Reading Time: 2 minutes

ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విపక్షాలను చిత్తు చేస్తూ దూసుకుపోతోంది. రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 24 చోట్ల బిజెపిశివసేన (షిండే) కూటమి ఘన విజయం సాధించే దిశలో ఉంది. బృహన్ ముంబై కార్పొరేషన్ (బిఎంసి)ను అధికార మహాయుతి కూటమి కైవసం చేసుకుంటోంది. మొత్తం 227 వార్డులకు గాను 210 వార్డుల్లో ఈ కూటమి ఆధిక్యంలో ఉంది. శివసేన, అజిత్ పవార్ ఎన్‌సిపిలతో కూడిన కూటమి మహాయుతి అన్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల తరువాత ఈ ఎన్నికలు జరగడంతో ఇటు మహాయుతి కూటమి, అటు మహావికాస్ అఘాడీ (శివసేన యూబిటిఎంఎన్‌ఎస్‌ఎన్‌సిపి (ఎస్‌పి) కూటమి, ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వం లోని వంచిత్ బహుజన్ అఘాడీ (విబిఎ)తో కాంగ్రెస్ జతకట్టిన కూటమి, పోటీ పడినప్పటికీ అధికార మహాయుతి కూటమియే విజయ పతాకాన్ని ఎగురవేసింది. బృహన్ ముంబైతో పాటు 29 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. అన్నిచోట్ల బిజెపి శివసేన కూటమే దూసుకుపోతోంది.

నవీముంబై, నాసిక్, పన్వేల్, శంభాజీనగర్, నాగ్‌పూర్, అకోలా, జాల్నాలో బిజెపియే ఆధిక్యంలో ఉంది. అమరావతిలో కాంగ్రెస్, ఠాణేలో శివసేన, పర్బణిలో శివసేన (యుబిటి) ముందంజలో ఉన్నాయి. ఈసారి హైదరాబాద్‌కు చెందిన ఓవైసీ పార్టీ ఎఐఎంఐఎం ముంబై, నాందేడ్ సహా అనేక ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో తన ఆధిపత్యాన్ని చాటుతుండడం విశేషం. బిఎంసిలో ఇప్పటికే ఈ పార్టీ రెండు స్థానాలను గెలుచుకోగా, నాందేఢ్‌లో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అహల్యానగర్, చంద్రపూర్, మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఈ పార్టీ మొదటిసారిగా బలమైన ఉనికిని చాటుకుంది. మాలేగావ్‌లో 20 సీట్లతో ఈ పార్టీ నంబర్ 1 స్థానంలో ఉంది. శివసేన 18 సీట్లలో, సమాజ్‌వాది పార్టీ 6 సీట్లలో ముందంజలో ఉన్నాయి. పుణె, పింప్రిచించినాడ్ మున్సిపల్ కార్పొరేషన్లలోనూ బిజెపి ఆధిపత్యం కనిపించింది. పుణెలో 165 సీట్లలో బిజెపి ఇప్పటికే 90 సీట్లలో గెలుపు సాధించగా, అజిత్ పవార్ శరద్‌పవార్ కూటమి కేవలం 20 స్థానాలకే పరిమితమైంది. బృహన్ ముంబై కార్పొరేషన్ పరిధిలో 2 కోట్ల మంది జనాభా ఉండగా, కోటి మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఏడేళ్ల పాటు ఎన్నికలు ఆలస్యం కావడానికి కరోనా మహమ్మారి, ఒబిసి కోటాపై కోర్టు కేసులు, తదితర అవాంతరాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. 2017లో ఎన్నికలు జరిగినప్పటికీ మేయర్‌గా ఎన్నికైన కిషోర్ పెడ్నేకర్ పదవీకాలం 2022తో ముగిసింది.

తాజా ఫలితాలతో ముంబై నగరానికి నాలుగేళ్ల తరువాత కొత్త మేయర్ రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం 893 వార్డుల్లోని 2869 సీట్ల కోసం ఈ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల బరిలో మొత్తం 15,931 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో ముంబై నుంచి 1700 మంది, పుణె నుంచి 1166 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 52.94 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠన రేకెత్తించాయి. అధికార మహాయుతి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తన వ్యూహాలను రూపొందించుకుంది. అధికార మహాయుతి కూటమిలో అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నా ఈ ఎన్నికల్లో వాటి ప్రభావం పనిచేయలేదు.

దాదాపు ఇరవై ఏళ్లుగా ఉప్పు, నిప్పులా భగ్గుమనే ఉద్ధవ్ థాక్రే, రాజ్‌థాక్రే ముంబై కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న తాపత్రయంతో చేతులు కలిపినా, ఈ ఎన్నికలు వారికి కలిసిరాలేదు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్ రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారితో స్థానిక మరాఠీలకు అన్యాయం జరగుతోందన్న ప్రాంతీయ వాదాన్ని వీరు తెరపైకి తెచ్చారు. అలాగే అధికార మహాయుతి ప్రభుత్వం త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని దీనివల్ల మరాఠీలకు అన్యాయం జరుగుతుందని ముమ్మరంగా వీరు ప్రచారం చేశారు. 1960లో ప్రాంతీయ అస్తిత్వవాదంతోనే శివసేన పటిష్టం అయింది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతీయ వాదం ప్రజల్లోకి వెళ్లకపోవడానికి బిఎంసి పరిధిలో మరాఠీ మాట్లాడేవారు 30 శాతం మించి లేకపోవడమేనని తెలుస్తోంది. ఇదివరకటిలా ఇవన్నీ పనిచేయకపోడానికి అభ్యర్థులు, ఓటర్ల ఆలోచనల్లో మార్పులు రావడమే. గెలిపించిన అభ్యర్థి వల్ల మనకు ఎంతవరకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్న తర్జనభర్జన ఓటర్లలో కనిపిస్తోంది.

బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దేశం లోనే అత్యంత సంపన్నమైనది. ఈ కార్పొరేషన్ బడ్జెట్ రూ. 60,000 కోట్లు. బిఎంసి పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు బడ్జెట్ కేటాయింపులతో ముడిపడి ఉంటాయి. కార్పొరేషన్ ఎవరికి హస్తగతం అవుతుందో వారి చేతుల్లోనే ఈ కేటాయింపులు జరుగుతుంటాయి. అందుకనే అధికార మహాయుతికే పట్టం గడితే ఆర్థిక ప్రయోజనాలు సులువుగా దక్కుతాయన్న అభిప్రాయం ఓటర్లలో వ్యక్తమైంది. అంతేతప్ప ప్రాంతీయవాదం కానీ, స్థానిక మరాఠీ వాదన కానీ, ఓట్ల చోరీ అని కాంగ్రెస్ లేవనెత్తిన వివాదం కానీ ఈసారి ఎన్నికల్లో పనిచేయలేదనిపిస్తోంది. ఇదిలా ఉండగా అధికార, విపక్ష కూటములు ఓటర్లకు ఎన్నో ఉచిత హామీలు గుప్పించారు. బెస్ట్ బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ, రానున్న ఐదేళ్ల వరకు మున్సిపల్ ఛార్జీల పెంపుపై మారటోరియం, నిరుపేదలకు ఇళ్లు, తదితర హామీలను అధికార మహాయుతి గుప్పించింది. ఇక విపక్ష కూటములు ఇళ్లల్లో పనిచేసే మహిళలకు నెలకు రూ. 1500, 700 చదరపు అడుగుల వరకు ఉండే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు కల్పిస్తామని హామీలిచ్చాయి.