
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత మంచినీటితో ప్రజల మరణాలకు ప్రభుత్వ నిర్లక్షమే కారణం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రాహుల్ శనివారం మీడియాతో మాట్లాడారు. దేశంలోనే స్వచ్ఛమైన నగరమనే బిరుదు పొందిన నగరంలో , బిజెపి ప్రభుత్వం ప్రకటించిన ఈ మోడల్ స్మార్ట్ సిటీలో ప్రజలకు తాగేందుకు మంచినీరు కూడా లేదని ఆయన స్పందించారు. అర్బన్ మోడల్ ప్రచారంపై సందేహాలను వ్యక్తం చేశారు. ఇండోర్‌లోని భగీరథ్‌పురాలో ఇటీవలే మరుగుదొడ్డి నీరు , తాగునీరు కలిసిపోయిన ఘటనలో ఈ కలుషిత నీరు తాగి ప్రజలు చనిపోయారు.
పలువురు ఇప్పటికీ కలరా ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వ నిర్వాకంతోనే ఈ దుస్థితి నెలకొందని రాహుల్ తెలిపారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు జితూ పట్వారీ ఇతర స్థానిక నేతలతో కలిసి రాహుల్ స్థానికంగా ప్రైవేటు బొంబాయి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. తరువాత కాలుష్య మంచినీటి సమస్య తలెత్తిన ప్రాంతానికి వెళ్లారు. మృతుల కుటుంబాల వారితో మాట్లాడారు.