Reading Time: < 1 minute

రాష్ట్రంలో వీలైనంత త్వరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ప్రజా భవన్‌లో జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలంటూ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించి రోహిత్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని కమిటీకి తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం కోసం క్యాంపెయిన్ కమిటీ రూపొందించిన ముసాయిదాను కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు అందచేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు భట్టి విక్రమార్కకు కొన్ని విజ్ఞప్తులు చేశారు. రోహిత్ వేముల కేసును పారదర్శకంగా విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. రోహిత్ వేముల మరణం తర్వాత యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్ల పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయని,

వీటి నుంచి వారికి విముక్తి కల్పించాలని కోరారు. కర్ణాటక రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని కోరారు. సమావేశంలో కర్ణాటక ప్రతినిధుల తరపున హులికుంటే మూర్తి (సీనియర్ అంబేద్కరివాది నాయకుడు,ఉపన్యాసకుడు, కర్ణాటక), డాక్టర్ ఆశ్నా సింగ్ -(అసిస్టెంట్ ప్రొఫెసర్, నేషనల్ లా యూనివర్సిటీ -బెంగళూరు). వి. మృదుల -(అడ్వకేట్, కర్ణాటక), రాహుల్ – ఏఎస్‌ఏ (జీకేవీకే -బెంగళూరు) ఉన్నారు. హైదరాబాద్ ‘జస్టిస్ ఫర్ రోహిత్ వేముల’ ఉద్యమం తరపున రాధికా వేముల, రాజా వేముల, ప్రొఫెసర్ భాంగ్య భుక్య – ’యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్), ప్రొఫెసర్ సౌమ్యా దేచమ్మ -(యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్), ప్రొఫెసర్ తిరుమల్ – (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్), ప్రొఫెసర్ రత్నం – (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్), వి. రఘునాథ్ – (నియమిత సీనియర్ అడ్వకేట్, తెలంగాణ హైకోర్టు), డాక్టర్ డోంత ప్రశాంత్, తిరుపతి -(ఏఎస్‌ఏ, హెచ్‌సీయూ), వెన్నెల – (ఏఎస్‌ఏ, హెచ్‌సీయూ) తదితరులు పాల్గొన్నారు.