Reading Time: 2 minutes

తొలి జాతీయ గిరిజన ఆరోగ్య పరిశీలనా కేంద్రం ఏర్పాటు

కన్హా శాంతి వనం వేదికగా జాతీయ స్థాయి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ -మధ్య ఎంఓయూ

ప్రారంభోత్సవంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరాం వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ ్యప్తంగా గిరిజన వైద్యులను (ట్రైబల్ హీలర్స్) సమాజ ఆరోగ్య వ్యవస్థలో భాగస్వాములుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరాం అన్నారు. దీనిలో భాగంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనం వేదికగా జాతీయ స్థాయి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రారంభ సమావేశానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరాంతో పాటు సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ప్రముఖ వైద్య, పరిశోధనా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో గిరిజన వైద్యుల సామర్థ్యాభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భువనేశ్వర్ ఐసీఎంఆర్ -ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

‘ప్రాజెక్ట్ దృష్టి’ కింద భారత్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ పేరుతో దేశంలో తొలి జాతీయ గిరిజన ఆరోగ్య పరిశీలనా కేంద్రం ఏర్పాటు కానుంది. దీని ద్వారా గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ఆరోగ్య డేటా సేకరణ, పరిశోధన, మలేరియా, కుష్టు, క్షయ నిర్మూలన కార్యక్రమాలకు శాస్త్రీయ ఆధారం లభించనుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జువల్ ఓరాం మాట్లాడుతూ దేశ ్యప్తంగా గిరిజన వైద్యులను (ట్రైబల్ హీలర్స్) సమాజ ఆరోగ్య వ్యవస్థలో భాగస్వాములుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గిరిజన వైద్యులను అధికారికంగా గుర్తించి, ప్రజారోగ్య వ్యవస్థతో అనుసంధానించే తొలి జాతీయ ప్రయత్నంగా ఈ కార్యక్రమం చరిత్రలో నిలవనుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా చివరి మైలు వరకు సమగ్ర, సమాజ ఆధారిత అభివృద్ధిని సాధించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు.

తరతరాలుగా వచ్చిన భారతీయ ఆదివాసీ వైద్య సంప్రదాయాలను వలస పాలకులు కూడా నిర్మూలించలేకపోయారని చెప్పారు. సంప్రదాయ వైద్యంపై ఆధారిత ఉపాధి అవకాశాల కోసం ఎఫ్‌ఎంసిజి, ఔషధ సంస్థలతో భాగస్వామ్యాలు పరిశీలించాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్టాల నుండి సుమారు 400 మంది గిరిజన సంప్రదాయ వైద్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర గిరిజన సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంలో షెడ్యూల్ తెగల పాత్ర కీలకమని చెప్పారు. జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ జ్ఞానం, ఆధునిక విజ్ఞానం, సాంకేతికత, సంక్షేమ పథకాలను సమన్వయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల స్థిరమైన జీవన విధానం సమాజానికి అనేక పాఠాలు నేర్పుతుందని వ్యాఖ్యానించారు. హార్ట్‌ఫుల్‌నెస్ గ్లోబల్ గైడ్ పూజ్య దాజీ మాట్లాడుతూ ఆధ్యాత్మిక ఆరోగ్యం, యోగా, ధ్యానం ప్రాధాన్యతపై మాట్లాడారు. గిరిజన అభివృద్ధి అనేది కేవలం ఆరోగ్య సేవలకే పరిమితం కాకుండా ఉపాధి, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర సంక్షేమం వైపు దృష్టి పెట్టాలని అన్నారు.