
న్యూఢిల్లీ: జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలే లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా దాడులకు ఉగ్రమూకలు కుట్ర చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖిలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు రిపబ్లిక్ డే రోజున దాడులకు ప్రయత్నించవచ్చని తెలిపాయి. దేశ అంతర్గత భద్రతను దెబ్బ తీసేందుకు ఖలిస్థానీ, ఇతర రాడికల్ హ్యాండ్లర్లు స్థానిక గ్యాంగ్‌స్టర్లను ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నాయి. హరియాణా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఉగ్ర నెట్‌వర్క్ విస్తరిస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలిపాయి. గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికలపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సహా ఇతర ప్రముఖ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.