Reading Time: < 1 minute

హైదరాబాద్: అధికార వికేంద్రీకరణ జరగాలని 33 జిల్లాలను ఏర్పాటు చేశామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌కు గొప్ప చరిత్ర ఉందని, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. జంట నగరాల్లో ఒక్క ఇల్లు అయినా నిర్మించారా?, కొత్త ఫ్లైఓవర్లు కట్టారా?, కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని, 420 హామీలు ఏమయ్యాయని అడిగారు. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టారని మండిపడ్డారు. వరంగల్ లో కాకతీయ కళాతోరణం తీయడం ఏంటని దుయ్యబట్టారు. రూ.2000 నుంచి రూ. 4000 పెన్షన్ ఇస్తానని ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదన్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావాలని పోరాటం చేస్తున్న బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, నేతలను హౌస్ అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. తుగ్లక్ ముఖ్యమంత్రికి చెప్పేదే ఒకటేనని అధికారం శాశ్వతం కాదన్నారు. కెసిఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. జంట నగరాల ఆస్తిత్వంపై దెబ్బకోడితే తాము ఊరుకోమని హెచ్చరించారు. 33 జిల్లాల్లో కొన్ని జిల్లాలు తీసేస్తామని చెప్పడం ఏంటని కెటిఆర్ మండిపడ్డారు.

సికింద్రాబాద్ చుట్టూ పొలిటికల్ రగడ నెలకొంది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు బిఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సికింద్రాబాద్ బచావో పేరుతో శాంతి ర్యాలీకి బిఆర్ఎస్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. అనుమతి లేదంటూ తెలంగాణ భవన్ వద్ద బిఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ లో బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, నేతలను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే.