ ప్రాంతాలలో అపార్ట్‌మెంట్లలో అర్హులకు ఫ్లాట్లు ఇస్తారు. అదే విధంగా ఎస్‌సి వర్గాలకు చెందిన యువత పెళ్లిళ్ల తరువాత వారికి ప్రత్యేకంగా ఇళ్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది, ఉపాథి పథకం కింద పనిదినాల సంఖ్యను 150కి పెంచడం జరుగుతుంది. అమ్మ ద్విచక్ర వాహనం పధకం పరిధిలో రాష్ట్రంలోని ఐదు లక్షల మంది మహిళలకు ప్రతి ఒక్కరికి పాతిక లక్షల రూపాయల సబ్సిడీతో ద్విచక్ర వాహనాలు అందించడం జరుగుతుందని కూడా తెలిపారు.