Reading Time: < 1 minute

చివరి దశకు చేరుకున్న పనులు

రెండేళ్లుగా నిర్మాణం… ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 32.47 కోట్ల ఖర్చు

మనతెలంగాణ/హైదరాబాద్

మెహిదీపట్నం స్కైవాక్ మార్చిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ జంక్షన్‌లో పాదాచారుల భద్రత కోసం నిర్మిస్తున్న ఈ స్కైవాక్ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. మార్చిలో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్, నగరవాసులకు కొత్త అనుభూతిని అందించనుంది. ప్రస్తుతం స్కైవాక్ వద్ద చివరి దశ పనులు జరుగుతున్నాయని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు. దాదాపు రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 32.47 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మెహిదీపట్నం జంక్షన్ అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ మార్గాల్లో ఒకటి. ప్రతిరోజూ లక్షలాది వాహనాలు ఈ జంక్షన్ మీదుగా ప్రయాణిస్తాయి. ఈ జంక్షన్ మీదుగా మొయినాబాద్, నార్సింగి, పరిగి, శంషాబాద్, తాండూర్, వికారాబాద్, హైటెక్ సిటీ, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, కోకాపేట్, నానక్‌రాంగూడలకు వెళ్లవచ్చు. దీంతో ఈ జంక్షన్‌లో విపరీతమైన రద్దీ ఉంటుంది. దీనికి తోడు పాదాచారులు ఎక్కువగా తిరుగుతుండటంతో ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్, పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా స్కైవాక్ నిర్మించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

స్కైవాక్ నిర్మాణం 340 మీటర్ల పొడవు

ఈ స్కైవాక్ నిర్మాణం 340 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది మెహిదీపట్నం బస్టాప్ నుంచి జంక్షన్ ఎదురుగా ఉన్న డిఫెన్స్ ల్యాండ్ వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో 160 మీటర్లు ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ వైపు, 180 మీటర్లు మల్లేపల్లి వైపు ఉంటాయి. అధికారులు ఈ స్కైవాక్‌ను ఆర్చ్-స్టైల్ ఎలివేషన్‌తో ఆధునిక సౌకర్యాలతో రూపొందించారు. ఉప్పల్ స్కైవాక్ నుంచి ప్రేరణ పొంది దీనిని నిర్మించారు. ఉప్పల్ స్కైవాక్ ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, ప్రజలు సేదతీరేందుకు అనుకూల ప్రదేశంగా మారింది. ప్రస్తుతం మెహిదీపట్నం స్కైవాక్‌ను అలానే నిర్మిస్తున్నారు. ఈ స్కైవాక్‌లో లోపలికి, బయటకు వెళ్లడానికి 5 ద్వారాలు ఉన్నాయి. నడవడానికి వీలుగా ఉండే మార్గాలు 4-5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. స్కైవాక్‌లో 12 లిఫ్టులను ఏర్పాటు చేశారు. ప్రతి లిఫ్ట్ ఒకేసారి 20 మంది వరకు తీసుకెళ్లగలదు.