
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఏడున్నర దశాబ్దాలు గడిచాయి. పాతతరం నేతలు దాదాపుగా కనుమరుగైపోయారు. కేవలం వారి జీవిత గాథలు, వారు పాటించిన విలువలు మనకు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలాయి. కొత్త తరం నేతలు తమ పూర్వీకుల వాసన లేకుండా, విలువల జోలికి పోకుండా రాబోయే తరాల కోసం సంపాదించుకుంటూ రాజకీయాలను జాగ్రత్తగా తమకు అనుకూలంగా నడుపుకొస్తున్నారు. 1990కి పూర్వం రాజకీయాలు ఒక తీరున నడిస్తే తర్వాత కాలంలో మద్యం వ్యాపారులు, కాంట్రాక్టర్లు, భూ ఇసుక మాఫియా నేతలు, నేరచరిత్ర గలవాళ్లే ప్రజాప్రతినిధులుగా ఎక్కువమంది ఎన్నికవుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు. ఎడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్ అనే సంస్థ గత 25 ఏళ్లుగా రాజకీయ నాయకులపై, రాజకీయ పార్టీలపై రకరకాల కోణాల్లో సర్వే చేస్తూ నివేదికలు విడుదల చేస్తున్నది. గత పదేళ్లలో అంటే 2014 నుండి 2024 వరకు జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన ఎన్నికైన అభ్యర్థుల ఆదాయం, రాజకీయ పార్టీల ఆదాయం, ఎన్నికలలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా ఖర్చు చేశాయి, కేసులు ఎదుర్కొంటున్న పురుష మహిళా ప్రతినిధులు, ఎన్నికైన వారి విద్యార్హతలు ఈ రకంగా నేతల పార్టీల బాగోతాన్ని బహిర్గతం చేసింది.
భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా నలుగురు దిగ్గజాలు చేపట్టిన అధ్యయనం దేశంలో సగటు పౌరుడిని ఆలోచింపజేస్తున్నది. ప్రజాస్వామ్యానికి పౌరుడే యజమాని అనేది ఈ సంస్థ విశ్వాసం, నినాదం. 2004 మొదలుకొని 2025 వరకు జరిగిన వివిధ ఎన్నికలలో రాజకీయ పార్టీలు, నేతలకు సంబంధించిన వివరాలన్నింటినీ బహిర్గత పరుచుతున్న ఎడిఆర్ ఇటీవల 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని తన నివేదికలో వెల్లడించింది. 2024లో ఎన్నికైన 102 మంది లోక్‌సభ సభ్యులు, ఇంకా ఈ మధ్య ఎన్నికలలో గెలిచిన 400 మంది ఎంఎల్‌ఎల పైన సంస్థ తన శాంపిల్ సర్వే నిర్వహించింది. ఈ ప్రజాప్రతినిధులు తమ ఎన్నికల ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగించుకుని దాన్ని క్రోడీకరించి సగటు పౌరుడికి తెలవని, తేలికగా తెలుసుకోలేని సమాచారాన్ని ఈ నివేదికలో పొందుపరిచింది. ముఖ్యంగా వారి ఆస్తులు 108% పెరగడం చాలా ఆశ్చర్యకరం. కాగా మన దేశంలో ఇంకా 30% మంది అంటే 40 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువన తమ జీవనం సాగించడం చాలా ఆందోళనకరం. 2014 నుండి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం తాను అనేక సంస్కరణలు తెచ్చానని, అందరి జీవన ప్రమాణాలు పెరిగాయని అందుకే జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్లు తెరిపించినట్లు చెప్పుకున్నా ప్రయోజనం శూన్యం.
