Reading Time: 3 minutes

పాలకుడైనవాడు ఒకోసారి అబద్ధాలు చెప్పవలసి ఉంటుంది. అంత మాత్రాన తనను అసత్యవాది అనలేము. కురుక్షేత్ర యుద్ధం సాగుతున్నపుడు ధర్మరాజు అంతటివాడు ‘అశ్వత్థామ హతః కుంజరః ’ అన్నట్లు అన్నమాట. కాని ఒక దేశాధ్యక్షుడు తన నాలుగగేళ్ల పదవీ కాలంలో రోజుకు సుమారు 21 చొప్పున మొత్తం 30,573 అబద్ధాలు, తప్పు ప్రకటనలు చేస్తే? ఈ లెక్క అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి విడత పాలన (2017-21)కు సంబంధించినది. ఈ లెక్కలు వేసి చెప్పింది ఎవరో ట్రంప్ శత్రువులు కారు. అమెరికాకే చెందిన ప్రముఖ దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్. ఆ అంకెలను అమెరికా సహా వేర్వేరు ప్రపంచ దేశాలనుంచి వెలువడే మరొక ప్రముఖ పత్రిక ‘ద గార్డియన్’ కొద్ది రోజుల క్రితం గుర్తు చేసింది. గతంలో ఎరిక్ ఆల్టర్ మన్ అనే అమెరికన్ చరిత్రకారుడు ‘వెన్ ప్రెసిడెంట్ లై’ (దేశాధ్యక్షులు అబద్ధాలు చెప్పినప్పుడు) అనే పుస్తకంలో నిజమని నమ్మించే అబద్ధాలు చెప్పటమే అమెరికాలో ఉన్నత పదవులకు అర్హతగా మారిందనటం గమనార్హం.

గార్డియన్ గుర్తు చేయటానికి కారణం, అమెరికా అధ్యక్షుడు ఇపుడు తన రెండవ హయాంలోనూ అదే పద్ధతిలో రోజూ అబద్ధాలు చెప్తుండటం. ఆయన రెండవ సారి అధికారానికి ఈ జనవరి 20వ తేదితో ఒక సంవత్సరం పూర్తవుతుంది. అప్పటికి మొత్తం ఎన్ని అబద్ధాలు అవుతాయో ఎవరో ఒకరు లెక్కలు వేస్తూనే ఉండి ఉంటారు. అయితే ఆ సంఖ్యలు మొదటి విడతకన్న పెరుగుతాయో, తగ్గుతాయో చూడవలసి ఉంది. మామూలుగా చూసినపుడు మాత్రం పెరుగుతాయనిపిస్తున్నది. ఎందుకంటే అమెరికాపై, ట్రంప్‌పై ఒత్తిడులు అప్పటికన్న ఇపుడు పెరుగుతున్నాయి. ఇంటా బయటా కూడా. అదే విధంగా అవసరాలు పెరుగుతున్నాయ. అందుకు తగినట్లు ట్రంప్‌ది ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. ఎప్పుడేమి ఆలోచిస్తారో, మాట్లాడతారో, చేస్తారో తెలియదు. తనకు దేశీయంగా కాని, అంతర్జాతీయంగా కాని ఏ నిబంధనలూ వర్తించవని, ఏదితోస్తే అది చేస్తానని ఇటీవల తానే స్వయంగా ప్రకటించారు కూడా. ఇటువంటివన్నీ కలగలిసినపుడు అబద్ధాల సంఖ్య పెరిగేందుకే అవకాశం ఎక్కువ.

వెనిజులాపై దాడి తర్వాత ప్రస్తుతం హోరా హోరీగా సాగుతున్న గ్రీన్‌లాండ్ విషయమే చూద్దాం. అమెరికా అధ్యక్షుని అబద్ధాల పరంపర మరొకమారు దర్శనమిస్తుంది. గ్రీన్‌లాండ్ అనే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ద్వీపం డెన్మార్క్ అనే యూరోపియన్ దేశ సార్వభౌమత్వం కింద గణనీయమైన స్వయం ప్రతిపత్తితో సాగుతున్నది. అక్కడ వేరే పార్లమెంటు, ప్రభుత్వం ఉన్నాయి. డెన్మార్క్‌లో భాగంగా అది నాటో సైనిక కూటమిలో, యూరోపియన్ యూనియన్‌లో భాగం. కాని గ్రీన్‌లాండ్ మొత్తం డెన్మార్క్ నుండి విడిపోయి అమెరికాలో 51వ రాష్ట్రంగా మారాలన్నది ట్రంప్ చేస్తున్న ప్రతిపాదన. అందుకు గ్రీన్‌లాండ్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్ ఎంతమాత్రం అంగీకరించటం లేదు. ఇదే విషయమై తాజాగా ఈ నెల 14న వైట్ హౌస్‌లో జరిగిన చర్చలలో పాల్గొన్న డెన్మార్క్, గ్రీన్‌లాండ్ విదేశాంగ మంత్రులు ఇరువురు కూడా తిరిగి అదే వైఖరిని పునరుద్ఘాటించారు. అయినా అదే పట్టుదల చూపుతున్న ట్రంప్, గ్రీన్‌లాండ్ ‘ఎట్టి పరిస్థితులలో’ తమకు కావాల్సిందేనని, అవసరమైతే ఖరీదు చేస్తామని, అక్కడి ప్రతి పౌరునికి లక్ష డాలర్లు అదనంగా ఇస్తామని, అయినా కాదు కూడదంటే బలప్రయోగం జరుపుతామని హెచ్చరిస్తున్నారు.

