Reading Time: 3 minutes

గత ప్రభుత్వం పరీక్షలను సరిగా నిర్వహించలేదు

ప్రశ్నా పత్రాలను పల్లీ, బఠానీల్లా అమ్ముకున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టిజిపిఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశాం

ప్రభుత్వానికి వారధులు, సారధులు ప్రభుత్వ ఉద్యోగులే

గ్రూప్ 3 అభ్యర్థుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమకారులయ్యారని, విద్యార్థులు అవసరమైన సందర్భంలో ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను సాధించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో రెండుసార్లు సిఎం అయిన వ్యక్తులు రాజకీయ, కుటుంబ, పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేశారని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పైన ఆలోచన చేయలేదని, కుటుంబం మొదటి ప్రాధాన్యత, పార్టీ రెండో ప్రాధాన్యత, రాజకీయాలు మూడో ప్రాధాన్యతగా గత పాలకులు ఆలోచించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శిల్పాకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమంలో జరిగింగి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ,ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మేయర్ గద్వాల విజయల, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావులు పాల్గొన్నారు. 1,370 మంది గ్రూప్ 3 అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను సిఎం అందచేయగా మొత్తం 25 ప్రభుత్వ శాఖలకు సంబంధించి నియామకాలు జరిగాయి.

గత ప్రభుత్వం యువత గురించి ఆలోచించలేదు

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ యువత గురించి ఆలోచించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల ఉద్యోగాలు తొలగిస్తేనే తమకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత నడుం బిగించారని అందులో భాగంగానే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని సిఎం రేవంత్ అన్నారు. టిజిపిఎస్సీ లో దారుణ పరిస్థితులు అందరికి తెలుసనీ, 14 ఏళ్ల పాటు గ్రూప్ 1 నియామకాలు చేపట్టలేకపోయారని సిఎం అన్నారు. ఇంత కంటే దారుణం, ఘోరం ఎక్కడైనా ఉంటుందా..? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 563 గ్రూప్ 1 ఉద్యోగాల కోసం 5 లక్షల దరఖాస్తులు వచ్చాయని, 731 గ్రూప్ 2 ఉద్యోగాల కోసం 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, గత ప్రభుత్వం పరీక్షలను సరిగా నిర్వహించలేదని సిఎం దుయ్యబట్టారు. ప్రశ్నా పత్రాలను పల్లీ బఠానీల్లా అమ్మితే వారికి చీమకుట్టినట్లైనా లేదని ఆయన పేర్కొన్నారు.

రెండేళ్లలో దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

టిజిపిఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశామని యూపిఎస్సీని స్వయంగా పరిశీలించి టిజిపిఎస్సీని ఏర్పాటు చేశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆర్‌ఎంపి డాక్టర్, డిప్యూటీ ఎమ్మార్వో, రిటైర్డ్ టీచర్‌ను టిజిపిఎస్సీ సభ్యులుగా గత ప్రభుత్వం నియమించిందని, తెలంగాణ నిరుద్యోగుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉన్నవాళ్లేనే టిజిపిఎస్సీ సభ్యులుగా నియమించామని, ప్రభుత్వ టీచర్లు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాలను ఒక బాధ్యతతో ఎలాంటి తప్పులు లేకుండా భర్తీ చేశామని ఆయన తెలిపారు. నియామకపత్రాలు ఇవ్వొద్దని కుట్రలు చేసినా కోర్టులతో కొట్లాడి వాటిని భర్తీ చేశామని ఆయన చెప్పారు. రెండేళ్లలో దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఎల్బీ స్టేడియం, శిల్పారామం, సాగునీటి పారుదల శాఖ కార్యాలయం, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈ నియామక పత్రాలను అందజేశామని ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలకు మీ ఉద్యోగాలు దిక్సూచిగా మారుతుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భావోద్వేగం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భావోద్వేగమని, తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములు చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 25 ప్రభుత్వ శాఖల్లో 1,370 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలతో మమ్మల్నీ కలిసి మీ కళ్లలో ఆనందం చూడాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని సిఎం రేవంత్ అన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ విద్య, నీటిపారుదల రంగానికి ప్రాధాన్యత ఇచ్చారని, దేశంలో హరిత విప్లవాన్ని తీసుకువచ్చి అహార భద్రత కల్పించింది నెహ్రూ అని ఆయన అన్నారు. విద్య అందరికి అందుబాటులో ఉన్నప్పటికీ నాణ్యమైన విద్య ప్రజలకు అందడం లేదని ఆయన అన్నారు.

పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తే ప్రపంచంతో పోటీ

16 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్నారని, 11 వేల ప్రైవేట్ స్కూల్స్ లో 33 లక్షల విద్యార్థులు చదువుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలపైన ఎందుకు విశ్వాసం తగ్గుతుందో ఆలోచించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తే ప్రపంచంతో పోటీ పడగలమన్న విశ్వాసం తనకుందన్నారు. భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందని, 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరిని పండించి దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని ఆయన తెలిపారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ పుడ్, స్కిల్‌పైన దృష్టి పెడుతున్నామని ఆయన అన్నారు. స్కిల్ లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేకపోతు న్నామని, విద్యలో స్కిల్ చాలా ముఖ్యమయ్యిందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం పనిచేయాల్సి ఉందని, నాణ్యమైన విద్యను అందించే అవకాశం ప్రభుత్వం దగ్గర ఉందని ఆయన తెలిపారు. విద్య ఒక్కటే జీవితాల్లో మార్పు, వెలుగులు తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి వారధులు, సారధులు ప్రభుత్వ ఉద్యోగులేనని ఆయన తెలిపారు.

రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారొద్దు

2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గరం, నరం, బే షరమ్ నానుడి తప్పు అని ఉద్యోగులు నిరూపించాలని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పేదల మొహంలో తల్లిదండ్రులను చూసుకొని ప్రభుత్వ ఉద్యోగులు సేవలు లక్ష్యంగా అందించాలని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకొని ఉద్యోగుల జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి తల్లిదండ్రులకు అందజేస్తా మని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులను సరిగా చూసుకోని వాళ్లు మానవ జన్మలో ఉండొద్దని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు. పుట్టిన బిడ్డ ప్రయోజకుడు అయితే తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదని, కూలీ పని చేసి మరీ తల్లిదండ్రులు చదవించి పోటీ పరీక్షలకు తయారు చేశారని ఆయన అభినందించారు. రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారొద్దని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో, అశోక్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారో తనకు తెలుసనీ సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.