Reading Time: 3 minutes

భారతదేశంలో విప్లవం అనే పదాన్ని వామపక్ష పార్టీలు సంకుచిత అర్థాలకు పరిమితం చేశాయి. రేషన్ కార్డు, పెన్షన్, సంక్షేమ పథకాల కోసం చేసే పోరాటాలే విప్లవమని అట్టడుగు కులాలకు నేర్పించారు. ఈక్రమంలో దోపిడీకి గురవుతున్న బహుజన సమాజం జెండాలు పట్టుకొని తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి విప్లవమని భ్రమించారు. కానీ, ‘విప్లవం అంటే తరతరాలుగా దోపిడీ చేస్తున్న అగ్రకులాలు మాకు న్యాయం కావాలనీ రోడ్లెక్కడం’. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఈ సంఘటనలు రెండుసార్లు మాత్రమే జరిగాయి. ఒకటి 1950 జనవరి 26 తరువాత. రాజ్యాంగం అమలులోకి రావడంతో అగ్రకులాలు తమ అదనపు హక్కులు కోల్పోతున్నామని భావించి, ఎన్.డి. తివారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని కాల్చి నిరసనకు దిగారు. రెండవది 1990లో మండల్ కమిషన్ అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన అగ్రకుల ఆందోళనలు అని చెప్పవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ బహుజనులకు భారత రాజ్యాంగం హక్కులైన విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు దగ్గరవడమే దీనికి కారణం. ఈ చారిత్రక అనివార్యతను సృష్టించిన వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాన్షీరాం. ఇప్పుడు అదే అనివార్యతను తెలంగాణలో బిసి ఉద్యమం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఒసి జెఎసి పేరుతో అగ్రకులాలు ఏకమయ్యారు. ఇటీవల వరంగల్ కేంద్రంగా అగ్రకులాల సింహగర్జన జరిగింది.

తమ హక్కుల కోసం పోరాడడం ఆహ్వానించ దగ్గ విషయమే. కానీ నిచ్చెనమెట్ల ఈ కులవ్యవస్థలో పైస్థాయిలో నిలిచి, అన్ని అవకాశాలు అనుభవించిన వర్గాలు రోడ్లపైకి రావడం ఒక కొత్త పరిణామం. ఇదే విప్లవ లక్షణం. మానవీయతను చాటాల్సిన సందర్భం ఇది. ఇది సబ్బండ కులాల చైతన్యానికి నాందిగా చెప్పవచ్చు. చారిత్రకంగా మనుధర్మ శాస్త్రం బిసి, ఎస్‌సి, ఎస్‌టి కులాలను ఊరికి సేవ చేసే కులాలుగా ముద్ర వేసింది. కానీ భారత రాజ్యాంగం అదే కులాలను గ్రామానికి ప్రథమ పౌరులు కావాలని చెప్పింది. దీని ఫలితమే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బహుజనుల అద్భుత ప్రజాస్వామ్య రాజ్యాంగ విజయం. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన గణాంకాల ప్రకారం 86.4 శాతం సర్పంచ్ స్థానాలు బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు గెలుచుకున్నాయి. కేవలం 13.6 శాతం మాత్రమే జనరల్ అభ్యర్థులకు దక్కాయి. ఇది యాదృచ్ఛిక విజయం కాదు. డాక్టర్ విశారదన్ మహారాజ్, రిటైర్డ్ ఐఎఎస్ టి.చిరంజీవులు, జస్టిస్ ఈశ్వరయ్య, బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్ల ఉద్యమం తెచ్చిన చైతన్యమే దీనికి మూలం. మరోవైపు బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు సంఘటితమై మార్చి 31 2025 ఏర్పడిన జాక్ (జెఎసి) ఆధ్వర్యంలో కొనసాగుతున్న లక్ష కిలోమీటర్ల రథయాత్ర.

