Reading Time: 2 minutes

హాలీవుడ్ గడ్డపై ‘రామాయణ’ గర్జన.. రణబీర్ ‘రాముడి’ లుక్‌కు ఫారెనర్స్ ఫిదా!

Caption of Image.

భారతీయ చలనచిత్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో చిత్ర బృందం నిర్వహించిన ప్రత్యేక ప్రివ్యూ స్క్రీనింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

హాలీవుడ్ గడ్డపై ‘రామ’ మ్యాజిక్!

ప్రముఖ నిర్మాణ సంస్థ నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, ఆస్కార్ విజేత సంస్థ ‘DNEG’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలోనే లాస్ ఏంజిల్స్‌లోని ఒక ఐమాక్స్ (IMAX) థియేటర్లో ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్రేక్షకులకు, విమర్శకులకు ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌లో హీరో రణబీర్ కపూర్, దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా పాల్గొన్నారు.

ఫారెనర్స్ ఫిదా..

ఈ టీజర్‌ను చూసిన విదేశీ ప్రేక్షకులు విజువల్స్ చూసి షాక్‌కు గురైనట్లు సమాచారం. ముఖ్యంగా రణబీర్ కపూర్ ‘శ్రీరాముడు’గా ఒక బోటులో కూర్చుని నెమ్మదిగా వెనక్కి తిరిగే షాట్ చూసి థియేటర్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించిందని, ఆ విజువల్ గ్రాండ్‌నెస్ చూసి పలువురి కళ్లలో నీళ్లు తిరిగాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. హాలీవుడ్ స్థాయి మేకింగ్ వాల్యూస్‌తో భారతీయ పురాణాన్ని ఆవిష్కరించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

రణబీర్ భావోద్వేగం

ఈ సందర్భంగా రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు కొన్ని శతాబ్దాలుగా కోట్ల మందికి మార్గదర్శి. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఆదర్శాలు అలాగే ఉంటాయి. కష్ట సమయాల్లో మానవ స్ఫూర్తి ఎంత గొప్పగా పోరాడగలదో ఆయన ప్రపంచానికి నేర్పించారు. దయ, ధైర్యం, ధర్మం , క్షమాగుణాలకు నిలువుటద్దమైన ‘పురుషోత్తముడు’ పాత్రను పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని రణబీర్ పేర్కొన్నారు.

 

ఏప్రిల్ 2న బ్లాస్టింగ్!

అత్యంత గోప్యంగా ఉంచిన ఈ ‘రామ’ గ్లింప్స్‌ను భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల కోసం ఏప్రిల్ 2న ‘హనుమాన్ జయంతి’ సందర్భంగా అధికారికంగా విడుదల చేయనున్నారు. సెన్సార్ బోర్డు (CBFC) నుంచి ఈ టీజర్ ఇప్పటికే ‘U’ సర్టిఫికేట్ పొందింది. దీని నిడివి 2 నిమిషాల 38 సెకన్లు ఉండనుంది. హిందీతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా ఈ టీజర్‌ను రిలీజ్ చేసి గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు మేకర్స్.

భారీ తారాగణం.

ఈ మూవీలో రాముడుగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడుగా యశ్, హనుమంతుని పాత్రాలో సన్నీ డియోల్, లక్షణుడు గా రవి దూబే నటిస్తున్నారు.  ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ మరియు హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మెర్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పౌరాణిక గాథ మొదటి భాగం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల కానుంది. భారతీయ సినిమా గౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశగా ‘రామాయణ’ అడుగులు వేస్తోంది.

 

©️ VIL Media Pvt Ltd.