Reading Time: < 1 minute

 ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. వివరాల ప్రకారం నిషేధిత మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు నేతృత్వంలో నేషనల్ పార్క్ అటవీప్రాంతంలో భారీగా మావోయిస్టులు సంచరిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్, సిఆర్ పిఎఫ్ కోబ్రా బలగాలు శనివారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో భద్రతా బలగాలకు తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సైతం ప్రతికాల్పులు జరిపాయి.కాల్పుల అనంతరం సంఘటన ప్రదేశాన్ని పరిశీలించగా నేషనల్ పార్క్ ఏరియా కమిటీ కార్యదర్శి,

రూ.8 లక్షల రివార్డు కలిగిన డివిసిఎం దిలీప్ బెడ్జాతో పాటు ఏసిఎం మృతదేహాన్ని స్వాధీన పరుచుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరొక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. కాల్పుల్లో దండకారుణ్య స్పెషల్ కమిటీ సభ్యుడు పాపారావు తప్పించుకున్నట్టు వెల్లడించారు.ఎన్‌కౌంటర్ ప్రాంతం నుండి ఏకే 47, గ్రేనేడ్స్, ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్ విషయమై బస్తర్ రేంజ్ ఐజి సుందర్‌రాజ్ మాట్లాడుతూ బీజాపూర్ జిల్లా దండకారణ్య అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్‌లో భద్రతా బలగాలు కొండలు, లోయల్లో ప్రతి కూల పరిస్థితుల్లో ఇద్దరు మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేశారని, తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ తీవ్రతరం చేసినట్లు వెల్లడించారు.