
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ డొల్ల కావున..ఆరు గ్యారెంటీల హామీ లేనందున పత్రాలు చింపామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కోటి మంది మహిళలకు నెలానెలా రూ. 2500 ఇస్తామన్నారని, ప్రభుత్వ మోసాన్ని తెలిపేందుకు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపామని అన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బిఆర్ఎస్ వ్యవహరిస్తోందని తెలియజేశారు.
కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని వెనక్కి తగ్గారని, నీటిపారుదలశాఖ పద్దుపై చర్చ సమయంలో బిఆర్ఎస్ నేతలను సప్పెండ్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలపై నిలదీశామని, కాంగ్రెస్ వచ్చాక 16 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సభలో ప్రభుత్వమే చెప్పిందని అన్నారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సిఎం రేవంత్ రెడ్డి చెప్పేవి కాకి లెక్కలు అని మండిపడ్డారు. చేశారు. శాసనసభలో సిఎం పహల్వాన్ భాష మాట్లాడారని, కత్తుల కోలాటంతో తలలు తీస్తామంటే ఎథిక్స్ కమిటీకి సిఫార్స్ చేయలేదని అన్నారు. ప్రజా సమస్యలపై పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చామని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తమ పోరాటం కొనసాగుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.