ప్రజల ప్రమాణాలు రోజురోజుకు క్షీణించుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నా ప్రభుత్వ ప్రచారం మాత్రం భిన్నంగా ఉంది. దేశంలో అత్యధికంగా ఆస్తులు పెరిగినట్లు ప్రకటించిన మొదటి ఇద్దరు సభ్యులు కాగా, మూడవ స్థానం వైకాపా సభ్యులు ఆక్రమించడం విశేషం. వారి ఆస్తులు 162, 130, 124 కోట్లు పెరిగినట్లు నివేదిక తెలుపుతున్నది. ఆస్తులు బాగా పెంచుకున్న మొదటి పది మంది సభ్యుల్లో ఐదుగురు బిజెపి సభ్యులే కాగా, సర్వే తెలిపిన 102 మందిలో 65 మంది కూడా ఆ పార్టీ వారే కావడం కూడా బిజెపి ధనికులకే పార్టీ టిక్కెట్లు ఇస్తుందన్న విషయాన్ని నిరూపిస్తున్నది. బిజెపి సభ్యుల ఆస్తులు 108%పెరగగా, కాంగ్రెస్ సభ్యులు 135%, తృణమూల్ సభ్యులు 86% పెంచుకున్నారు. నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థతో ఎడిఆర్ సంయుక్తంగా జరిపిన విశ్లేషణలో దేశంలోని 5203 మంది ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల్లో 1106 మంది అంటే 21% సభ్యులకు వంశపారంపర్య రాజకీయాలు ఉన్నట్లుగా తెలిసింది అంటే ప్రతి ఐదులో ఒక సభ్యుడు వారసత్వ అర్హతతో రాజకీయాలు నడుపుతున్నాడన్నమాట.
వీరిలో 32% కాంగ్రెస్ కాగా, 17% బిజెపి సభ్యులు కావడం గమనార్హం. ప్రాంతీయ పార్టీలు సైతం జాతీయ పార్టీల బాటలోనే నడుస్తుండడం బాధాకరం.ఇక చట్టసభలకు ఎన్నికయ్యే గౌరవ సభ్యులు అనేకమంది నేరచరిత్ర కలవారుగా వారు తమ అఫిడవిట్లలోనే చూపించుకున్నారు. 20 శాతం పోటీ చేసిన సభ్యులపై క్రిమినల్ కేసులు ఉండగా, 14% మంది తీవ్రమైన నేర సంబంధిత కేసుల్లో నమోదైన వారున్నారు. లోక్‌సభకు పోటీ చేశారు 98 మంది కోర్టులచే శిక్షపొందిన వారు కాగా, 40 మంది హత్య కేసుల్లో నిందితులు మహిళా అభ్యర్థుల సైతం ఇలాంటి కేసుల్లో ఉండడం బాధాకరం. కాగా బిజెపి నుండి 43%, కాంగ్రెస్ పార్టీ నుండి 44% అభ్యర్థులు తమపై కేసులున్నట్లు ప్రకటించినట్లుగా నివేదిక తెలుపుతున్నది. 2024 లోక్‌సభకు పోటీచేసిన అత్యంత ధనవంతులలో ఒకరు ఆంధ్రప్రదేశ్, ఒకరు తెలంగాణ, మరొకరు గోవాకు చెందినవారు. 46 మంది జీరో ఆస్తులు ప్రకటించడం గమనార్హం. 767 మంది లక్షకు తక్కువగా ఆస్తులు ఉన్నట్లుగా తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. అదే విధంగా పోటీ చేసిన వారిలో 42 శాతం మంది ఐదు నుండి 12 తరగతుల మధ్యన చదవగా, 51% మంది పట్టభద్రులు ఆపైన చదివినట్లుగా పేర్కొన్నారు.
