
ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చె స్టోర్టీ, భారీ సెట్లకు కేరాఫ్ అడ్రెస్ గుణశేఖర్ సినిమాలు. ఆయన సినిమా అంటేనే అదో నిండుతనం ఉంటుంది. కానీ, వరుస ఫ్లాప్‌లు పడటంతో ఆయన సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఓ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ‘యుఫోరియా’. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. యువత మాదకద్రవ్యాలకు బానిసలు కావడం.. దాని మత్తులో వాళ్లు చేసే అఘాయిత్యాలు.. తద్వారా ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో అనేదే కథాంశంగా ఈ సినిమాను రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాని నీలిమా గుణశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన విడుదల కానుంది. మరి ఈ సినిమాతో అయినా గుణశేఖర్‌కి హిట్ వస్తుందో.. లేదో.. చూడాలి.