Reading Time: 2 minutes

ఇరాన్ తన విప్లవానంతర చరిత్రలోనే అత్యంత తీవ్రమైన సంక్షోభాలలో ఒకదాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక కష్టాలపై ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించి, సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ అధికారానికి నిరంతర సవాలుగా మారాయి. హింస పెరుగుతున్న వేళ, ఉరిశిక్షల బెదిరింపులు, దాదాపు సంపూర్ణ ఇంటర్నెట్ నిలిపివేత, అలాగే ముఖ్యంగా అమెరికా వంటి విదేశీ శక్తుల జోక్యం- ఇరాన్ అంతర్గత కల్లోలిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. మానవ హక్కుల సంస్థలు పరిస్థితి వేగంగా క్షీణిస్తున్నదని హెచ్చరిస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి అగ్నెస్ కాలమార్డ్, నిరసనలను అణచివేయడానికి త్వరిత విచారణలు, యాదృచ్ఛిక ఉరిశిక్షలు మళ్లీ ఉపయోగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో జరిగిన ఉమెన్, లైఫ్, ఫ్రీడం ఉద్యమం తరువాత చోటుచేసుకున్న సామూహిక ఉరిశిక్షలను ఆమె గుర్తు చేశారు. 26 ఏళ్ల నిరసనకారుడు ఎర్ఫాన్ సొల్తానీ కేసును ఉదాహరణగా పేర్కొంటూ, అతడికి తక్షణమే ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు సంపూర్ణ ఇంటర్నెట్ బ్లాక్ ఔట్ కారణంగా హత్యలు, అరెస్టుల నిజమైన పరిమాణాన్ని నిర్ధారించడం అసాధ్యంగా మారింది.

అశాంతి వ్యాప్తి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్‌లోని 31 ప్రావిన్సులన్నింటిలోనూ నిరసనలు చెలరేగాయి; 180కు పైగా నగరాల్లో వందలాది ప్రదర్శనలు నమోదయ్యాయి. ఇటీవల వారాల్లో కనీసం 850 మంది మరణించారని, 2,300 మందికి పైగా అరెస్టయ్యారని హక్కుల సంఘాలు అంచనా వేస్తున్నాయి. బ్లాక్‌ఔట్ వల్ల కుటుంబాలు పరస్పరం సంబంధాలు కోల్పోయాయి, సమాచారం శూన్యావస్థ నెలకొంది. -ఇదంతా జరుగుతుండగానే భద్రతా బలగాలు తమ దమన చర్యలను మరింత కఠినతరం చేశాయి. తాజా నిరసనలకు కారణం ఆర్థిక పతనం. ఇరానియన్ రియాల్ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పడిపోయింది; ద్రవ్యోల్బణం సుమారు 40 శాతానికి చేరింది; ఆహారం, ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్ ధరల పెంపు, చాలా వస్తువులపై సబ్సిడీ మారకపు రేట్ల రద్దు ఇవన్నీ అనేక కుటుంబాలను అంచుల దాకా నెట్టాయి. అయితే నిరసనలు త్వరలోనే ఆర్థిక అంశాలను దాటి, రాజకీయ దమనంపై ఉన్న లోతైన కోపాన్ని ప్రతిబింబించాయి. ముఖ్యంగా 2022లో పోలీస్ కస్టడీలో మరణించిన మహ్సా అమిని ఘటన తరువాత మిగిలిన గాయాలను. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘర్షణాత్మక ధోరణి అవలంబించారు.

