Reading Time: < 1 minute

మహబూబ్‌నగర్: దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా.. వాటిలో పాలమూరు బిడ్డల శ్రమ ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లో రూ.1,464 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాలకు వలసవెళ్లి తట్టపని, మట్టి పని చేసిన వాళ్లు పాలమూరు బిడ్డలు అని సిఎం పేర్కొన్నారు. దేశంలో అత్యంత వెనకబడిన మండలం జిల్లాలోని గట్టు మండలం అని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.

కెసిఆర్ పదేళ్ల పాటు పాలమూరు జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా సాధించలేదని సిఎం ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 2013లో అప్పటి కాంగ్రెస్ నేతలు సాధించారని గుర్తు చేశారు. ప్రాజెక్టు పేరు మీద రూ.23 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు కానీ.. ప్రాజెక్టు పూర్తి చేయలేదని పేర్కొన్నారు. ఉద్ధండాపూర్ జలాశయం భూనిర్వాసితులకు నిధులు చెల్లించలేదని అన్నారు. సంగంబండ వద్ద బండ పగలగొట్టేందుకు కెసిఆర్ పదేళ్లలో రూపాయి కూడా చెల్లించలేదని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన చివరి జివొ నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం అని సిఎం అన్నారు. ఆ పథకాన్ని కెసిఆర్ పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

గతంలో పాలమూరు జిల్లా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిల్లాలోని ప్రాజెక్టుల గురించి అడగలేదని సిఎం అన్నారు. మాజీ సిఎం కెసిఆర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరినీ తన ఫామ్‌హౌస్‌లోకి రానీయలేదని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ పెడితే సభకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. బిజెపి ఎంపిలు రాష్ట్రానికి ఐఐఎం సాధిస్తే.. పాలమూరు జిల్లాలోనే భూమి ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లాను వెనకబడిన జిల్లాగా ఇంకా ఎన్నాళ్లు చూపించాలని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తనదని సిఎం అన్నారు.