Reading Time: 4 minutes

సునిశిత రాజకీయ పరిశీలన, లోతైన అవగాహన, విశ్లేషణ, వ్యక్తీకరణ కలగలిపిన లక్షణాలు కలిగిన అతికొద్ది మంది జాతీయ నాయకులలో జైపాల్ రెడ్డి ఒకరు. సమరశీల వ్యక్తిత్వం, విశిష్టమైన శైలి, భావస్పష్టత, భావవ్యక్తీకరణ అనే సుగుణాల వల్లనే విద్యార్థి నాయకుని నుంచి జాతీయ స్థాయికి ఎదిగి దేశ రాజకీయ – చిత్రపటంపై జైపాల్‌రెడ్డి చెరగని ముద్రవేశారు. విజ్ఞత, రాజకీయ చతురత, పాలనా పటిమ, ఎలాంటి బాధ్యతలు అయినా నిరూపమాన దక్షతతో నిర్వహించగలిగే లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం చాలా అరుదు. అటు జాతీయ, ఇటు రాష్ట్ర రాజకీయాలను తనదైన శైలిలో ప్రభావితం చేసిన జైపాల్‌రెడ్డి ఈ లక్షణాలన్నింటిని పుణికి పుచ్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. జాతీయ రాజకీయాలు తీసుకున్న ప్రతి మలుపులోనూ జైపాల్‌రెడ్డి ముద్ర ఉంది. దశాబ్దాలపాటు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన జైపాల్‌రెడ్డి అజాత శత్రువు. సిద్ధాంతాలకు అతీతంగా అన్ని పార్టీల అగ్రనేతలు ఆయనను అభిమానించేవారు. వారంతా ఆయకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు కూడా. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వన్నె తేవడంతో అందరినీ కలుపుకుపోవడం, అరమరికలు లేని స్నేహశీలత జైపాల్ రెడ్డికే సొంతం.

ఆయన రాజకీయ జీవితంలోని ప్రతి దశ ఒక అద్భుత ఘట్టమే. విజ్ఞాన భాడాంగారం అన్న మాటకు ఆయన తిరుగులేని తార్కాణం. స్వతహాగా తన స్నేహ శీలత స్వభావంతోపాటు మచ్చలేని వ్యక్తిత్వం జైపాల్ రెడ్డిని రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలకు చేర్చించింది. ఏ అంశంపైన అయినా విశ్లేషణాత్మకంగా, అనర్గళంగా మాట్లాడటం జైపాల్‌రెడ్డికి వెన్నతోపెట్టిన విద్య. నాటి జనతా పార్టీనుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జైపాల్‌రెడ్డి అప్రతిహత రాజకీయ పయనం వివేచన, విచక్షణ మేళవించిన ఆయన నిండైన జీవితానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ పార్లమెంట్ లో బిల్లు పాస్ కాగానే తెలంగాణ ఉద్యమనేత, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మొట్టమొదట ఢిల్లీలో జైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి ధన్యవాదాలు తెలిపారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆయన ఎంతటి కీలక భూమిక పోషించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణకుమార్ – రాష్ట్ర విభజనపై రచించిన ‘విభ -జన కథ’ పుస్తకంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్‌రెడ్డి నిర్వహించిన పాత్రపై చాలా వివరంగా రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల సందర్భంగా రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర లేదని కొందరు టిఆర్‌ఎస్ నాయకులు చేసిన విమర్శలపై స్పందిస్తూ, ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ స్వయంగా మా ఇంటికి వచ్చి ‘అన్నా.. కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి’ అని కోరితే సున్నితంగా తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పాటులో తన పాత్రేమీ లేకపోతే తనను సిఎంగా ఉండాలని కెసిఆర్ ఎందుకన్నారో, ఆయన్నే అడిగి తెలుసుకోండని జైపాల్‌రెడ్డి వారికి బదులిచ్చారు. దక్షిణాది నుంచి మొట్టమొదటగా ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అరుదైన పురస్కారాన్ని అందుకున్న గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా. చిన్నతనంలోనే రెండూ కాళ్లూ పోలియో కారణంగా పని చేయకపోయినా, తన అంగ వైకల్యం రాజకీయ పురోగతికి, పరిణితికి ఎక్కడా అడ్డురాలేదు. మాజీ ప్రధానులు విపి సింగ్, దేవెగౌడ, ఐకె గుజ్రాల్, మన్మోహన్ సింగ్‌కు అంతరంగ సన్నిహితునిగా ఉంటూ క్లిష్ట సమయాల్లో పలు కీలక అంశాలలో సూచనలు, సలహాలు ఇచ్చిన గొప్ప మేధావి, గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా. జనతాదళ్, నేషనల్ ఫ్రంట్, యూనైటెడ్ ఫ్రంట్‌కు జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరించి ప్రత్యర్థులను సైతం ఒప్పించి, మెప్పించగలిగిన రాజకీయ దురుంధరుడాయన. రాజకీయాలలో విలువలకు, సిద్ధాంతాలకు చివరిదాకా కట్టుబడిన గొప్ప వ్యక్తిత్వం జైపాల్‌రెడ్డికే సొంతం. నాలుగున్నర దశాబ్దాల తన రాజ కీయ జీవితంలో కనీసం ఒక్క ఆరోపణను కూడా ఎదుర్కోని నిజాయితీపరుడు కావడం మరో విశేషం. జైపాల్ రెడ్డి వ్యక్తిత్వం గురించి ఒక సందర్భంలో జనతాదళ్ సిద్ధాంతకర్త సురేంద్రమోహన్ విశ్లేషిస్తూ, విభిన్న మనస్తత్వాలుగల కింగ్ మేకర్లతో, కుయుక్తులకు పాల్పడే రాజకీయ నాయకులతో చాకచక్యంగా వ్యహరించగల సత్తాగల నాయకుడి’ గా అభివర్ణించారు. ‘ఆయన ఎవరినైనా సమర్థంగా తన దారిలోకి తెచ్చుకోగలరు’ అని కూడా కితాబు ఇచ్చారు. దేశ రక్షణ అంశాలు, ప్రపంచ వర్తక, వాణిజ్య ఒప్పందాలపైనా,