ఇది చివరకు ఏ విధంగా పరిణమిస్తుందన్నది అట్లుంచితే, ఈ వ్యవహారంలో ట్రంప్ అబద్ధాలు గమనించదగ్గవి. గ్రీన్‌లాండ్ తమకు కావాలని రెండవసారి అధికారానికి వచ్చినప్పటి నుంచే గత ఏడాదిగా అంటూ వస్తున్న ఆయన, డెన్మార్క్‌ను ఒత్తిడి చేసేందుకు కొన్ని అబద్ధాలు పదేపదే చెప్తున్నారు. ఒకటి, గ్రీన్‌లాండ్‌ను రష్యా, చైనా యుద్ధ నౌకలు చుట్టు ముట్టి ఉన్నాయి. రెండు, ఆ సమీపంలోని ఆర్కిటిక్ ప్రాంతమంతటా మంచుపొరల కింద మైనింగ్ జరుపుతూ అరుదైన ఖనిజాలను, ఇతర సముద్ర సంపదను కొల్లగొడుతున్నాయి. మూడు, ఆర్కిటిక్ ప్రాంతంలో నౌకాయాన మార్గాలను ఆక్రమించి ఇతర దేశాల నౌకాయానానికి ముప్పగా పరిణమించాయి. నాలుగు, రాగల కాలంలో అసలు మొత్తం గ్రీన్‌లాండ్‌నే ఆక్రమించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అయిదు, చైనా, రష్యాలను అడ్డుకునే శక్తి డెన్మార్క్, యూరప్‌లకు లేదు గనుక, ఆ పని తాము మాత్రమే చేయగలం గనుక, ఆ ద్వీపాన్ని తమ స్వాధీనం చేయాలి.

ఈ అయిదింటికి అయిదూ వచ్చి అబద్ధాలు, తప్పుదారి పట్టించే వాదనలని స్వయంగా డెన్మార్క్, గ్రీన్‌లాండ్, యూరప్‌లు ఖండిస్తున్నాయి. వారు చేప్తున్న దానిని బట్టే, ఆ ప్రాంతంలో రష్యా, చైనాల యుద్ధనౌకలు ఒక్కటైనా లేవు. ప్రస్తుతం లేకపోవటమే కాదు, గతంలోనూ అటువైపు వెళ్లలేదు. పోతే, ఆర్కిటిక్ ప్రాంతం ఏ దేశానికీ చెందని అంతర్జాతీయ సముద్ర ప్రాంతం అయినందున సముద్ర గర్భ ఖనిజాల అన్వేషణ స్వేచ్ఛ అందరికీ ఉంటుందన్నది ఐక్యరాజ్య సమితి నిబంధన. ఆ ప్రకారం స్వయంగా అమెరికా, యూరప్‌లతోపాటు రష్యా, చైనాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ఆ రెండు దేశాల అన్వేషణ నౌకలు ఒకటి రెండు గతంలో మాత్రం వచ్చినట్లు డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రస్తుత సందర్భంలో మరొక మారు చెప్తున్నాయి. ఇక వాస్తవంగా మైనింగ్ అన్నది ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఇన్నిన్ని మాటలంటున్న అమెరికా, అందుకు భిన్నమైన ఆధారాలను కూడా ఏమీ చూపటం లేదు. వారి వద్ద గల ఉపగ్రహ సాధనాలు తక్కువ కాదు.

