Reading Time: < 1 minute

గోడ దూకిన ఎంఎల్‌ఎలను కాపాడేందుకు

ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు

వాళ్లంతా ప్రజాకోర్టులో ఎప్పుడో

మాజీలు అయిపోయారు

ప్రజాతీర్పును అవమానించిన

వారిపై పోరాటం ఆగదు

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ఫిరాయింపు ఎంఎల్‌ఎలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ, తన దిగజారుడుతనాన్ని మరోసారి చాటిచెప్పిందని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎల అంశంపై కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

గతంలోనూ ఐదుగురు ఫిరాయింపు ఎంఎల్‌ఎలపై వేటుపడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే ఇప్పుడు కూడా రాజ్యాంగ విలువలకు నిలువునా పాతరేశాయని ధ్వజమెత్తారు. పార్టీ మారినట్టు కళ్ళముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా, ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైనే కాదు, చివరికి అత్యున్నత న్యాయస్థానాలపైనా కూడా గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడంతో ఫిరాయింపు ఎంఎల్‌ఎల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వణికిపోతోందని తాజా తీర్పు తేటతెల్లం చేస్తోందని విమర్శించారు. గోడ దూకిన ఎంఎల్‌ఎలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు విఫలయత్నం చేసినా ప్రయోజనం లేదని, వాళ్లంతా ప్రజాకోర్టులో ఎప్పుడో మాజీలు అయిపోయారనే విషయాన్ని గుర్తించకపోవడం కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాతీర్పును అవమానించిన జంప్ జిలానీలకు, గడప గడపకు వెళ్లి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే దాకా బిఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.