Reading Time: 2 minutes

పుట్టేవాడికి అన్న, పెరిగేవాడికి తమ్ముడు అదేగా సిపిఐ. నీకు సమకాలికుడు నారా చంద్రబాబు నాలుగు దఫాలు ముఖ్యమంత్రి, నిన్నగాక మొన్న పుట్టిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి, మీ పార్టీ పుట్టిన 1925 సంవత్సరమే ఆర్‌ఎస్‌ఎస్ పుట్టింది, అదేమో రాజ్యాధికారానికే వచ్చే. నీవేమో జెండాలు పట్టుకుని తిరుగుతున్నావు, అంతేనా? మెరిసేదంతా బంగారం కాదు, చూసిందంతా నిజమూ కాదని నానుడి ఉంది. అది తర్కం ద్వారా నిజమని తేలింది. అయితే ఆ తర్కంలోకి పోవడానికి యిది సందర్భం కాదు. సిపిఐని గురించి మరో కోణంలో చూడగలిగితే చరిత్రకు న్యాయం జరుగుతుంది. నిజమే వంద సంవత్సరాలలో సిపిఐ ఏమీ చేయలేదా? స్వాతంత్య్ర పోరాటం 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత 1857లో ప్రథమ స్వాతంత్య్ర పోరాటంగా గుర్తించబడింది. (అయితే ఇది సిపాయి తిరుగుబాటుగా దురుద్దేశంతో పిలవబడింది) 1885లో బ్రిటిష్ వ్యతిరేక పోరాటానికి కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. 1915 నుండి గాంధీ మహాత్ముడు స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు.

ఆ ఉద్యమంలో యథాతథ వాదులు, తీవ్రవాద భావజాల కలయిక సంయుక్తంగా ఉద్యమం నిర్వహించబడింది. అయితే స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక స్పష్టత కొరవడింది. ఎలాంటి స్వాతంత్య్రం కావాలి? స్వాతంత్య్రమా లేక సర్వ స్వాతంత్య్రమా? (సంపూర్ణ). దీనిపై చర్చోప చర్చలు జరిగాయి. కమ్యూనిస్టు భావాలు కలిగిన వారి ఒత్తిడి మేరకే సంపూర్ణ స్వాతంత్య్రం కోసం తీర్మానం చేయబడింది. స్వాతంత్య్రానంతరం ఎలాంటి స్వతంత్రం అమలు జరగాలో దానిపై గాంధీకి గానీ, కాంగ్రెస్ పార్టీకి గాని స్పష్టత లేదు లేదా ఇవ్వదలుచుకోలేదో? ఇక ముసుగులో గుద్దులాటకన్నా బహిరంగంగా రావడమే మేలని కమ్యూనిస్టులంతా కలిసి 1925 డిసంబర్ 26 న కమ్యూనిష్టు పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో జాతీయ స్థాయి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది. మొదటి తీర్మానం సంపూర్ణ స్వాతంత్య్రం, రెండు దున్నేవాడికే భూమి తదితర మౌలిక అంశాలతో ప్రజలముందుకు వచ్చింది సిపిఐ. ఆనాటినుండి భూసమస్య తెరమీదికి రావడమేగాక, తెలంగాణ సాయుధ పోరాటం, భూమికోసం, భుక్తికోసం సాయుధ పోరాటం, బెంగాల్‌లో తెబాగా, కేరళలో పున్నప్ర, ఆంధ్రాలో చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటాలు ఉవ్వెత్తున లేచాయి.

భూఉద్యమం జాతీయస్థాయి అజెండాగా రూపొందించబడింది.1917లో రష్యాలో కమ్యూనిస్టు విప్లవ విజయం ప్రభావం మన దేశంపై పడింది. ఆ ప్రభావమే బాబా సాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన రూపొందించిన భారత రాజ్యాంగం, అలాగే ఆనాటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పై కూడా ప్రభావం పడబట్టే పబ్లిక్ సెక్టార్ నిర్మాణం. జమ్మూకశ్మీర్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల వేర్పాటు ఉద్యమాలలో కమ్యూనిస్టుల ప్రతిఘటనే భారతదేశ ఐక్యతకు తోడ్పడింది. ఈ ప్రతిఘటన ఉద్యమం లో అనేకమంది కమ్యూనిస్టు యోధానుయోధులను పోగొట్టుకున్న పార్టీ ఏదయినా వుంది అంటే అది సిపిఐ. పై ఉద్యమాలలో ఆనాటి జనసంఘ్, ఇప్పటి బిజెపి వ్యక్తులు ఏ ఒక్కరైనా పాల్గొన్నారా? జైలుకు వెళ్లారా? అధికారం లేకపోయినా దేశాన్ని కాపాడగలిగాం, దళితులకు, గిరిజనులకు, ఇతర బలహీన వర్గాలకు అండగా వున్నది కమ్యూనిస్టులేనని గుండెమీద చేయి వేసుకుని చెప్పగలం.

కమ్యూనిస్టులు 61 మంది వామపక్ష పార్లమెంట్ సభ్యులుండబట్టే గదా పనికి ఆహార పథకం సాధించగలిగాం. కమ్యూనిస్టులు బలహీన పడబట్టేగదా అటు పార్లమెంట్‌లోనూ, ఇటు శాసనసభలలో ప్రజాసమస్యలపై చర్చ జరగకుండ నీవు వెధవవి, నీవే వెధవవి అని తిట్టిపోసుకుంటూ సంపద యావత్తూ కార్పొరేట్ వర్గాలకు ధారాదత్తం చేసే కుటిల యత్నాలకు కొమ్ముకాస్తున్నారు. ఇప్పుడు చెప్పండి కమ్యూనిస్టులు దేశమౌలిక విధానాల యెడల నిబద్ధతగా నిలబడ్డారు. వందేళ్ల సిపిఐ ప్రస్థానం భారతదేశానికి కొలమానంగా నిలబడ్డామా లేదా? ప్రస్తుత కమ్యూనిస్టుల కర్తవ్యమేమిటి? ఎర్రజెండాలకు అంకితమయిన పార్టీలన్నీ ఒకగూటికి చేరాల్సిన తరుణం ఆసన్నమయింది. ఆలస్యం అమృతం విషం. 

– నారాయణ (సిపిఐ)