Reading Time: < 1 minute

ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ రీసెంట్‌గా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనానికి దారి తీశాయి. బాలీవుడ్‌లో తనకు అవకాశాలు రావడం లేదని.. అందుకు మతపరమైన అంశం కూడా కారణం అయి ఉండొచ్చు కానీ.. తాను ఆ కోణంలో ఆలోచించడం లేదంటూ రెహమాన్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. ‘అవి డేంజరస్ కామెంట్స్’ అని రచయిత్రి శోభా డే మండిపడ్డారు.

ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘రెహమాన్‌కు బాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడానికి మతం కారణమని నేను అనుకోవడం లేదు. ముంబై‌లో చాలా మందికి రెహమాన్ అంటే గౌరవం ఉంది. అంతర్జాతీయ ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉంటున్నారని, విదేశాల్లో ఆయన నిర్వహించే ప్రోగ్రామ్స్ ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని అందుకే తమ ప్రాజెక్టులకు ఆయన అందుబాటులో ఉండరేమో అని ఇక్కడ మేకర్స్ అనుకోవచ్చు. పైగా తొలి నుంచి రెహమాన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. అందుకే చిన్న నిర్మాతలు ఆయన్ను సంప్రదించలేకపోవచ్చు. కమ్మూనిటీ కారణంగానే ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయనే దాన్ని నేను నమ్మను’’ అని జావేద్ అన్నారు.

ఇదే అంశంపై సింగర్ షాన్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ మతపరమైన కోణం ఉందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అదే కారణమైతే.. కొందరు హీరోలు ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉండేవారు కాదు కదా’’ అని అభిప్రాయపడ్డాడు.