Reading Time: < 1 minute

రాష్ట్ర ప్రభుత్వానికి, భారత ఆర్మీల మధ్య

వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారం

సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  గడిచిన పదేళ్లలో తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని, రాష్ట్రంలో తక్షణమే సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి భారత ఆర్మీని కోరారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానికి 2 నుంచి 4 సైనిక్ స్కూళ్లను మంజూరు చేశారని, తెలంగాణకు మంజూరు చేయలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది. భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (టిఏఎస్‌ఏ) మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డిజిపి శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో కేంద్రానికి, భారత సైన్యానికి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్ దామగుండం వద్ద లో-ఫ్రీక్వెన్సీ విఎల్‌ఎఫ్ నేవీ రాడార్ స్టేషన్‌కు 3 వేల ఎకరాలు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్య వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వివిధ అంశాలకు సం బంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేకంగా అధికారులను నియమించాలని ఆయన కోరారు. హైసదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.