రక్షణ విషయం ఇంతకన్న చిత్రమైనది. ఆ కోణం నుంచి అమెరికా, డెన్మార్క్‌ల మధ్య 1951 లోనే ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం గ్రీన్‌లాండ్‌పై అమెరికా సైనిక స్థావరం ఏర్పాటు చేసి, అందుకు అవసరమైన నిర్మాణాలను చేపట్టి, సైన్యాన్ని నియోగించవచ్చు. అవసరాన్ని బట్టి వీటిని విస్తరించవచ్చు. వాస్తవంగా కూడా అక్కడ భూతలంపై ఒక స్థావరం ఇప్పటికే ఉంది. భూమి అడుగున అణుశక్తితో కూడిన స్థావరం ఒకటి సైతం ఉన్నట్లు పదిరోజుల క్రితమే బయటపడింది. కాకపోతే అది ప్రస్తుతం ఉపయోగంలో లేదు. డెన్మార్క్, గ్రీన్‌లాండ్, యూరప్‌లు ఇవన్నీ ట్రంప్‌కు గుర్తు చేస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌కు రష్యా, చైనాల నుంచి ముప్పు నిజంగా ఏర్పడితే 1951 ఒప్పందం ప్రకారం అమెరికా ఏదైనా చేయవచ్చు గదానని, అదే సమయంలోతాము కూడా మౌనంగా ఉండబోము కదానని అంటున్నాయి. కొద్ది రోజులుగా అక్కడకు తమ సేనలను పంపటం మొదలు పెట్టాయి కూడా. కాని ఈ సహేతుకమైన వాదనలు, వివరణలను ట్రంప్ కొట్టివేస్తున్నారు. అందుకు తను చెప్తున్న మాట విచిత్రంగా అనిపించవచ్చు.

తాను గ్రీన్‌లాండ్‌ను కాపాడేందుకు ఈ ఏర్పాట్లు చాలవట. ఆ దీవి పూర్తిగా అమెరికాకు స్వంతం అయితేనే అందుకు తగిన “మానసిక స్థితి” తనకు ఏర్పడుతుందట. ఆ తర్కం ప్రకారం రష్యా, చైనాల నుంచి కాపాడేందుకు మొత్తం యూరప్‌తో పాటు ఇంకా అనేక దేశాలు అమెరికాలో విలీనం కావాలన్నమాట. ఇన్నిన్ని అబద్ధాలు, తప్పు వాదనలు వెనుక ట్రంప్ అసలు ఉద్దేశమేమిటో ఎవరూ కొత్తగా కనుకొనవలసిన పనిలేదు. గ్రీన్‌లాండ్‌లో, ఆ పరిసరాలలో అరుదైన లోపాలు, బంగారం, యురేనియం, చమురు నిక్షేపాలు భారీగా ఉన్నాయి. అవన్నీ డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌లతో సంబంధ లేకుండా తమ అధీనంలోకి రావాలి. అదిగాక, ఆ ప్రాంతం అక్కడి నౌకాయానం, అక్కడికి సమీపాన గల ధ్రువ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి. వాటినన్నింటిని తాము స్వయంగా నియంత్రించాలి. కనుక, ఒక్కమాటలో చెప్పాలంటే తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ట్రంప్, నిజాలు అందరికీ తెలుసునని తెలిసి కూడా ఎన్ని అబద్ధాలైనా ఆడుతారు. పదే పదే ఆడుతారు.

ప్రస్తుతం గ్రీన్‌లాండ్ సందర్భం గురించి చర్చిస్తున్నాముగాని, గత ఏడాదిగా అమెరికా అధ్యక్షుడు లెక్క లేనన్ని అబద్ధాలు ఆడుతున్నారు. తమ ఆర్థిక సమస్యలకు కారణమెవరు? అందుకు పరిష్కారమేమిటి? అనే అంశాల నుంచి మొదలుకొని ఇతర దేశాల నుంచి మాదకద్రవ్యాల రవాణా, వెనిజులాపై దాడి, కొలంబియా, మెక్సికో, క్యూబా, ఇరాన్ తదితర దేశాలకు బెదిరింపులు, గాజా గురించి , అక్కడ ఇజ్రాయెల్‌తోపాటు తమ పాత్ర గురించిన అబద్ధాలు, తప్పుడు ప్రకటనలకు అంతులేకుండా పోయింది. తాము సహాయంగా వస్తున్నామని ఇరాన్ ప్రజలకు భరోసా ఇచ్చిన ఆయన, తాము సరఫరా చేసిన ఆయుధాలతో ఇజ్రాయెల్ 80,000 మంది పౌరుల ప్రాణం తీసినా వారికి మాత్రం ఏ భరోసా ఇవ్వలేదు. అందువల్ల ట్రంప్ అబద్ధాల పరంపర ఇంకా మిగిలిన మూడేళ్లలోనూ కొనసాగుతుందని నమ్మవచ్చు.  

– టంకశాల అశోక్ (దూరదృష్టి)

( రచయిత సీనియర్ సంపాదకులు)