Reading Time: < 1 minute

విజయ్ హజారే ట్రోఫీ

బెంగళూరు: ప్రతిష్ఠాత్మకమైన విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్లో విదర్భ ఆరు వికెట్ల తేడాతో కర్ణాటకను ఓడించి తుది పోరుకు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక 49.4 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన విదర్భ 46.2 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అమన్ మొఖాడే అద్భుత సెంచరీతో విదర్భను గెలిపించాడు. మరో ఓపెనర్ అథర్వ టైడ్ (6) ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన ధ్రువ్ షోరేతో కలిసి అమన్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు కర్ణాటక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ధ్రువ్ సమన్వయంతో ఆడగా అమన్ దూకుడును ప్రదర్శించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

కీలక ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ 64 బంతుల్లో ఐదు ఫోర్లతో 47 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన రవికుమర్ సమర్థ్ కూడా అమన్‌కు అండగా నిలిచాడు. ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ఇద్దరు మూడో వికెట్‌కు 112 బంతుల్లోనే 147 పరుగులు జోడించారు. అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించిన అమన్ 122 బంతుల్లోనే 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 138 పరుగులు చేశాడు. ఇక చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచిన రవికుమార్ 69 బంతుల్లో 7 ఫోర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటకను కరుణ్ నాయర్, కృష్ణన్ శ్రీజిత్ ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నాయర్ 8 ఫోర్లు, సిక్స్‌తో 76 పరుగులు చేశాడు. కృష్ణన్ 7 ఫోర్లతో 54 పరుగులు సాధించాడు. మిగతావారిలో పడిక్కల్ (28), శ్రేయస్ గోపాల్ (36), అభినవ్ మనోహర్ (26) పరుగులు చేశారు. మరో సెమీస్‌లో సౌరాష్ట్ర ఘన విజయం సాధించింది.