
ఎఫ్‌టిఎల్ భూములు అప్పగిస్తే 200 శాతం, బఫర్‌జోన్
భూములకు 300 శాతం, నాలాల విస్తరణకు 400 శాతం
టిడిఆర్ పెంపు నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ
మన తెలంగాణ/సిటీ బ్యూరో: రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, వాగులను కా పాడేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జలవనరుల పరిరక్షణతో పాటు, ఆయా ప్రాంతాల్లోని పట్టా భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించే యజమానులకు నష్టం కలగకుండా బదిలీ చేయగల అభివృద్ధి హక్కుల నిబంధనలను భారీగా సవరించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు గతంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ భూములకు టీడీఆర్ కేవలం 200 శాతంగా మాత్రమే ఉండేది. తాజా నిబంధనల ప్రకారం దీన్ని భారీగా పెంచుతూ యజమానులకు ఊరటనిచ్చింది.
ఎఫ్‌టీఎల్ భూములకు: సరస్సులు, నదుల ఎఫ్‌టీఎల్/ఎంఎఫ్‌ఎల్ పరిధిలో ఉన్న పట్టా భూములను అప్పగిస్తే 200 శాతం టీడీఆర్ ఇస్తారు.
బఫర్ జోన్లకు: చెరువులు, నదుల బఫర్ జోన్లలోని భూములను అప్పగిస్తే టీడీఆర్‌ను 300 శాతానికి పెంచారు.
నాలా విస్తరణకు: నాలాల విస్తరణ కో సం ప్రైవేటు భూములను అప్పగిస్తే, రో డ్డు విస్తరణతో సమానంగా 400 శాతం టీడీఆర్‌ను ప్రభుత్వం కేటాయించింది.
ప్రజా అవసరాలకు: జలవనరుల అభివృద్ధి లేదా ఇతర బహిరంగ ప్రయోజనాల కోసం బఫర్ జోన్ బయట సేకరించే భూములకు కూడా 400 శాతం టీడీఆర్ లభిస్తుంది.
సెట్ బ్యాక్స్‌లో రాయితీలు
భూమిని కోల్పోయిన యజమానులు తమ మిగిలిన భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.
సడలింపులు
పట్టా భూమిని ఉచితంగా అప్పగిస్తే, మిగిలిన భూమిలో అదనపు అంతస్తులు లేదా సెట్‌బ్యాక్స్‌లో మినహాయింపు పొందే అవకాశం కల్పించారు.
అంతస్తుల నిబంధన
10 అంతస్తుల కంటే ఎక్కువ ఉన్న హై-రైజ్ భవనాల విషయంలో, 10వ అంతస్తు పైన నిర్మించే విస్తీర్ణంలో 10 శాతం తప్పనిసరిగా టీడీఆర్ వినియోగించుకోవాలని నిబంధన విధించింది.
అయోమయానికి తావులేకుండా..
టీడీఆర్ జారీకి ముందు ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేదా అడిషనల్ కలెక్టర్ ర్యాంక్ అధికారుల క్లియరెన్స్ తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక ఎకరం కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూముల విషయంలో టీడీఆర్ జారీకి ము ందు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. వివాదాల్లో ఉన్న భూ ముల విషయంలో టీడీఆర్‌ను నే రుగా ఇవ్వకుండా, ’టీడీఆర్ బ్యాం క్’లో భద్రపరుస్తారు. సమస్య పరిష్కారమైన తర్వాతే సంబంధిత యజమానికి దాన్ని బదిలీ చేస్తారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో చేపట్టిన లేక్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.