ఈ ఉద్యమాల ప్రభావంతో పంచాయతీ ఎన్నికల్లో బహుజనులు చారిత్రాత్మక విజయాలను సాధించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో, బిసి వర్గానికి చెందిన పంచిత ధర్మరాజు యాదవ్ అత్యధిక డబ్బు ఖర్చుచేసి అగ్రకుల నాయకుడిపై ఒక్క ఓటు తేడాతో గెలవడం ఒక చారిత్రక సంకేతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ముదిరాజ్ కులానికి చెందిన మాస్కురి కాశిరామ్ అగ్రకులాలన్నీ ఏకమై నిలబెట్టిన అభ్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించడం రాజకీయ చైతన్యానికి నిదర్శనం. వీరి విజయానికి కారణం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ చైతన్యాన్ని రగిలిస్తున్న డాక్టర్ విశారదన్ మహారాజ్ మాటలేనని రుజువైంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో పలు గ్రామాల్లో సర్పంచులు, వార్డు మెంబర్లుగా బిసి, ఎస్‌సి, ఎస్‌టిల గెలుపు తెలంగాణ చరిత్రలో మొదటిసారి సామాజిక, రాజకీయ ముఖచిత్రాన్ని మార్చింది. ఇది భవిష్యత్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల విజయానికి పునాది పడనుంది. ఈ విజయాలను అగ్రకులాల పార్టీ నాయకుల సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు అగ్రకులాల కూటమి జతకట్టి మూడు నెలల క్రితం కరీంనగర్ గడ్డపై జాక్ ఏర్పడింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి మొన్న వరంగల్ కేంద్రంగా సింహగర్జన జరిగింది.

విద్య, ఉద్యోగ సహా అన్ని రంగాల్లో వారికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా, ఒసి కమిషన్ ఏర్పాటు చేసి ఒసిల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బిసి ఉద్యమ అనివార్యతతో అగ్రకులాలన్నీ రోడ్లపైకి వచ్చి న్యాయం కావాలని అడగడం మూడో విప్లవానికి సంకేతం. రక్తపాతం లేకుండా, శాంతియుతంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవం తేవడమే భారత రాజ్యాంగ లక్ష్యం. కానీ దీనికి కులాధిపత్యం నిరంతరం అడ్డువస్తున్నది. భారత రాజ్యాంగం ప్రకారం అందరం సమానమే, జనాభా ప్రకారం అందరికీ సమాన అవకాశాలు దక్కాలి. శివుని సమానత్వం, బసవేశ్వరుని సమానత్వం కూడా ఇందులో ఇమిడి ఉంది. కానీ ఇంకా అన్ని రంగాల్లోనూ సమానత్వానికి, సమాన అవకాశాలకు అట్టడగు కులాలు దూరంగానే ఉన్నారు. తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే… 10% కూడా లేని అగ్రకులాలు అన్ని రంగాల్లో ఆధిక్యతను కలిగి 90% ప్రజలను పాలిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 119 మంది ఎంఎల్‌ఎలకు గాను అగ్రకులాలు నుంచి మొత్తం 62 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు.

వీరి జనాభా 10 శాతంలోపే ఉంది. మరోవైపు 56% బిసి జనాభాగాను వారిలో 19 ఎంఎల్‌ఎలు మాత్రమే ఉన్నారు. ఇదెక్కడి సామాజిక న్యాయం? ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది కులస్వామ్యం అని నిర్ధారణ అవుతుంది. ఈ కులాధిపత్య రాజకీయాలపై అగ్రకుల ప్రజాస్వామికవాదులు, బహుజన మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రతిభ పేరుతో బలవంతులే అవకాశాలు కొల్లగొడుతున్నారు. ఇది ఆటవిక సమాజ లక్షణం. నాగరిక సమాజంలో ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యానికి విరుద్ధం. దేశజనాభాలో ఎవరెంతో వారికంత చెందడమే ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్య స్ఫూర్తి. ఈ క్రమంలో అట్టడుగు కులాలతో పాటు అగ్రకులాలకు సైతం వారి జనాభా దామాషా ప్రకారం అవకాశాలు దక్కాలి. ఇదే మానవీయత. అగ్రకులాలు ఈ సత్యాన్ని అంగీకరించాలి. ఇప్పుడిప్పుడే సామాజిక, ఆర్థిక, రాజకీయ విముక్తి కోసం బిసి, ఎస్‌సి, ఎస్‌టి సమాజం చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇవ్వాలి. లేదంటే చరిత్ర అగ్రకులాలను దోపిడీ కులాలుగానే గుర్తిస్తుంది. 

– సంపతి మహారాజ్ 7989579428