
సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు
42 మందిపై పోలీసులు కేసు నమోదు
మన తెలంగాణ/హైదరాబాద్ : సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపులు, ఎఐతో మార్ఫింగ్ ఫోటోలతో తనను మానసిక వేదింపులకు గురి చేస్తున్నారని సినీ నటి, టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆమె ఫిర్యాదు పై 42 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి తనపై వేదింపులు కొనసాగుతున్నాయని అనసూయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటి వల్ల తనకు మానసిక వేధింపే కాకుండా, తన జీవనోపాధి, ప్రజా జీవితంపై ప్రత్యక్ష దాడిగా ఆమె పేర్కొన్నారు. తనను వేదింపులకు గురి చేసిన వారి పేర్లతో పాటు సోషల్ మీడియా లింకులను కూడా అనసూయ తన ఫిర్యాదులో జత చేశారు. వారిలో బొజ్జ సంధ్యారెడ్డి, గోగినేని ప్రియాచౌదరి, పావని, శేఖర్‌బాషా, రజిని, కరాటే కల్యాణి, విజయలక్ష్మి, యాంకర్ రోహిత్, దుర్గ, యాంకర్ మనోజ్ తదితరులు ఉన్నారు. అనసూయ చేసిన ఫిర్యాదు మేరకు 42 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై బిఎన్‌ఎస్ సెక్షన్లు 75, 79, 336(4), 351, 356, ఐటి చట్టం 66ఇ, 67 కింద కేసులు నమోదు చేశారు.