Reading Time: < 1 minute

హరారే: అండర్-19 ప్రపంచకప్-2026లో భాగంగా శుక్రవారం ఇంగ్లండ్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన ఇంగ్లండ్ 46.5 ఓవర్లలో 210 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 211 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

అసలు విషయానికొస్తే.. పాకిస్థాన్‌ విజయానికి మరో 38 పరుగులు అవసరం ఉన్న సమయంలో క్రీజ్‌లో మోమిన్ ఖమర్, నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో అలీ రజా ఉన్నారు. మోమిన్ బంతిని వికెట్ మీదుగా కొట్టి సింగిల్ కోసం పరుగు తీశాడు. అలీ రజా కూడా స్ట్రైకర్ ఎండ్‌కి సురక్షితంగానే చేరుకున్నాడు. అసలు ట్విస్ట్ ఇప్పుడే జరిగింది. క్రీజ్‌కు చేరుకున్నాను కదా.. అనుకొని అలీ క్రీజ్‌ నుంచి కాస్త బయటకు వచ్చాడు. వెంటనే ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్‌కి ఇవ్వగా.. అతడు వికెట్లను గిరాటేశాడు. ఆఖర్లో అలీ క్రీజ్‌లోకి వచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. దీంతో అతను రనౌట్‌గా, ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసిసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. మొత్తానికి పాక్ క్రికెటర్ అనిపించుకున్నాడు అంటూ అలీపై కామెంట్లు చేస్తున్నారు.