నిరసనలు కొనసాగించాలని ఇరానీయులను ప్రోత్సహిస్తూ, నిరసనకారులకు ఉరిశిక్షలు అమలు చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని తెహ్రాన్‌ను హెచ్చరించారు. ఇరాన్‌లో గెలవాలి అనేదే తన లక్ష్యమని ట్రంప్ చెప్పారు. వేగవంతమైన, బలప్రయోగాత్మక చర్యల సంకేతాలు ఇచ్చారు. అయితే ఇవి- మధ్యప్రాచ్యంపై అమెరికా దృష్టిని తగ్గించాలని, ఇతర దేశాలపై రాజకీయ మార్పులు రుద్దకూడదని చెప్పిన కొద్ది వారాల క్రితమే విడుదలైన వాషింగ్టన్ జాతీయ భద్రతా వ్యూహానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అమెరికాలోనే ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదు. సెనేటర్ బెర్నీ శాండర్స్, అమెరికా సైనిక జోక్యం ఘోరమైన తప్పిదమని హెచ్చరిస్తూ, గత జోక్యాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. హింసాత్మక దమనాన్ని ఆపాలని, ఇంటర్నెట్‌ను పునరుద్ధరించాలని, స్వేచ్ఛాయుత ఎన్నికలను మద్దతు ఇవ్వాలని వాషింగ్టన్ కోరాలని ఆయన అభిప్రాయం. బాహ్య ఒత్తిడి- ముఖ్యంగా సైనిక బెదిరింపులు తాము సహాయపడాలనుకునే ప్రజలకే నష్టం చేస్తాయన్న విస్తృత ఆందోళనను ఇది ప్రతిబింబిస్తుంది. ఇరాన్ మరో 1979 దిశగా వెళ్తుందా అనే ప్రశ్న చాలా మందిని ఆకర్షిస్తోంది.

కానీ ఈ పోలిక మోసపూరితమైనది. షాను కూల్చిన విప్లవం విజయం సాధించడానికి నిరసనలే కాకుండా, అధికార వర్గాల్లో చీలికలు, భద్రతా బలగాల సందిగ్ధత కూడా కారణమయ్యాయి. నేటి ఇరాన్ పూర్తిగా భిన్నం. ఇక్కడ అధికారం కట్టుదిట్టమైన ధార్మిక భద్రతా రాజ్యంలో కేంద్రీకృతమై ఉంది. రెవల్యూషనరీ గార్డులు, బసీజ్, గూఢచార సంస్థలు గాఢంగా ముడిపడిన సిద్ధాంతపరమైన విధేయతతో పనిచేస్తున్నాయి. పెద్ద ఎత్తున నిరసనలు మాత్రమే ఉన్నత వర్గాల విరుగుడుకు దారి తీసే అవకాశాలు తక్కువ; అవి మరింత కఠినమైన దమనానికే దారి తీసే అవకాశం ఎక్కువ. బాహ్య జోక్యం ఈ సమీకరణాన్ని తప్పనిసరిగా మార్చదు. నాయకత్వంపై ప్రత్యక్ష షాక్ వ్యవస్థను అస్థిరం చేయగలిగినా, అమెరికా లేదా ఇజ్రాయెల్ బహిరంగ జోక్యం కఠిన వాదులను బలపరిచి, నిరసనలు విదేశీ ప్రేరేపితమన్న ప్రభుత్వవాదనకే బలం చేకూర్చుతుంది. చరిత్ర చెబుతున్నది ఇలాంటి ఒత్తిడి రాజకీయ స్థలాన్ని తెరవడం కన్నా మూసివేయడానికే ఎక్కువగా దోహదపడుతుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ మిత్ర బలగాలు ఒత్తిడిలో ఉన్నాయి;

మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం అంతర్జాతీయంగా తీవ్రమైన ఆందోళనకు కారణమవుతోంది. ఆయుధ స్థాయి సమీపానికి యురేనియం శుద్ధిని పెంచిన తెహ్రాన్, ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థతో సహకారాన్ని తగ్గించింది. -తాము బాంబు కోరుకోవడం లేదని చెబుతూనే ఇరాన్ నాయకత్వం తన వైఖరిని స్పష్టంగా తెలిపింది. ఇస్లామిక్ రిపబ్లిక్ వెనక్కి తగ్గదని ఖమెనీ ప్రకటిస్తూ, నిరసనకారులను విదేశీ శక్తుల ఏజెంట్లుగా దూషించారు. బయటి దేశాలు జోక్యం చేయవద్దని హెచ్చరించారు. నిరసనలు కొనసాగుతున్న కొద్దీ ముందున్న మార్గం మరింత సంకుచితమవుతోంది. అంతర్జాతీయ సమాజానికి సవాలు దమన చక్రాన్ని పెంచకుండా మానవ హక్కులు, బాధ్యత కోసం ఒత్తిడి తేవడం, వీధుల్లో ఉన్న ఇరానీయులకు ఇది గౌరవం, న్యాయం, ఇంకా తీవ్ర అనిశ్చితిలో ఉన్న భవిష్యత్తు కోసం సాగుతున్న పోరాటం.

– డా. ముచ్చకోట సురేష్ బాబు

9989988912