292 మంది డిప్లొమా హోల్డర్లు. 217 మంది కనీస అక్షరాస్యులు కాగా, 121 మంది నిరక్షరాస్యులు.2024 లోక్‌సభకు రకరకాల జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల వయసు, ఆస్తులు, విద్యార్హతలు, లింగం, నేరచరిత్ర, వంశపారంపర్యత, వారి ఓట్ షేర్ లాంటి అనేక సున్నితమైన అంశాలను ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ నుండి సేకరించి ఎడిఆర్, ఎన్‌ఇడబ్ల్యూ సంస్థల విశ్లేషణాత్మకమైన నివేదిక ప్రజలకు అందుబాటులో ఉంచారు. తదుపరి జరిగిన ఢిల్లీ, బీహార్ ఎన్నికల అభ్యర్థుల వివరాలపై కూడా సమాచారంతో పాటుగా ప్రతి అధ్యాయం చివరన వీరి సలహాలు, సూచనలు కూడా పొందుపరిచారు. పార్టీలవారీగా కూడా ప్రతి అంశం విషయంలో ప్రత్యేక సమాచారం అందజేయడం విశేషం. ఐదు అధ్యాయాలు దాదాపు 1000 పేజీలతో కూడిన నివేదిక సగటు భారతీయ ఓటర్లను ఆలోచింపజేస్తుంది. నివేదిక ఇంగ్లీషు, హిందీ భాషల్లో కూడా లభ్యమవుతుంది.
ఓటు వేయడం కాదు, సరైన అభ్యర్థికి ఓటు వేయాలి అనే స్పృహ కలిగిస్తుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా నేరచరిత్ర, కేసులు, బిలియనీర్లు లాంటి అంశాల్లో తాము కూడా తక్కువ కాదు అని నిరూపించుకున్నారు. పబ్లిక్ డొమైన్‌లో లభ్యమవుతున్న ఈ నివేదిక గత ఎన్నికలలో ఎన్నికైన సభ్యుల వివరాలతో పోలికను కూడా చూపడం అసాధారణమైన విషయం. త్రిలోచన్ శాస్త్రి, అజిత్ రనాడే, జగదీప్ చొక్కారో వీరు ముగ్గురు మేజర్ జనరల్ అనిల్ వర్మ నాయకత్వంలో పనిచేస్తూ ఎన్నికల సంస్కరణలకు తమ వంతు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు.1999లో ఇండియన్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ మేనేజెమెంట్ అహ్మదాబాద్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వీరు స్థాపించిన ఎడిఆర్ పౌరులను, ఓటర్లను సాధికారులను చేసే దూరదృష్టి, స్వేచ్ఛాయుతమైన, నీతివంతమైన ఎన్నికలు, సంస్కరణలు రాజకీయ పార్టీలను బాధ్యులు చేసే విధంగా అవినీతి రహిత, నేర రహిత రాజకీయాలే ధ్యేయంగా పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం, పారదర్శకత కోసం తన వంతు పాత్ర నిర్వహించుచున్నది. పార్టీలను, నేతలను జవాబుదారులుగా చేస్తున్నది.
పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అప్పుడు సమర్పించేలా చేయడం ఆదాయ పన్ను రిటర్న్ ప్రజలకు అందుబాటులో ఉంచడం, రాజకీయ పార్టీలు సమాచార హక్కు కింద పనిచేయడం, బ్యాలెట్ పేపర్‌లో ‘నోటా‘ ఉండేలా చేయడం, రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చుల పరిశీలించడం, సిఇసి ఇతర సభ్యులను ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిపక్ష నాయకుల కమిటీ నిర్ణయించాలని, ఎలక్ట్రోరల్ బాండ్స్ నియంత్రణ జరగాలని, వివి ప్యాట్ల లెక్కింపు జరగాలనేవి వీటిలో ముఖ్యమైనవి. ఈ విజయాల ద్వారా అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్ సంస్థ అవినీతి రాజకీయ పార్టీలు, నేరపూరిత నేతల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెత్తిస్తున్నది. భారత రాజకీయాలు ప్రక్షాళన చేసే ఎడిఆర్ ప్రయత్నానికి ప్రజాస్వామ్యవాదులు తమ మద్దతు తెలుపుతారని ఆశిద్దాం. ఈ నివేదికల ద్వారా సగటు భారతీయ ఓటరు మరింత చైతన్యవంతమవుతాడని, అదే విధంగా శక్తివంతమవుతాడని కోరుకుందాం.
– శ్రీశ్రీ కుమార్