జాతీయ, అంతర్జాతీయ సామాజిక అంశాలపైనా జైపాల్ రెడ్డికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణలు రాజకీయ పండితులను సైతం అబ్బురపర్చే విధంగా ఉండేవి. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా జైపాల్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కినప్పుడు.. ఈ బిరుదుకు అసలు సిసలైన అర్హుడిగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం కొనియాడారు. ఏ అంశంలోనైనా లోతైన సునిశిత అధ్యయనం, అవగాహన, విశ్లేషణకు గుర్తింపుగానే.. కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పెట్రోలియం వంటి కీలక మంత్రిత్వశాఖలను జైపాల్‌రెడ్డికి అప్పగించడానికి మరో కారణం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, లోక్‌పాల్‌పై ఏర్పాటు చేసిన జాయింట్ సెలెక్ట్ కమిటీ, సెక్యూరిటీల కుంభకోణంపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తదితర వాటిలో కూడా సభ్యునిగా నియమించడానికి కారణం కూడా ఇదే. నిజాయితీకే కాకుండా నిరాండంబరానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు..

విపి సింగ్‌కు అత్యంత సన్నిహితునిగా వ్యవహరిం చినప్పటికీ ఆయన హయాంలో కేంద్ర మంత్రి పదవిని ఆశించలేదు. ‘మీకు ఎంతో సన్నిహితుడు కదా? మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని?’ అడిగితే, ‘నేను అడుగలేదు.. ఆయన ఇవ్వలేదు’ అని నవ్వేవారు. అంతటి స్థితప్రజ్ఞత జైపాల్‌రెడ్డిది. ప్రధాని ఐకె గుజ్రాల్ తన మంత్రి వర్గంలో జైపాల్ రెడ్డిని చేర్చుకున్నప్పుడు లోక్‌సభ, రాజ్యసభ దేంట్లోనూ ఆయన సభ్యుడు కాకపోయినప్పటికీ కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రిగా నియామకం కావడం అసాధారమైన విషయమే. ఆకాశవాణి, దూరదర్శన్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ‘ప్రసార భారతి’ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయగలిగిన శక్తియుక్తి జైపాల్‌రెడ్డికి మాత్రమే ఉందని మంత్రివర్గంలోకి తీసుకున్నట్టు ఒక సందర్భంలో ప్రధాని ఐకె గుజ్రాల్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కె రోశయ్య తర్వాత ముఖ్యమంత్రిగా -జైపాల్ రెడ్డిని పంపించాలని ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ప్రతిపాదిస్తే, తానే సున్నితంగా తిరస్కరించిన విషయాన్ని తన అంతర్గత సంభాషణలలో జైపాల్‌రెడ్డి గుర్తు చేసేవారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయనీ, ముఖ్యమంత్రి పదవి కోసం తాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్ తాకట్టు పెట్టారన్న అపప్రదను మోయాల్సి వస్తుందని, ఆ ప్రతిపాదనను తిరస్కరించడానికి కారణమని తన సన్నిహితుల వద్ద చెప్పేవారు. జైపాల్‌రెడ్డి జాతీయస్థాయిలో రాణించడానికి అనేక కోణాలు దోహదం చేశాయి. క్షేత్రస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు ఏ అంశంపైనైనా లోతైన అవగాహన, విశ్లేషణ, బహు భాషా ప్రావీణ్యం, రాజకీయ చతురత, చతురోక్తులు, మంచి వక్త కావడం దోహదం చేశాయి. అసెంబ్లీ, పార్లమెంట్‌లో మాట్లాడినా, ప్రెస్ మీట్లు, బహిరంగ సభలలో మాట్లాడినా ఎంతటి జటిల మైన అంశాన్ని కూడా సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పడం జైపాల్‌రెడ్డి ప్రత్యేకత. ఆయన పద ప్రయోగాలు, వ్యంగ్యోక్తులు సభలు, సమావేశాల్లో నవ్వుల్లో ముంచెత్తేవి. రాష్ట్ర రాజకీయాలలో కొనసాగినప్పుడు శాసనసభలో జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు చేసే ప్రసంగాలను ఆకాశవాణిలో వినడానికి జనం ఎగబడేవారు. శాసనసభలో తమను తిరుపతి వెంకటకవులుగా పిలిచేవారని ఒక సందర్భంలో వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.

