Reading Time: < 1 minute

రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి డైరెక్షన్‌లో వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’. భారీ అంచనాల నడుమ జనవరి 9న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కానీ, రెండో రోజు నుంచి వసూళ్లు భారీగా పడిపోయాయి. అయితే ఇప్పుడు మూవీ రిలీజై వారం రోజులు దాటింది. ప్రస్తుతానికి చూస్తే ఈ వారంలో దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.130 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఏడో రోజు కేవలం రూ.5.65 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది.

‘ది రాజాసాబ్’ ఇండియా వ్యాప్తంగా గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే.. రూ.156 కోట్లకు పైగా రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించిన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల మార్క్‌ దాటేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్‌గా చూస్తే ఏడు రోజుల్లో రూ.250 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ఫ్లాప్ చిత్రాలైన సాహో, ఆదిపురుష్ చిత్రాలు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాయి. వాటికంటే దారుణంగా రాజాసాబ్ వసూళ్లు పడిపోయాయి. గతంలో రిలీజైన కల్కి చిత్రం వారం రోజుల్లోనే రూ.399 కోట్లు వసూళ్లు సాధించింది.