ఎంతటి వివాదాస్పద అంశాలపైన అయినా వివాదాల్లో చిక్కుకోకుండా ఆచితూచి మాట్లాడటం జైపాల్‌రెడ్డికున్న మరో ప్రత్యేకత. ఆంగ్లం, తెలుగు భాషలపై ఉస్మానియా విశ్వవిద్యాల యంలో మాస్టర్ డిగ్రీ చేసిన జైపాల్‌రెడ్డికి ఆంగ్ల భాషపై ఉన్న పట్టు అసమానం. పార్లమెంట్‌లో, మీడియా సమావేశాల్లో ఆయన వాడిన పదప్రయోగాలకు తలపండిన ఆంగ్లపండితులు, సీనియర్ జర్నలిస్టులు సైతం డిక్షనరీలను వెతికేవారని చెబుతారు. భాషపై ఎంత పట్టుందో అంతకుమించిన చతురత కూడా ఆయనకే సొంతం. ప్రధాని చంద్రశేఖర్ మంత్రివర్గంలో డాక్టర్ సుబ్రమణ్యస్వామిని న్యాయశాఖ మంత్రిగా నియమించుకున్నప్పుడు ‘ప్రసిద్ధ లాయర్ అయినందుకు కాదు, ఘోరమైన లిటిగెంట్ అయినందుకే ఆయనకు ఆ పదవి దక్కింది’ (‘నాట్ బికాజ్ హి ఈజ్ ఎ నోటెడ్ లాయర్. బట్ బికాజ్ హి ఈజ్ ఎ లిటిగెంట్ లాయర్’) అని జైపాల్‌రెడ్డి చమత్కరించారు. పార్లమెంట్‌లో ప్రపంచ వర్తక, వాణిజ్య ఒప్పందం (గాట్)పై జరిగిన చర్చ సందర్భంగా దానిని ‘గాటోక్రసీ’గా అభివర్ణించారు. అలాగే ‘గ్లోబలైజేషన్’ ఎక్కడికి దారితీస్తుందో వివరించే సందర్భంగా ఘోటాలైజేషన్’ (కుంభకోణాల వ్యవస్థ)గా అభివర్ణించారు. ‘నియో రిచ్’ పదాన్ని ‘లంపెన్ నియో రిచ్’గా (అలగా సంపన్న వర్గంగా) కొత్త పదాన్ని సృష్టించిందీ జైపాల్‌రెడ్డినే. కొత్త పదాలు, పదబంధాలు సృష్టించడంలో జైపాల్‌రెడ్డి దిట్ట. జైపాల్‌రెడ్డి లేని లోటు ఒక్క రాజకీయ రంగానికే కాకుండా, మేధావి లోకానికి, భాషా -పాండిత్య ప్రపంచానికి కూడా తీరని లోటే..

– వెల్జాల చంద్రశేఖర్ రావు

98499 98092

( జనవరి 16న జైపాల్‌రెడ్డి జయంతి సందర్భంగా )